జాతీయ వార్తలు

కరవు నిధికి తరుణమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలోని వివిధ రాష్ట్రాలు వర్షాభావంతో తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లును పరిశీలించాల్సిందిగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ బిల్లు దేశంలోని రైతులకు గణనీయంగా రక్షణాత్మక చర్యలు కల్పిస్తుందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. ‘కరవు, వర్షాభావ ప్రాంతాల రైతుల సంక్షేమం, ఇతర ప్రత్యేకాంశాల బిల్లు-2014’ ను డిసెంబర్ 2014లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభలో ప్రైవేటు సభ్యుడి బిల్లు రూపంలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒకవేళ చట్టరూపంలోకి వస్తే కరవు ప్రాంతాల రైతుల సంక్షేమ మూలనిధిని రూ. 10వేల కోట్లతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిధితో పాటుగా మొత్తంగా కరవు రైతులకోసం ఒకసారి వార్షిక వ్యయం రూ.20 వేల కోట్లు, మరో రూ.5వేల కోట్లు భారత సంచిత నిధి నుంచి ఖర్చువుతాయని బిల్లులోని ఫైనాన్షియల్ మెమొరాండం పేర్కొంది. అంటే ఈ బిల్లు సంచిత నిధితో ముడిపడి ఉంటుంది కాబట్టి రాష్టప్రతి సిఫారసు లేకుండా పార్లమెంటు ఆమోదించటం సాధ్యం కాదు. అయితే ఇందుకు సంబంధించి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లేఖ రాస్తూ రాజ్యసభ నిబంధనావళి లోని 117(3) కింద చర్చకు చేపట్టే ఆలోచన ఉందని రాష్టప్రతికి నివేదించినట్లు పేర్కొన్నారు. 117 నిబంధన పరిధిలో ఆర్థిక, ద్రవ్య బిల్లులు మాత్రమే వస్తాయి. ద్రవ్య బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభకు పరిమిత పాత్ర ఉంటుంది. ఈ బిల్లును ఆమోదించినా, తిరస్కరించినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. 117 నిబంధనలోని మూడో క్లాజ్ ప్రకారం ఈ బిల్లును ఏ సభలోనైనా ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లులనైతే వాటిని ఆమోదించటానికి, లేదా తిరస్కరించటానికి.. సవరణలు చేయటానికైనా రాజ్యసభకు పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటంతో అహ్మద్ పటేల్ బిల్లును చర్చకు చేపడితే.. కచ్చితంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అవుతుంది.
బిల్లులోని ప్రధానాంశాలు
- కరవు రాష్ట్రాలకు తగిన నిధులను కేంద్రం కేటాయించటం తప్పనిసరి
- రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం తప్పనిసరి చర్యలు చేపట్టాలి
- వర్షాభావ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిషా వంటి రాష్ట్రాలు తరచూ కరవుకు గురవుతున్నాయి. ఈ రాష్ట్రాలలోని రైతాంగ సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.
- పంటలు, పశువులు నష్టపోయి ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, తీరని అప్పులతో బాధపడే రైతన్నకు మేలు చేయటమే బిల్లు లక్ష్యం.