మెయన్ ఫీచర్

ఆర్థిక మాంద్యానికి తలవంచని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకుడికి పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండాలే కాని, ఎటువంటి ఆర్థిక మాంద్యా లు సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోలేవు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌ను చూస్తే సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా రాజీపడినట్లు కనపడలేదు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన అనేక పోరాటల తర్వాత ఆవిర్భవించింది. 2014-14 నుంచి 2020-21 వరకు మొత్తం ఏడు వార్షిక బడ్జెట్‌లను కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ ఆశించిన స్థాయిలో ఉండదని, అటూ ఇటూగా 1.55 లక్షల కోట్లకు పరిమితమవుతారని ఆర్థిక నిపుణులు భావించారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎకాఎకిన రూ. 1,82,914.42 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్‌రావు మార్చి 8వ తేదీ ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తొలిసారిగా ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజల ముందుంచారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 22,061.18 కోట్లు. బడ్జెట్ అంచనాలను విశే్లషిస్తే రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు.
ఈ బడ్జెట్‌లో మాయామహేంద్ర జాలాలు లేవు. ప్రజల ఆర్థిక శక్తిని మదింపు వేసిన సీఏం కేసీఆర్ ద్వి ముఖ వ్యూహంతో ఆర్థికాభివృద్థిని సాధించాలని మార్గనిర్దేశనం చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ఒక్కటే ఆర్థిక మాంద్యానికి విరుగుడు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుండడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే వ్యూహం కచ్చితంగా ఫలిస్తుందని ఆశించాలి.
తెలుగులో 62 పేజీలు ఉన్న ఈ బడ్జెట్ పుస్తకంలో ప్రభుత్వం పేర్కొన్న వివరాలను చూస్తే, బడ్జెట్ అనే దృక్పథం నుంచి ప్రభుత్వం బయటపడింది. ప్రజలు మాకు బలమైన మ్యాండేట్ ఇచ్చారు. అన్ని ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చారు. వారి కలలను సాకారం చేయాలి. దీనికి పటిష్టమైన వ్యూహాలు కావాలి. వచ్చే నాలుగేళ్ల పాటు తెలంగాణ ప్రజల భవిష్యత్తును జాగ్రత్తగా తీర్చిదిద్దాలనే బలమైన సంకల్పం పాలకుల్లో కనపడింది. సాధారణంగా జేబులో డబ్బు లేకపోతే ముందుగా సంక్షేమానికి కోతలు విధించడం మనకు అలవాటు. కేసీఆర్ దార్శనికతను చూసి ఆర్థిక నిపుణులు కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. సంక్షేమ రంగానికి నిధుల్లో కోతలు విధించలేదు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఒక అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తాను భూస్వామ్య కుటుంబంలో పుట్టానని మరోసారి చెప్పారు. కానీ బడ్జెట్‌లో మాత్రం పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారు.
తెలంగాణ కొత్త రాష్టమ్రని, వామపక్ష తీవ్రవాదానికి పుట్టినిల్లని, విద్యుత్ కొరతలు వేధిస్తాయనే పసలేని ఆలోచనలతో ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టులా తాజా వార్షిక బడ్జెట్ ఉంది. తెలంగాణ ఈ రోజు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని నొక్కి వక్కాణించక తప్పదు. ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం చివరి పేరాలో పేర్కొన్నారు. ప్రజలను విస్మరించి ఊహాజనితమైన ప్రాజెక్టులు, అభూత కల్పనలతో కూడిన అభివృద్ధిని చూపించి పాలన అందిస్తే ఎన్నికల్లో ఎటువంటి గత పడుతుందో గతేడాది ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బలమైన సందేశం ఇచ్చిన సంగతి విదితమే. తెలంగాణ ధనిక రాష్టమ్రే. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఆయువుపట్టు హైదరాబాద్. ఇప్పటికీ హైదరాబాద్ నుంచి 50 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత నగరానికి భిన్నంగా వాతావరణం ఉంది. పేదల సంక్షేమం, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, వ్యవసాయ రంగం, రైతు బంధు తదితర స్కీంలలో నిధుల కేటాయింపుల్లో కేసీఆర్ సర్కార్ ఎక్కడా దాగుడు మూతలు ఆడలేదు.
రైతు బంధుకు రూ. 14వేల కోట్లు, ఆసరా సామాజిక పెన్షన్లకు రూ. 11,758 కోట్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు రూ. 10,500కోట్లు కేటాయించడం చూస్తే రైతులు, పేదల పట్ల కేసీఆర్ సర్కార్‌కు ఉన్న శ్రద్ధ సూచిస్తుంది. మైనారిటీ సంక్షేమానికి రూ. 1,518.06 కోట్లు, కళ్యాణ లక్ష్మి స్కీంకు రూ. 1350 కోట్లుల, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 9771.28 కోట్లు, బీసీ సంక్షేమంకు రూ. 4,356.82 కోట్లు, ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ. 500 కోట్లు, స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ. 1200 కోట్లు కేటాయించారు. సంక్షేమ రంగానికి రూ. 40వేల కోట్లను కేటాయించారు. వృద్ధాప్యపెన్షన్ వయోపరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. ఆసరా కింద 39.41 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 16,534 కోట్లను కేటాయించారు.
