జాతీయ వార్తలు

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: రైతులు సాధికారులై గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం పరివర్తన చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే వ్యవసాయభివృద్ది మేళాను శనివారం ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ వ్యవసాయ విధానాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. వ్యవసాయ మేళా ఏర్పాటు చేయటం వెనక ఉన్న లక్ష్యం కూడా ఇదేనని ఆయన అన్నారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలు శక్తిని పెంచాల్సి ఉన్నదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు. అందుకు తన ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసకుంటోందని ప్రధాన మంత్రి చెప్పారు. దేశంలోని తూర్పు ప్రాంతాల నుండి రెండవ హరిత విప్లవాన్ని సాధించవలసి ఉన్నదని, ఈ లక్ష్య సాధనకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నీటి పారుదల రంగాన్ని మరింత పటిష్టం చేయాలని, నీటిని పొదుపు చేయటంద్వారా ఈ వేసవిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని మోదీ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన రైతులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతుల ఆదాయాన్ని బాగా పెంచవచ్చునని ఆయన చెప్పారు. 2016-17 సంవత్సరం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆయన ప్రశంసించారు. బడ్జెట్ పేద ప్రజలు, రైతులకు మేలు చేస్తుందని తెలిపారు. భూసార కార్డుల విధానంద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. భారత వ్యవసాయ రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలంటూ ఈ లక్ష్యం ఎంతమాత్రం కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కృషి ఉన్నతి మేళా దేశ గమ్యాన్ని మార్చివేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగం, రైతులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిద్వారా దేశ భవిష్యత్తును నిర్ధారించాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశంలో రెండవ హరిత విప్లవాన్ని సాధించే దిశగా తన ప్రభుత్వం అడుగులు వేస్తోందని మోదీ ప్రకటించారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించటంద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి వ్యవసాయ, నీటి పారుదల పథకం, భూసార ఆరోగ్య కార్డుల విధానంద్వారా వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిన ఎనిమిది రాష్ట్రాలు, రైతులకు క్రిషి కర్మన్ అవార్డులను ప్రధాని బహూకరించారు.