మెయిన్ ఫీచర్

అందంగా మలుచుకుంటే ఆనందమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో అట్టహాసంగా పది పెళ్లిళ్లు జరిగితే అర్జంటుగా నాలుగు జంటలు విడాకులు తీసుకుంటున్నారు. ఒక జంట విడాకులకు పోయేవరకు విధిలేక భరిస్తూ తప్పదన్నట్టు సంసారం చేస్తుంటే మరో జంట చేసేదేం లేక నువ్వక్కడ, నేనిక్కడ అన్నట్టుంటున్నారు. ఇంకో జంట కొట్టినా తిట్టినా పడుంటూ తల్లిగారింటికి పోలేక అడ్జస్టవుతుంటే, మరో జంట చెప్పుకోలేకా.. చేసేదేమీలేకా.. అయితే ఇద్దరూ లేదా ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకో జంట కౌన్సిలింగ్ వరకు వెళ్లి కాపరం చేస్తుంటే, చివరిగా పదో జంట సంసారం చేస్తున్నా సరియైన తృప్తి లేక నెట్టుకొస్తున్నారే తప్ప ఏ ఒక్కరిలోనూ సంసారిక సుఖం తృప్తిగా అనుభవిస్తున్నట్టు కన్పించడంలేదు. అసలేం జరుగుతోంది.. ఎక్కడ తప్పు జరుగుతోంది.. బాధ్యులెవరనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోందని ఏ ఒక్కరూ ఆలోచించడంలేదా? ప్రతి సమస్యకూ పరిష్కారం తప్పనిసరిగా వుంటుంది కానీ ఇవన్నీ పరిష్కరించుకోలేని సమస్యలా? ఏ చిన్న సమస్య వచ్చినా భూతద్దంలో చూసి బూచిగా భయపడుతున్నారెందుకు? ఆలోచనాశక్తి సన్నగిల్లుతోందా? లేక ఆలోచించే సమయం లేదా! తల్లిదండ్రులు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తమ గురించి ఎవరేమనుకుంటారు.. తమ వల్ల కుటుంబ పరువు మంటగలిసిపోతుందనే ధ్యాస ఎందుకు రావడంలేదు! గిరి గీసుకుని అందులోనే ఆలోచించి అర్జెంటుగా విడిపోతున్నారే గానీ పరిష్కారం గురించి ఆలోచించరా? పెళ్లి కాగానే శోభనం.. శోభనం కాగానే విడిపోవడం- ఇలా విడిపోతున్న కేసులు ఎక్కువగా కన్పిస్తున్నపుడు కౌన్సిలింగ్ లేదా డాక్టర్లతో కూడా పరిష్కారం లేని సమస్యనే అనుకుందామా! పిల్లలు కలగకపోతే అమ్మాయిదే తప్పంటూ ఆమెను పంపించి లేదా తప్పించి లేదా ఒప్పించి అతనికి మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసే కుటుంబాలు కూడా చాలా కన్పిస్తున్నాయి.
నేను మగవాడిని కాబట్టి నాకిష్టమున్నట్లు నువ్వు చెయాలనేవాళ్లు కొందరైతే, మీ తల్లిగారు లేదా పుట్టింటివారు ఏమంత పెద్ద కట్నమిచ్చారని నీతో సంసారం చేయాలని భర్త, అత్త, ఆడపడుచుల వల్ల కూడా విడిపోవడాలు చాలా జరుగుతున్నాయి. పిల్లలు గాకున్నా, మళ్లీ ఆడపిల్ల పుట్టిందనీ లేదా అబ్బాయి అంగవైకల్యంతో పుట్టాడనే పనికిరాని ఆరోపణలతో రోజురోజుకూ ఛస్తూ బ్రతుకుతూ లేదా విడిపోయి వుంటున్నారు కొందరు. తన ఫ్రెండ్స్‌తో చనువుగా మాట్లాడుతున్నావనీ, లేదా ఎవరితోనో ఏదో సంబంధం అంటగట్టి, లేదా గంటల తరబడి ఫోన్లో ఛాటింగ్ చేస్తున్నావని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఏడిపిస్తుంటారు లేదా చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఇలా కూడా విడిపోతున్న చాలా కుటుంబాలలో అమ్మాయిదే తప్పంతా అని ఎత్తిచూపిస్తుంటారు తప్ప అబ్బాయి తప్పు ఆవగింజంత కూడా చూపెట్టరు. తప్పు అమ్మాయిదా.. అబ్బాయిదా.. లేదా ఇద్దరిదా.. అని కాదుగానీ పరిష్కారం వైపు ఎందుకు ఆలోచించరు. చదువులు పెరిగితే డిగ్రీలు వస్తున్నాయేమోగాని దానికితోడు ఓపికలు తగ్గి మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. అందరిలోనూ అహం, ఇగో జాస్తిగా వుంటున్నందునే అన్నింటిలోనూ అనర్థాలు పెరిగిపోతున్నాయి. చదువులో ఒకరిని మించి మరొకరు కన్పిస్తున్నారు కాబట్టే నువ్వెంత అంటే నువ్వంత అని కసురుకోవడాలు పెరుగుతున్నాయి గాని బంధాలూ, అనుబంధాల గురించి ఆలోచించడంలేదు. భర్త, భార్య అనే విడదీయరాని బంధం గురించి పిసరంత కూడా ఆలోచించడంలేదు. మేటింగ్, డేటింగ్, సహజీవనం, ప్రేమ, పెళ్లి సంబరాలే తప్ప భార్యాభర్తలు పిల్లా పాపలతో కలిసిమెలిసి సుఖీవనం చేస్తున్న కుటుంబాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. అదేపనిగా భర్తలు పెట్టే చిత్రహింసల్ని భరించమనడం కాదు కానీ కారణాలు వెతుక్కుని వీలైతే సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం కొంతవరకు బాగుంటుందేమో! ఇతనితో లేదా ఈమెతో సంసారం చేసే బదులు విడిపోయి హ్యాపీగా బ్రతకొచ్చని క్షణికావేశంలో వేరుకుంపటి పెడుతుంటారు కానీ ఆ తర్వాత కష్టాలు గురించి ఆలోచించటం లేదు. ఇద్దరిలోనూ బాగా చదువుకున్నామన్న అహం నిండుగా కన్పిస్తుంది కాబట్టి, విడిపోతే బ్రతకలేమా అనే ధీమా కన్పిస్తుంది కానీ సమాజం గురించి అరక్షణం ఆలోచిస్తే మంచిది. మన దగ్గరున్న విద్యతో, తెలివితో ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్రతుకుతామేమో కానీ ఒంటరి జీవితంలోని అన్ని రకాల బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే మరి. కట్టుబాటు, కండీషన్లు లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామనుకుంటాము గానీ విచ్చలవిడితనం గురించి కూడా కాసేపాలోచించాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనాక విడిపోతే పిల్లలు ఎవరివైపున్నా ఆ సమస్యమరీ దారుణం. కేవలం ఇగోవల్ల దెబ్బతింటున్న కుటుంబాలే ఎక్కవ అని అందరికీ తెలుసు. ఐనా పరిష్కారం వైపు ఆలోచించడంలేదు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ లేకనే ఇద్దరిమధ్యన అవగాహన లోపించి అనర్థాల పాలవుతున్నారు గానీ కనీసం కొన్నింటిలోనైనా ‘రాజీ’ అవుతుంటే ఇన్ని కుటుంబాలు ఇక్కట్లపాలు కావేమో మరి. స్కూల్ జీవితంలో నాటుకున్న మొక్క కాలేజీ జీవితంలో పెరిగి పెద్దదై ఉద్యోగం లేదా పెళ్లికొచ్చేసరికి మహావృక్షమై స్వేచ్ఛాపవనాలు వీస్తుంటే వాటిని ఆపడానికి చేసే ప్రయత్నంలోనే అనర్థాలు కల్గుతున్నాయంటే ఎవరూ కాదనరు. పొరపాటు, తొందరపాటు ఇద్దరివలన జరగొచ్చు. కాబట్టి ఇద్దరు కలిసి పరిష్కారం వైపు చూడాలి కానీ పంతాలు పెంచుకుంటే పాడైపోయేవి కుటుంబమే అని ఆలోచించాలి. కేవలం పంతాలు పట్టింపులవల్లనే కుటుంబాలు విడిపోతున్నాయని సర్వేలో తెలుస్తున్నా, చదువుకున్న జ్ఞానాన్ని సంసారం సజావుగా సాగేందుకు వినియోగించడంలేదనిపిస్తోంది.
మరో ముఖ్యవిషయం- గత కొంతకాలం సెల్‌ఫోన్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆడ, మగ తేడా లేకుండా, ఆఫీసు, ఇల్లు భేదం లేకుండా గంటలకొద్దీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ తన చుట్టూ వున్నవారిని కూడా మర్చిపోతున్నారు. రాత్రి సమయాల్లో కూడా చాటింగ్‌లూ, మెసేజ్‌లు, వాట్సప్‌లూ, ఫేస్‌బుక్‌లో మునిగిపోవడంవల్ల కూడా భార్యాభర్తల బంధం బెడిసికొడుతుందంటే, ఇద్దరిలోనూ కోపతాపాలు పెరిగి కొట్లాటలు జరుగుతున్నాయని చెబితే ఎవరూ కాదనరు. ఎంతకాలం నుండి సంసారం చేస్తున్నామనేది కాకుండా ఎంత ఆనందంగా సంసారం చేస్తున్నామనేది కావాలి. ఉమ్మడి కుటుంబాలు కన్పించకుండా పోతున్న ఈ రోజుల్లో, చిన్న కుటుంబాలైనా చింత లేకుండా వున్నాయా అని ప్రశ్నించుకుంటే జవాబు శూన్యం. కాపురం చేయడానికి బాగా చదువుకున్నామన్న అహం పనికిరాదు గానీ చదువులేని వారు కూడా చక్కని సంసారం చేస్తూ ఇంటి గుట్టు బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటారనేది కూడా ఒకింత గ్రహించాలి. నలుగురు మెచ్చే కాపురం చేయాలి గానీ ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించే కాపురం వద్దు. సర్దుకుపోతేనే సంసారమన్నారు కాబట్టి సహనంతో కాపురం చేద్దాం.. చక్కని కుటుంబమని పేరు తెచ్చుకుందాం.

-కన్నోజు లక్ష్మీకాంతం 9146338115