జాతీయ వార్తలు

ఏ పొరపాటుకూ ఆస్కారం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: విధుల నిర్వహణలో ఎన్నికల పరిశీలకులు అత్యంత జాగురూకత పాటించాలని, ఏ చిన్న తప్పిదానికి లేదా పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సోమవారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రామాణిక పరిశీలనా విధానాలకు త్రికరణశుద్ధిగా కట్టుబడి పనిచేయాలని ఆయన పరిశీలకులకు స్పష్టం చేశారు. పరిశీలకులు తమ బాధ్యతల నిర్వహణలో ఏ చిన్న పొరపాట్లకు అవకాశం ఇచ్చినా అతి తీవ్రస్థాయిలో ప్రచారమై పోతుందని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రాలకు పరిశీలకులుగా నియమితులైన అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీరిని ఎన్నికల కమిషన్ నియమించింది కాబట్టి వీరంతా తటస్థంగా, బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా పనిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పోటీలో ఉన్న పార్టీలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లకు చెందిన 500 మంది అధికారులను వచ్చే నెల 21న జరుగనున్న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమించారు. ఈ పరిశీలకుల్లో ఐఆర్‌ఎస్‌తోపాటు సెంట్రల్ సర్వీసుకు చెందినవారు కూడా ఉన్నారు. వీరంతా సీఈసీ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరికీ సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల అమల్లో కఠినంగా వ్యవహరించాలని, ఇతర విధివిధానాలను నిష్పాక్షికంగా అనుసరించాలని వీరికి అరోరా స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం ఉన్నా దానిపై మీడియాలో రాద్ధాంతం జరిగే అవకాశం ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదని అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలకుల విధులకు సంబంధించి ఎన్నికల కమిషన్ చాలా స్పష్టమైన విధానాలను రూపొందించిందని ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా తెలిపారు. ఎన్నికల అంశాలకు సంబంధించి ఈ పరిశీలకులు ఇచ్చే వివరాలపైనే కమిషన్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు తమ విధులను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల పరిశీలకులు అందరూ సీఈసీ తరఫున పనిచేస్తున్నారు కాబట్టి వీరికి అత్యంత కీలకమైన రాజ్యాంగ బాధ్యత కూడా ఉందని మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా అన్ని అంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు కనీస సౌకర్యాల కల్పన నుంచి అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాలని అన్నారు.