జాతీయ వార్తలు

‘కాశ్మీర్’కు రాజకీయ పరిష్కారం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కాశ్మీర్ సమస్యకు పాలనాపరంగా కాక రాజకీయంగా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయనను కోరారు. ‘కాశ్మీర్ సమస్య ప్రధానంగా రాజకీయమైందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారడానికి కారణమైంది’ అని దాదాపు గంట సేపు రాష్టప్రతితో సమావేశం అనంతరం ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఒమర్ అబ్దుల్లా విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి జాప్యం చేయకుండా ఈ సమస్యతో సంబంధం ఉన్న అన్ని వర్గాలతోను అర్థవంతమైన చర్చల ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పాలని తాము రాష్టప్రతిని కోరినట్లు ఆయన చెప్పారు. రాజకీయ దృష్టితో సమస్యను పరిష్కరించడానికి కేంద్రం నిరాకరించడం దురదృష్టకరమని, రాష్ట్రంలో శాంతి సుస్థిరతలపై అది దీర్ఘకాల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
42 రోజుల క్రితం కాశ్మీర్ లోయలో ప్రారంభమైన మంటలు జమ్మూ ప్రాంతంలోని పీర్‌పంజాళ్ చీనాబ్ లోయ, కార్గిల్ ప్రాంతాలకు విస్తరించడం ఇప్పటికే ప్రారంభమైందని ఆయన అంటూ, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే వాళ్లు ఎప్పుడు మేల్కొంటారో అర్థం కావడం లేదని అన్నారు. పెట్రోలులాంటి నిత్యావసర వస్తువుల అమ్మకాలను ఆపేయడం లాంటి పరిపాలనాపరమైన చర్యల ద్వారా ఆందోళనను అణగదొక్కడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను ప్రతిపక్ష పార్టీలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఒమర్‌తో పాటుగా రాష్టప్రతిని కలిసిన వారిలో కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు జిఏ మిర్ నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు, సిపిఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హకీమ్ యాసీన్ ఉన్నారు. ఈ బృందం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ను కూడా కోరింది. అంతేకాక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా ఇతర ప్రతిపక్ష నాయకులను కూడా ఈ బృందం కలుసుకోనుంది.
కొనసాగుతున్న కర్ఫ్యూ
శ్రీనగర్: శ్రీనగర్ జిల్లాతో పాటు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పాంపోర పట్టణాలలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. వేర్పాటువాదులు శ్రీనగర్‌కు శనివారం ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించాలని పిలుపునిచ్చారు. కర్ఫ్యూ, ఆంక్షలు, వేర్పాటువాదుల నిరసన కార్యక్రమాలతో కాశ్మీర్‌లో వరుసగా 43వ రోజు సాధారణ జనజీవనం స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కార్యాలయాలు మూసివేసి ఉన్నాయి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగుల హాజరు శాతం బాగా తగ్గింది. మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులు ఇంకా నిలిపివేసే ఉన్నాయి. జూలై 9న మొదలయిన ఘర్షణల్లో ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులు సహా 64 మంది మృతి చెందారు.

చిత్రాలు..కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో అంబులెన్సులను సైతం పోలీసులు అనుమతించకపోవడంతో శ్రీనగర్‌లోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు

కాశ్మీర్ పరిస్థితిపై శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన
మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతినిధి బృందం