జాతీయ వార్తలు

ఇది దీర్ఘకాలిక యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్.. భారత్‌ను బలవంతంగా దీర్ఘకాలిక యుద్ధంలోకి దింపిందని, ఈ యుద్ధంలో ఇటీవల ఉరీ సెక్టార్‌లో మన సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఒక భాగం మాత్రమేనని, అదే చివరి అంకం కాదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ వైపునుంచి భారత భూభాగంలోకి చొరబడటానికి గత ఎనిమిది నెలల కాలంలో ఉగ్రవాదులు 17సార్లు చేసిన ప్రయత్నాలను భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయని ఆయన పేర్కొన్నారు. దీంతో వారు నిరాశా నిస్పృహలకు గురయి ఉరీ సెక్టార్‌లో దొంగచాటుగా దాడికి దిగారని విమర్శించారు. అయితే ఈ దాడే చివరిది కాదని, అంతిమ విజయం భారత్‌దేనని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రారంభోపన్యాసం చేశారు. ఉగ్రవాద దాడికి బాధ్యులయిన వారిని శిక్షించి తీరుతామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృక్పథాన్ని ఆయన ఉటంకించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టిబుద్ధి చెప్పడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బిజెపి ఉన్నతస్థాయి నాయకులు వేదికపై ఆసీనులయి ఉండగా స్వాగతోపన్యాసం చేసిన అమిత్ షా తరువాత ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక ప్రకటన చేశారు. ‘ఉరీ సెక్టార్‌లో దాడి వెనుక ఉన్న సూత్రధారులపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టు బిజెపి భావిస్తున్నది. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం ఉపేక్ష వహించరాదనే వైఖరిని బిజెపి, కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ అనుసరిస్తున్నాయి. ఉగ్రవాదులను ఓడించడానికి గట్టిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక, పటిష్ఠమైన పోరాటాన్ని ప్రారంభించడంతో ఇటీవలి కాలంలో అత్యధికంగా గత 8 నెలల కాలంలో 117 మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది’ అని అమిత్ షా అన్నారు. ప్రభుత్వ విధానంలో ఉగ్రవాదం భాగమయితే అది యుద్ధనేరమే అవుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడానికి ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన కృషికి పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని అన్నారు. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించడంలో భారత ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో జరుగుతున్న ఈ దీర్ఘకాలిక యుద్ధంలో ప్రభుత్వానికి, ఆర్మీకి మద్దతివ్వాలని ఆయన వివిధ పార్టీలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, భారత రాజ్యాంగంపై నమ్మకంలేని వారితో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని అమిత్ షా అన్నారు. దీంతో కాశ్మీర్ వేర్పాటువాదులతో ఎలాంటి చర్చలు ఉండబోవనే స్పష్టమైన సంకేతాలను ఆయన పంపించినట్టు అయింది. తమను తాము భారతీయులుగా భావించుకునే వారితో మాత్రమే కేంద్రం చర్చలు జరుపుతుందని ఆయన అన్నారు.

చిత్రం.. బిజెపి జాతీయ మండలి సమావేశాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. చిత్రంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు