మీకు మీరే డాక్టర్
మోనోపాజ్లో నడుము నొప్పి - నివారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహిళలకు ఋతుక్రమం మొధలయ్యే కాలం ఎంత సమస్యాత్మకంగా ఉంటుందో ముగిసే కాలం కూడా అంతే సమస్యాత్మకంగా ఉంటుంది.
రజస్వల అయ్యే వయసు ఆడపిల్లలు ఎక్కువమంది 7వ తరగతిలో ఉంటారు. కామన్ పరీక్షలు, తీవ్రమైన పనివత్తిడి, ర్యాంకుల కోసం ఆందోళన ఇలాంటివి ఆ లేతవయసులో వాళ్లని తీవ్రమైన మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. శరీర ఆకృతుల్లో వస్తున్న మార్పులు ఈ ఆందోళనను మరింత పెంచుతాయి.
ఋతుక్రమం ముగింపు దశ (మోనోపాజ్) సమయానికి మహిళలు అంతకన్నా ఎక్కువ వత్తిళ్లకు లోనవుతుంటారు. పిల్లల పెళ్లిళ్లు, కొత్త బంధుత్వాలు, కొత్త సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మోనోపాజ్లో ఉన్న మహిళలను చుట్టుముడుతుంటాయి. పిల్లలు తమ దారి తాము చూసుకుంటుంటే తల్లులు దిగాలుగా చూస్తుండే కాలం అది! ఉద్యోగినులైతే ఆ సమయంలో ఎక్కువ మందికి ప్రమోషన్లు, అదనపు బాధ్యతలు, తీవ్రమైన పనివత్తిడి కలుగుతుంటాయి. పై అధికారుల మన్ననల కన్నా అక్షింతలు ఎక్కువగా పడుతుంటాయి. వీటన్నింటి సమాహారమే మోనోపాజ్.
మోనోపాజ్ సమయంలోనూ, ఆ తరువాత, స్ర్తిలల్లో నడుమునొప్పి రావాటానికి విటమిన్ ‘డి’ లోపం గురించి 2020 ఫిబ్రవరి 12న మెడ్పేజీ టుడే వెబ్ జర్నల్లో ఒక నివేదిక ప్రచురితం అయ్యింది. నడుమునొప్పి అనగానే ఒక నొప్పి బిళ్ల మింగటం తప్ప దాని కారణాల గురించి మనం పెద్దగా ఆలోచించం. మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు ఇవన్నీ రావాలి కాబట్టి వస్తాయంతే అనుకుంటారు. ఒకవేళ షుగరు, లేదా బీపీ ఉంటే, అన్నింటికీ అవే కారణం అనుకుంటారు.
భారతదేశంలో మహిళల్లో 5 శాతం మందికి మాత్రమే తగిన పాళ్లలో విటమిన్ ‘డి’ అందుతోందని ఢిల్లీ ఎయిమ్స్, ఫోర్టిస్ ఆసుపత్రి డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యింది. ‘విటమిన్ డి’ తగినంత అందకపోవటానికి ఆహారంలో ‘డి’ విటమిన్ తక్కువగా ఉండటం ఒక కారణం అయితే, ఎండ తగినంతగా పడకపోవడం ఇంకో కారణం. ఈ రెండోదే ముఖ్య కారణం కూడా!
పూర్వం రాజ్యాంతఃపురాల్లో కాంతలు ఎండ తగలకుండా అంతఃపురాల్లోనే జీవిస్తుండేవారు. సూర్యుడి స్పర్శ తగలకుండా జీవిస్తుంటారు కాబట్టి, వీళ్లని ‘అసూర్యంపశ్య’లనే వారు. ఇప్పుడు రాజులు, రాజాంతఃపురాలు లేకపోయినా మన అపార్ట్మెంట్లు సూర్యరశ్మి ప్రవేశించకుండా ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ మంది మహిళలు అసూర్యంపశ్యలుగానే జీవిస్తున్నారు.
