మిర్చిమసాలా

అది స్క్రిప్టయితే.. మరిదీ?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఎస్సార్సీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్న శాసనసభ్యులంతా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే వలస వెళుతున్నామంటూ ఒక కారణం చెబుతున్నారు. ఇక కొందరైతే జగన్ అంటే తమకు నేటికీ అభిమానం ఉందంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం ‘జగన్‌తో కలిసి ముందుకెళ్లలేకపోతున్నాం.. కనీసం వారి ఇంట్లో కాఫీ కూడా తాగలేదం’టూ మరో అడుగు ముందుకేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు ‘జగన్ సిఎం అవుతారు. ఇప్పటి వరకు జరిగిన పరిపాలనలో లోపాలన్నీ సరిదిద్దుతారు.. చంద్రబాబుకు ముస్లింలు అంటే పొసగదు’ అని విమర్శించారు కదా అని విలేఖరులు అడిగితే, సమాధానానికి జలీల్‌ఖాన్ ఏమాత్రం తడముకోలేదు. ‘అబ్బే! నేను మనస్ఫూర్తిగా అన్నమాటలు కావు.. జగన్ ముఠా ఇచ్చిన స్క్రిప్టు చూసి యథాతథంగా మాట్లాడుతుండేవాడిని’ అంటూ రహస్యం బయటపెట్టారు. పోనీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, చంద్రబాబుపై చేస్తున్న పొగడ్తలు గుండెలోతుల్లో నుంచి వస్తున్నాయా.. లేక సిఎం కార్యాలయం స్క్రిప్టు ఇస్తే చూసి మాట్లాడుతున్నారా?.. అనడిగితే ఆయన నోటమాట రాలేదు. జలీల్‌ఖాన్ గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది!
- నిమ్మరాజు చలపతిరావు

మారిన స్లోగన్!
టిఆర్‌ఎస్‌లో చేరేవారు బంగారు తెలంగాణ, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్టు చెప్ప డం, అదే ఆంధ్రలో అయితే నవ్యాంధ్ర కోసమని చెప్పడం రివాజు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో మారిన తాజా రాజకీయాల పరిణామాలతో ఈ స్లోగన్లు మారాయి. తెలంగాణలో అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమని, ఆంధ్రలో అయితే వైఎస్‌ఆర్‌సిపిలో తమకు తగిన గౌరవం లేదని చెబుతున్నారు. అక్కడా, ఇక్కడా కారణాలు ఏవైనా మరో మూడేళ్లపాటు అధికారంలో ఉండే పార్టీలో చేరడం ప్రయోజనకరమన్నది వీరి మనోగతం. తెలంగాణ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం టిఆర్‌ఎస్‌లో చేరినట్టు సెలవిచ్చారు. అయితే ఆయన చెప్పే దాంట్లో నిజం లేదు, పొంగులేటికి రూ. 1500 కోట్ల ఇరిగేషన్ కాంట్రా క్టు దక్కడం వల్లనే టిఆర్‌ఎస్‌లో చేరారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోని రేవంత్‌రెడ్డి చెప్పేదే నిజం అనుకుందాం. మరి ఆంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి నుంచి టిడిపిలో చేరేవారికి ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు దక్కాయో? రేవంత్‌రెడ్డి టిడిపిలోనే కొనసాగడానికి ఆంధ్రలో ఎన్ని కోట్ల కాంట్రాక్టు దక్కిందో చెప్పితే నిజాయితీ పరుడు అనిపించుకునే వారు.
- వెల్జాల చంద్రశేఖర్

బతికే ఉన్నాను
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సమాచారం వేగంగా చేరడం బాగానే ఉన్నా, అంతే వేగంగా అబద్ధాలు కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో బాబోయ్ నేను బతికే ఉన్నాను అని సినీనటుడు వేణుమాధవ్ ప్రకటించుకోవలసి వచ్చింది. నేను బతికే ఉన్నాను, నేను పోయినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న అందరిపై కేసులు పెడతాను అని వేణుమాధవ్ ప్రకటించారు. గతంలో ప్రతి సినిమాలో కనిపించే వేణుమాధవ్ గత కొంత కాలం నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. దాంతో అదే సమయంలో ఆయనపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. కొంత కాలం పాటు అనారోగ్యం గురించి ప్రచారం జరగ్గా ఇప్పుడు ఏకంగా పోయాడనే ప్రచారం మొదలైంది. వాట్సప్, ఫేస్‌బుక్ వంటి ప్రచార మాధ్యమాల్లో పైసా ఖర్చు లేకుండా సమాచారం క్షణాల్లో ఖండాలు దాటి పోతోంది.
- మురళి

హే కృష్ణా
జల జగడాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలో కావేరి నది కోసం తమిళనాడు, కర్నాటక నిత్యం యుద్ధం చేస్తుంటాయి. ఈరెండు రాష్ట్రాల మధ్య జరిగిన జలయుద్ధాలు హింసకు దారితీశాయి. కావేరి తర్వాత కృష్ణా నది నీటి కోసం ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది నాగార్జునసాగర్ వద్ద ఆంధ్ర,తెలంగాణ పోలీసులే ఘర్షణకు దిగారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి, డిండి స్కీంలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే వరుసగా నెల రోజుల పాటు ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా కుండపోత వర్షాలు పడితే కాని ఏ జలాశయం నిండని పరిస్ధితి. జల జగడాలను చూసి ప్రజలు హే కృష్ణా అని ఈ గొడవలు ఆపు అని స్మరిస్తున్నారు.
- శైలేంద్ర

రాముడికి లక్ష్మణుడిలా
ఖమ్మం వైకాపా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసంగిస్తూ రాముడి వెంట లక్ష్మణుడిలా తాను ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉంటూ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని చెప్పారు. భవిష్యత్తులో కెసిఆర్ కేంద్రంలోనూ చక్రం తిప్పుతారంటూ పొగడ్తలు కురిపించారు. భాగానే ఉంది కానీ, లోగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పొంగులేటి ఉన్నప్పుడూ జగన్‌ను రామునిలా పోలుస్తూ, తనను లక్ష్మణుడిలా పోల్చుకున్నారని, ఇప్పుడా జగన్‌ను వదలేసి పార్టీ ఫిరాయించారని సభలో కొంత మంది గుసగుసలాడుకున్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి