జాతీయ వార్తలు

నేతాజీ మృతిపై తొలగని మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారనే భావన బలపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాలతో ఆయన అదృశ్యం, మృతిపై నెలకొన్న మిస్టరీ మరింత పెరిగింది. నేతాజీ దుర్మరణానికి కారణమైనట్లుగా భావిస్తున్న విమాన ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆయన మూడుసార్లు చేసిన ఉపన్యాసాలు ప్రసారం కావడం ఆయన అదృశ్యంపై మిస్టరీని మరింత పెంచింది. 1945 ఆగస్టు 18న తైపేయి (అప్పట్లో ఫోర్‌మొసగా పిలిచేవారు)లో జరిగిన విమాన ప్రమాదం తరువాత కూడా నేతాజీ జీవించి ఉన్నట్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన రహస్య పత్రాలలోని కొన్ని పత్రాలు సూచిస్తున్నాయి. 1945 తరువాత కూడా నేతాజీ జీవించి ఉన్నట్లు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయని ఒక ఆంగ్ల దినపత్రిక గురువారం సంచికలో ప్రచురించిన ఒక వార్తాకథనంలో పేర్కొంది. 1945 తరువాత ప్రసారమైనట్లుగా భావిస్తున్న ఈ మూడు ఉపన్యాసాల సారాంశం ప్రధాని కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఫైల్ నంబర్ 870/11/పి/16/92/పిఒఎల్‌లో ఉంది.
ఈ ఉపన్యాసాలలో పేర్కొన్న అంశాలు బహుశా బెంగాల్‌లోని గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఈ మూడు ఉపన్యాసాల ప్రసారాన్ని 31-మీటర్ బ్యాండ్‌పైన సేకరించినట్లు పిసి కర్ చెప్పినట్లుగా అదే ఫైలులో మరోచోట ఉంది. ఆర్‌జి కాసే బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో పిసి కర్ అనే అధికారి పనిచేశారు. దీనికి సంబంధించి కాసేకు ఒక నోట్‌ను కూడా సమర్పించారు. ఈ రికార్డుల ప్రకారం, తొలి ఉపన్యాసం 1945 డిసెంబర్ 26న ప్రసారమయింది. ఈ ఉపన్యాసంలో సుభాశ్ చంద్రబోస్ ఇలా చెప్పారు. ‘నేను ప్రస్తుతం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంలో ఆశ్రయం పొంది ఉన్నాను. నా హృదయం భారత్‌కోసం తపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం ఉద్ధృత స్థాయిలో ఉన్నప్పుడు నేను భారత్‌కు వెళ్తాను. ఈ యుద్ధం పదేళ్లు లేదా అంతకన్నా లోపే రావచ్చు. అప్పుడు భారత్‌లో నా వాళ్లను విచారిస్తున్న వారి సంగతి చెబుతాను’ అని నేతాజీ పేర్కొన్నారు. 1946 జనవరి ఒకటిన ప్రసారమైన తన రెండో ఉపన్యాసంలో భారత్ రెండేళ్లలోపు స్వాతంత్య్రం పొంది తీరాలని నేతాజీ అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలహీనపడిందని, అందువల్ల భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి అంగీకరిస్తుందని అన్నారు. అయితే అహింసా మార్గంలో భారత్‌కు స్వాతంత్య్రం రాదని, అయినప్పటికీ తాను మహాత్మాగాంధీని ఎంతో గౌరవిస్తానని నేతాజీ పేర్కొన్నారు. 1946 ఫిబ్రవరిలో ప్రసారమైన మూడో ఉపన్యాసంలో ‘నేను సుభాశ్ చంద్రబోస్‌ను మాట్లాడుతున్నాను, జై హింద్. జపాన్ లొంగుబాటు తరువాత నేను నా భారత సోదర సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడటం ఇది మూడోసారి..’ అని నేతాజీ అన్నారు.