ఎక్కువమంది సూర్యోదయానికి పూర్వమే ఉదయం నడకని పూర్తి చేసేస్తారు. సాయంత్రం చల్లబడ్డాక గానీ ఇంట్లోంచి బయటకు రారు. ఎప్పుడో తప్ప పగలు బయటకు కాలుపెట్టని మహిళలకు ‘డి’ విటమిన్ లోపం సహజంగా వస్తుంది. ఏ ఇంట్లో పగలు లైట్లు వేసుకోవలసి వస్తోందో ఆ ఇంట్లో ఎముకల వ్యాధులు, కీళ్ల నొప్పుల వ్యాధులు, నడుమునొప్పి లాంటి బాధలున్న వాళ్లు ఉంటారని గమనించాలి. మన ఎముకలకే కాకుండా శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్యరశ్మి చాలా అవసరం.
మహిళల వస్తధ్రారణ కూడా సూర్యరశ్మి తగినంత తగలకపోవడానికి ఒక కారణం. పంజాబీ డ్రెస్సులు, చీరలు, నల్లని బురఖాలూ మహిళల్ని మరింత అసూర్యంపశ్యల్ని చేస్తాయి. వీరిలో ఎముకల వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకని మహిళలు సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ఎండలో గడపటం అవసరం.
మన జీవన వ్యవస్థలో మోనోపాజ్ వచ్చాక మహిళలకు ఎండ తగలటం మరింత తగ్గిపోతుంది. మోనోపాజ్ సమయంలో గానీ, ఆ తరువాత గానీ, హార్మోన్ల ప్రభావం మహిళల మీద ఎక్కువగా ఉండి ‘డి విటమిన్’ లోపానికి కారణం అవుతుంది.
శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా చర్మం సాయంతో తయారవుతుంది. చర్మానికి సూర్యరశ్మి తగిలితేనే, దాని తయారీ సక్రమంగా ఉంటుంది. లివరు, కిడ్నీలు విటమిన్ ‘డి’ని కాల్సిట్రాల్ అనే అసలైన హార్మోనుగా మార్పు చేస్తాయి. దీనే్న యాక్టివ్ డి విటమిన్ అంటారు. ఇది ఆహారంలోని కాల్షియం రక్తంలోకి చేరేలా చేస్తుంది. ఎముక పదార్థం పెరగటానికి ఇంత ప్రక్రియ అవసరం. విటమిన్ ‘డి’ వంటబట్టాలంటే సూర్యరశ్మి తగినంతగా రోజూ తగలాలని గుర్తుంచుకోవాలి.
రిఫైండ్ నూనెల్ని మన చేత బలవంతంగా వాడిస్తున్నారు. ఇవి వినియోగదారులు కోరి తెచ్చుకుంటున్నవి కాదు. బజార్లో మంచిది అనదగిన నూనె మరేదీ లేకపోవటం వలన మనం తప్పనిసరిగా రిఫైండ్ నూనెల్నే వాడుకుంటున్నాం. వంట నూనెలు బ్రహ్మపదార్థాలుగా తయారయ్యాయి. ఇవి మంచి కొవ్వును తగ్గించి చెడ్డకొవ్వు పెరిగేలా చేస్తాయి. ఈ చెడ్డకొవ్వు ఎముక ధాతువు రక్తంలోకి చేరకుండా అడ్డుపడుతుంటుంది. అందుకని ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకూ, మోనోపాజ్ వయసులో ఉన్న మహిళలకూ సాధ్యమైనంత వరకూ రిఫైండ్ నూనెలు వాడకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
మిల్లీలీటర్ రక్తంలో 50 నానోగ్రాముల కన్నా తక్కువ విటమిన్ డి ఉంటే, దానిని లోపంగా పరిగణిస్తారు. చాలామంది మహిళల్లో 5-20 నానోగ్రాములు మాత్రమే విటమిన్ ‘డి’ ఉంటోందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎముకలు, కీళ్లు అరిగిపోయాయనే మాటలతో ఈ పరిస్థితిని సరిపుచ్చుకుంటున్నారు. మెట్లెక్కినందు వలన మోకాళ్లు అరిగిపోయాయని, వంట చేసినందు వలన చేతి వేళ్లు వాచిపోయాయని భావిస్తుంటారు. ఎముకల్లో ఎముకపదార్థం తగ్గిపోవటం వలనే కీళ్లు దెబ్బతింటున్నాయని గ్రహించాలి. నొప్పి, వాపు బిళ్లలతో సరిపెట్టుకోవడం, కాల్షియం బిళ్లలు వాడి చికిత్స అయ్యిందని అనిపించుకోవటాల వలన ఉపయోగం, ఫలితం ఉండదు. తగినంతగా ‘డి’ విటమిన్ శరీరానికి వంటబట్టాలంటే రోజూ ఎండలో శరీర శ్రమ కొంతైనా జరగాలి.
