జాతీయ వార్తలు

నెహ్రూ తప్పిదమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడ్డానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తప్పిదమే కారణమని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. పాకిస్తాన్‌తో అప్పట్లో జరుగుతున్న యుద్ధాన్ని మధ్యలోనే ఆపి నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించారని, ఆయన ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి వుంటే ఆక్రమిత కాశ్మీర్ ఊసే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. నిన్న మొన్నటి వరకు భారత్‌లో కాశ్మీర్ పూర్తి స్థాయిలో విలీనం కాకపోవడానికి నెహ్రూ వ్యవహరించిన తీరే కారణమని అమిత్ షా తెలిపారు. అప్పట్లో ఈ అంశాన్ని హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్‌కు అప్పగించి వుంటే ఆయన సరైన నిర్ణయం తీసుకుని ఉండేవారని ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు. అప్పట్లో నెహ్రూ ఐరాస చార్టర్‌లోని 35వ అధికరణ కింద సమితిని ఆశ్రయించారని, అయితే 51వ చార్టర్ కింద అభ్యర్థన చేసివుంటే ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లోనే ఉండి ఉండేదని అమిత్ షా అన్నారు. 1950లో సర్దార్ పటేల్ మరణం తర్వాత షేక్ అబ్దుల్లాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, 370 ప్రత్యేక అధికరణ రావడానికి ఆ ఒప్పందమే కారణమని అమిత్ షా అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన వారిలో మన్మోహన్ సింగ్, ఐ.కే గుజ్రాల్‌లు ప్రధాన మంత్రి పదవులు చేపట్టారని, అలాగే ఎల్.కె అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారని అమిత్ షా అన్నారు. కానీ, 370 అధికరణ రద్దు చేసే వరకు కాశ్మీర్ వెళ్లిన ఎవరికీ ఓటు హక్కే లేకుండా పోయిందన్నారు. ఇప్పుడా ప్రజలు హాయిగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవచ్చు అన్నారు. వచ్చే నెలలో జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని జరిగిన ఈ ర్యాలీలో 370 అధికరణ రద్దును అమిత్ షా ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఈ అధికరణ రద్దుతో బీజేపీ బాధ్యత ముగిసినట్టు కాదు, నిజానికి ఇప్పటి నుంచే మొదలైనట్టు..’ అని పార్టీ కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు. జాతీయ వాదం, అభివృద్ధి ప్రాతిపదికగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. 370 అధికరణ రద్దును కాంగ్రెస్, ఎంసీపీలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. వచ్చే నెల 21న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిసే వస్తారన్న ధీమాను అమిత్ షా వ్యక్తం చేశారు. కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చర్చతోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు కావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయ రంగును ఆపాదించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, కానీ తాము కాశ్మీర్ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే వ్యవహరించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుకు సంబంధించి ముఖ్యంగా సర్జికల్ దాడులపై సాక్ష్యాలు కావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. రాహుల్, ఎన్‌సీపీ నాయకుడు శరద్‌పవార్ ప్రచారానికి వచ్చినప్పుడు 370 అధికరణపై వారి అభిప్రాయాన్ని అడగండి అని ప్రజలను అమిత్ షా కోరారు.
*చిత్రం... ముంబయిలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా