క్రీడాభూమి

నేగీకి మోదం.. పాండేకి ఖేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: త్వరలో జరుగనున్న ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు ఐసిసి ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత సెలెక్టర్లు శుక్రవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. యువకులు, అనుభవజ్ఞులను ఏర్చి కూర్చిన ఈ జట్టులో అన్‌క్యాప్డ్ యువ ఆల్‌రౌండర్ పవన్ నేగీ (23)తో పాటు గాయాలతో ఇబ్బందులు పడుతున్న పేసర్ మహమ్మద్ షమీ (25)కి చోటు కల్పించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా మూల స్వరూపంలో పెద్దగా మార్పులేమీ చేయకుండా ఎంపిక చేసిన ఈ జట్టులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పదిలంగా ఉంచడంతో పాటు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చక్కగా రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి యువ ఆటగాళ్లకు మరోసారి అవకాశం కల్పించారు. అయితే సీనియర్ పేసర్ ఇశాంత్ శర్మ, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లతో పాటు వర్థమాన బ్యాట్స్‌మన్ మనీష్ పాండేకి ఈ జట్టులో చోటు కల్పించలేదు. న్యూఢిల్లీలో శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ థాకూర్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్లకు 15 మంది సభ్యులతో ఎంపిక చేసిన భారత జట్టును ఎంతో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నామని సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బందులు పడుతున్న షమీని సెలెక్టర్లు ఈ జట్టులోకి ఎంపిక చేయడం ద్వారా కొంత రిస్కు తీసుకున్నారని చెప్పవచ్చు. మోకాలికి తగిలిన గాయం కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న షమీకి గత నెల ఆస్ట్రేలియా తొడ కండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి షమీ సకాలంలో కోలుకోలేకపోతే భారత జట్టులోకి అతనికి బదులుగా మరో ఆటగాడిని తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం భారత జట్టుకు అందుబాటులో ఉన్న ఉత్తమ బౌలర్లలో షమీ ఒకడని, ప్రపంచ కప్ టి-20 టోర్నీకి ఇంకా నెల రోజుల వ్యవధి ఉన్నందున షమీ గురించి తుది నిర్ణయం తీసుకునేందుకు తమకు ఈ సమయం చక్కగా సరిపోతుందని సందీప్ పాటిల్ తెలిపారు.
ఇశాంత్, భువీలకు దక్కని చోటు
ఇదిలావుంటే, ఆసియా కప్, ప్రపంచ కప్ టి-20 టోర్నీలకు ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేస్ బౌలర్ ఇశాంత్ శర్మతో పాటు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు చోటు లభించలేదు. ట్వంటీ-20 ఫార్మాట్‌లో ఇశాంత్ 2013 నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా ట్వంటీ-20 మ్యాచ్‌లకు దూరమైన భువనేశ్వర్ కుమార్ అంతకుముందు కంగారూలతో జరిగిన వనే్డ సిరీస్‌లో సరిగా రాణించలేకపోయిన విషయం తెలిసిందే. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుంచి సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న పవన్ నేగీ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో చక్కగా రాణించిన విషయం తెలిసిందే. ఎడమ చేతితో స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ మెరగైన ప్రదర్శనతో నేగీ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తుండటంతో అతనికి ఈ జట్టులో చోటు లభించింది.
అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్‌లో ఆడిన వర్థమాన బ్యాట్స్‌మన్ మనీష్ పాండేకి కూడా సెలెక్టర్లు ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఆస్ట్రేలియాలో అజింక్యా రహనే గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో మనీష్ పాండే బరిలోకి దిగి సెంచరీతో సత్తా చాటుకోవడంతో పాటు ఆ మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20కి భారత జట్టు ఎంపిక ప్రక్రియలో మనీష్ పాండే గురించి కూడా చర్చించినప్పటికీ అతని కంటే అనుభవజ్ఞుడైన రహానేకి చోటు కల్పించామని సందీప్ పాటిల్ వివరించారు. జట్టు ఎంపికలో సెలెక్టర్లు కేవలం సీనియర్లపైనే దృష్టి సారిస్తున్నారన్న వాదనలో నిజం లేదని, దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ, ఫిట్నెస్, వారి ట్రాక్ రికార్డులను కూడా పరిశీలించామని, కేవలం 15, 16 మంది ఆటగాళ్లకు పరిమితం కాకుండా దేశవాళీ ఆటగాళ్లందరి శక్తిసామర్ధ్యాలను పరిశీలించి చివరికి 15 సభ్యులతో ఈ జట్టును ఎంపిక చేశామని సందీప్ పాటిల్ పేర్కొన్నారు. కాగా, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క ట్వంటీ-20 మ్యాచ్‌లో కూడా ఆడకపోయినప్పటికీ సెలెక్టర్లు అతనికి ఈ జట్టులో చోటు కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో సభ్యుడిగా ఉన్న హర్భజన్‌పై అటు జట్టు యాజమాన్యానికి, ఇటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పూర్తి విశ్వాసం ఉందని, దీనితో పాటు హర్భజన్ ట్రాక్ రికార్డును, భారత జట్టుకు అతను అందించిన సేవలను కూడా దృష్టిలో ఉంచుకుని అతనికి ప్రపంచ కప్ జట్టులో మరోసారి అవకాశం కల్పించామని సందీప్ పాటిల్ వివరించారు. ఏది ఏమైనప్పటికీ భారత జట్టులో చేయదల్చుకున్న ప్రయోగాలన్నీ ఆస్ట్రేలియా పర్యటనలోనే చేసేశామని, రీప్లేస్‌మెంట్స్‌కు ఎవరైతే బాగుంటుందన్న దానిపై దృష్టి సారించి కొద్ది మంది ఆటగాళ్ల గురించి చర్చించామని ఆయన చెప్పారు.
ధోనీ సారథ్యంపై పూర్తి విశ్వాసం
ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ ఈ నెల 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లోనూ, ఆ తర్వాత ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు భారత్‌లోనూ జరుగుతాయి. ఈ టోర్నీలో భారత జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్న మహేంద్ర సింగ్ ధోనీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతను ఎప్పుడు రిటైర్ కావాలో చెప్పే హక్కు తమకు లేదని సందీప్ పాటిల్ తెలిపారు. ‘ఎవరు ఎప్పుడు రిటైర్ కావాలో చెప్పే హక్కు మాకు లేదు. ధోనీ కెప్టెన్సీపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించేందుకు అన్నివిధాలా ధోనీయే సరైనవాడు’ అని పాటిల్ అన్నారు.
జట్టు కూర్పు ఇదీ..
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, పవన్ నేగీ, మహమ్మద్ షమీ.