త్వరగా అలసిపోవడం, కీళ్లనొప్పులు, పాదాలు వాయడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు విటమిన్ - డి లోపం ఏర్పడుతున్నదేమో చూపించుకోవలసి ఉంటుంది. ఎముకలు గోగుపుల్లల్లాగా తయారై పుటుక్కున విరుగుతుంటాయి. మన దేశంలో మూడు వైపులా సముద్రం ఉన్నా, ఆఖరికి మంచి నీళ్లు కూడా డబ్బెట్టి కొనుక్కుంటున్నాం. ప్రస్తుతానికి గాలి, ఎండ మాత్రం ఉచితంగా లభిస్తున్నాయి. కానీ, పర్యావరణ కారణాల వలన ఈ రెండూ కూడా ప్రమాదకరం అవుతున్నాయి. మనల్ని మనం కాపాడుకోవటానికి ఏం చెయ్యకూడదో అవన్నీ చేస్తున్నాం. ఏం చెయ్యాలో తెలుసుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాం. వెన్నుపూసల మధ్య డిస్క్ దెబ్బతిని ఎక్కువ మందిలో సయాటికా నడుంనొప్పి, మెడనొప్పి లాంటివి వస్తున్నాయి. ఈ డిస్కు దెబ్బతినటానికి బలమైన ఎముకధాతువు కొరత ప్రధాన కారణం కావచ్చు. నరాల్నీ, ఎముకల్నీ, మాంస కండరాల్నీ, అలాగే కీళ్ల లోపల ఉండే యంత్రాంగాన్ని ఎముక పదార్థం శక్తిమంతం చేస్తుంది. ఎముక పదార్థం బలహీనంగా ఉంటే ఈ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. మోకాళ్లు, వెన్ను పూసలూ అరిగిపోయాయంటే అర్థం ఇది. కేవలం కాల్షియం మాత్రలు, విటమిన్ డి మాత్రలు వాడేసినంత మాత్రాన ఈ సమస్య తీరదు. ఇవి వంటబట్టాలంటే ఆరోగ్యదాయకమైన సూర్యరశ్మి తగినంతగా శరీరానికి తగలాలి. ముఖ్యంగా మోనోపాజ్లో ఉన్న స్ర్తిలకు ఇది తప్పనిసరి.
ఎముకలు పుష్టిగా ఉండాలంటే ప్రొద్దున్న పూట టిఫిన్లు మానేసి కమ్మగా చేసుకున్న పెరుగన్నం తినండి. గుడ్డు వగైరా సమృద్ధిగా వాడండి. రిఫైండ్ నూనెల్ని సాధ్యమైనంత మానేయండి. హాయిగా ఎండలో ఓపిక ఉన్నంత మేర తిరగండి. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్’ అన్నారు. మన ఆరోగ్యం సూర్యభగవానుడి చేతుల్లోనే ఉంది. ఎండను సద్వినియోగపరచుకుందాం.