భారతదేశ ఆర్థికాభివృద్ధిరేటు గత ఏడాదిన్నర నుంచి తగ్గుతూ వస్తోంది. దీని వల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలో, గ్రాంట్లలో కోత పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా , బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3731 కోట్లు తగ్గాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్‌టీలో కాని, జీఎస్‌టీ పరిహారంలో కానీ నిధులు సకాలంలో రావడం లేదు. వచ్చే నిదులను కూడా అరకొరగా కేంద్రం విడుదల చేస్తోంది. ఈ కారణాల వల్ల 2018-19లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 16.1 శాతం ఉంటే, 2019-20 ఫిబ్రవరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. దీని వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ. 2384 కోట్లు తగ్గుతాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్‌లో అంచనాల మేరకు ఈ ఏడాది మార్చి వరకు రూ. 1.36 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లలో కోత పడినప్పటికీ ఈ లోటును స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకోవాలని ప్రభుత్వం భావించడం సాహసమే. రాష్ట్ర జీఎస్‌డీపీ 2019-20లో 9,69,604 కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2018-19లో 14.3 శాతం ఉంటే, దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల 2019-20 నాటికి 12.6 శాతానికి తగ్గింది. అదే సమయంలో జాతీయ వృద్ధిరేటు 11.2 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ఆర్థిక మాంద్యం నుంచి తటుటకుని తెలంగాణ రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటును సాధించింది. రాష్ట్రంలో పంటల ఉత్పత్తిలో 23.7శాతం , పాడి పశువుల రంగంలో 17.3 శాతం, చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధిని సాధించారు. 2019-20నాటికి తెలంగాణ తలసరి ఆదాయం 2,28,216 రూపాయలు ఉండగా, దేశ తలసరి ఆదాయం 1,35,050 రూపాయలు. దేశ తలసరి ఆదాయం కన్నా, తెలంగాణ తలసరి ఆదాయం 93,166 రూపాయలు ఎక్కువగా ఉందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలియచేసే తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చక్కగా ప్రసంగించారు. రాజకీయాలు, ఎత్తుకుపై ఎత్తులు సంగతి పక్కనపెడితే, తనకు కేటాయించిన సమయంలో అధికార పక్షాన్ని వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసే విధంగా కాకుండా, వివిధ అంశాలపై నిర్మాణాత్మకమైన సలహాలను ఆమె అద్భుతంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తమ వంతు వచ్చినప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు, సూచనలు చేయకుండా ప్రభుత్వంపై దండెత్తే రీతిలో విమర్శలు చేయడం వల్ల అవకాశాన్ని కోల్పోతారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సభలో ఎంత సేపు మాట్లాడాం అనే దానికంటే, తమకు కేటాయించిన సమయంలో ఏ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను అంకెల ద్వారా చెప్పడం మంచిది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం బరువనుకుంటే, పేదలకు ఒక సెంటు స్థలం, రూ. 2లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారనే సూచన చేశారు. ఇది మంచి సూచన. చాలా రోజుల తర్వాత ప్రసంగించిన రాజ్‌గోపాల్‌రెడ్డి సభలో ఆవేశానికి లోనయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు విదితమే. అధికార పక్షం బలంగా ఉన్నప్పుడు, ఏ మాత్రం అవకాశం వచ్చినా బయటకు పంపేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్న సమయంలో, ఎదురుదాడి ధోరణి కంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహేతుకమైన విమర్శలు చేయడానికి విపక్ష పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజల మెప్పును పొందే విధంగా విపక్ష పార్టీలు మూస తరహాలో కాకుండా కొత్త తరహాలో ప్రభుత్వవైఫల్యాలను బహిర్గతం చేసే విధంగా ఉపన్యాస కళను నేర్చుకోవడం మంచిది. ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంకెలు చెప్పడంలో తడబాటుకు గురయ్యారు. మజ్లిస్ పార్టీ సహజ ధోరణిలోనే పౌరసత్వసవరణ చట్టం, ఎన్‌ఆర్‌పీ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూనే, సీఏఏ చట్టంలో సన్‌సెట్ క్లాజ్ అంటే చట్టం అమలుపై కాలపరిమితిని విధించాలని డిమాండ్ చేయడం విశేషం.

- కె. విజయశైలేంద్ర, 9849998097