జాతీయ వార్తలు

ఇక కమలపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపిని విస్తరించేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ప్రకటించారు. అసోంలో పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టిన రామ్‌మాధవ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తామని, 2019 ఎన్నికల్లో మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేలా పార్టీని సిద్ధం చేస్తామని చెప్పారు. ఆంధ్రలో మరింత ఎదుగుతామని, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరడమే లక్ష్యమని ప్రకటించారు. ఏపీ బిజెపికి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారన్నారు. కేంద్ర కేబినెట్‌లో చేరనున్నట్టు వస్తున్న వార్తలను రామ్‌మాధవ్ ఖండించారు. నేను మంత్రిగా కాదు, మహా మంత్రి (ప్రధాన కార్యదర్శి)గా ఉంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని చమత్కరించారు. కేరళ నుంచి బెంగాల్ వరకు కోరమండల్ తీరంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సిఎం చంద్రబాబు కేంద్రంతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఆంధ్రలో తాము తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలో ఉన్నాం. అధికార పార్టీగా ప్రజామన్నన పొందుతూనే బిజెపిని పటిష్టం చేసుకుంటూ విస్తరణకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తాం. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. ఆ శూన్యాన్ని బిజెపితో పూడ్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బిజెపికి మంచి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విభజన చట్టం హామీలు నెరవేరలేదు. హోదా ఇవ్వకపోవటంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రలో బిజెపి ఎలా ఎదుగుతుందన్న మీడియా ప్రశ్నకు సమధానమిస్తూ ఆంధ్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. ఈ ఫలితాలతోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. బిజెపిపై ప్రజల్లో నెలకొన్న తప్పుడు అభిప్రాయాలు, అపోహలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తామని రామ్‌మాధవ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాను ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారన్నది వాస్తవం. దీనికి సంబంధించి కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఆంధ్రకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అన్నారు. గత రెండేళ్లలో కేంద్రం ఆంధ్రకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రానున్న రెండు మూడేళ్లలో అనేక విధాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. ఆంధ్ర బిజెపి శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించే విషయంలో జాతీయాధ్యక్షుడు అమిత్ షా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని రామ్‌మాధవ్ వెల్లడించారు. తెలంగాణలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాం. రెండో స్థానానికి రావటానికి కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి ఎదిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా పార్టీని విస్తరిస్తామన్నారు. తెలంగాణలో రెండోస్థాయికి ఎదగటాన్ని సవాల్‌గా తీసుకున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తామన్నారు.
అసోం ఎన్నికల్లో విజయానికి ఎంతోమంది కృషి ఉందని, ఎన్నో అంశాలు అక్కడ బలంగా పని చేశాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎంతో చేసిందన్నారు. ఆ ఫలాలే ఇప్పుడు ప్రజలకు చేరుతున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. రెండేళ్ల రిపోర్ట్ కార్డును ఈనెల 26న శహరాన్‌పూర్ ర్యాలీలో మోదీ ప్రజల ముందు పెడతారని రామ్‌మాధవ్ చెప్పారు. బిజెపి మంత్రులు, నాయకులు, ఇతర ప్రముఖులు 27నుంచి తమ ప్రాంతాలకు వెళ్లి రిపోర్టు కార్డు వివరాలను ప్రజలకు వివరిస్తారన్నారు. ప్రతి రాష్ట్రంలో కుల రాజకీయాలు ఉంటాయి కానీ, మోదీ ప్రభుత్వం మంచి పనుల ద్వారా బిజెపిని పటిష్టం చేస్తామన్నారు. మత అసహనం ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని, మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు.