జాతీయ వార్తలు

క్లైమాక్స్‌కు కర్నాటక డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై, 21: రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటక రాజకీయ సంక్షోభానికి సోమవారం తెరపడుతుందని అంటున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా? లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వైదొలగుతుందా? అనేది ఆసక్తి రేపుతున్నది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ఇది వరకే అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ, ఎత్తులు, పైఎత్తుల నేపథ్యంలో చర్చ సోమవారానికి వాయిదా పడింది. చర్చ ముగిసి, అదే రోజున ఓటింగ్ జరగాలని, లేకపోతే, రాజ్యాంగ సంక్షోభం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ విజుభాయ్ వాలా ఇచ్చిన రెండు డెడ్‌లైన్లను కర్నాటక సర్కారు ఖాతరు చేయలేదు. గవర్నర్ రాసిన లేఖను ‘లవ్ లెటర్’ అంటూ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించడాన్ని చూస్తుంటే, మరోసారి సభను వాయిదా వేయించడం ద్వారా, మరికొంత కాలం పదవిలో కొనసాగాలన్నది సర్కారు ఉద్దేశంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి సుప్రీం కోర్టు, 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన ముంబయి హోటల్, విశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన అసెంబ్లీ హాల్ మధ్య కర్నాటక రాజకీయం చక్కర్లు కొడుతున్నది. మూడు వారాల క్రితం సర్కారుపై తిరుగుబావుటా ఎగరేసిన కొంత మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలను సమర్పించడంతో కర్నాటక రాజకీయ సంక్షోభానికి బీజం పడింది. వారిని సభకు రప్పించి, విప్‌ను జారీ చేయడం ద్వారా వారి ఎత్తుగడలను చిత్తుచేయాలన్నది కుమారస్వామి సర్కారు వ్యూహం. అయితే, దీనిని ముందుగానే పసిగట్టిన రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి సానుకూల స్పందన లభించింది. సభకు హాజరుకావాలా? వద్దా? అన్నది వారివారి ఇష్టాయిష్టాలకు సంబంధించిందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక, సభకు వచ్చితీరాలని రెబెల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావద్దని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనితో విప్ జారీ వ్యూహం బెడిసికొట్టడంతో పూర్తి ఆత్మరక్షణలో పడిన కుమారస్వామి సర్కారు, సాధ్యమైనంత వరకూ విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో, రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి లేదా రాజీకి రావడం ద్వారా సమస్య నుంచి బయటపడాలని చూస్తున్నది. అయితే, ముంబయిలోని ఒక హోటల్‌లో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ నాయకులకు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. తమను కలుసుకోవడానికి ప్రయత్నించిన మంత్రులను సైతం వారు దూరంగానే ఉంచారు.
ఈ పరిస్థితుల్లో రెబెల్స్‌ను సముదాయించడం ఎంత వరకు సాధ్యమనేదే ప్రశ్న. విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని స్పీకర్ రమేష్ కుమార్ శుక్రవారం నాడే ప్రకటించారు. కానీ, ఆయన మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.