మెయిన్ ఫీచర్

అరుణా ముఖర్జీ అభినవ అన్నపూర్ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె వయసు వందేళ్లు. ఈ వయసులో చాలామంది ‘కృష్ణా.. రామా’ అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతారు. కాని అరుణ ముఖర్జీ అలా కాదు. పేదలకు కడుపునిండా అన్నం వండి పెడు తుంది. ఆకలితో వచ్చినవారికి కాదనకుండా ఈ వయసులోనూ స్వయంగా వంట చేసి పెడుతుంది. ఎక్కడ పేదవాళ్లు కనిపించినా వారిని పిలిచి కడుపు నిండా వంట చేసి పెడుతుంది. ‘మానవత్వం కోసం మనిషి బతకాలి’ అని చెప్పే ఈ శతాధిక బామ్మ పేదలకు ఆహా రాన్ని అందించటం కోసం ఆమె గత ఏడు దశాబ్దాలుగా ఆహా రం తీసుకోవడం మానివేసి, కేవలంటీ, బిస్కెట్లుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవలనే వంద సంవత్సరంలోకి ప్రవేశించిన అరుణ ముఖ ర్జీ ఢాకాలో జన్మించారు. ఇరవై సంవత్సరాల వయస్సులో ఆమెకు జదూలాల్ ముఖర్జీతో వివాహం అయింది. ఆయన గౌహతిలోని కాటన్ కాలేజీలో రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు. 80 సంవత్సరాల క్రితం ఆమె తన భర్తతో పాటు గౌహతి వచ్చారు.
1947లో జరిగిన దేశ విభజన సందర్భంగా పలువురు బంగ్లాదేశీయులు మన దేశానికి తిరిగివచ్చారు. దేశం కాని దేశం కావడంతో వారు నిలువ నీడ లేక తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుతుండేవారు. పసిపిల్లల పరిస్థితి అయితే, మరింత దయనీయం. గౌహతిలో ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితులే కనిపించాయి. ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఆనాటి నుంచి ఆమె తన శక్తి మేరకు వంట చేసి, బంగ్లాదేశ్ శరణార్థులకు భోజనం పెట్టడం ప్రారంభించారు. వేలాదిమంది ఆహారం లభించక అల్లాడుతుంటే, తాను సుష్ఠిగా భోజనం చేయడం సరికాదని ఆమె భావించారు. వెంటనే ఆమె ఆహారం తీసుకోవడం మానివేశారు. జీవనం గడపడం కోసం 1947లోనే టీ, బిస్కెట్లు తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె టీ, బిస్కెట్లనే ఆహారంగా తీసుకొంటున్నారు. పది పదుల వయస్సులో కూడా ఎవ్వరిపైనా ఆధా రపడకుండా.. పేపర్ బ్యాగ్‌లు తయారుచేస్తూ తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల ఆకలి తీరుస్తున్నారు. ఆమె కు నల్గురు కుమారులు. ఒక కుమార్తె. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో తమ వద్దకు వచ్చి ఉండమని పిల్లలు కోరినా ఆమె అంగీకరించలేదు. గత ఏడు దశాబ్దాలుగా అన్నార్తులకు ఆహారాన్ని అందిస్తున్న ఈ అభినవ అన్నపూర్ణ అయిన అరుణ ముఖర్జీ మరింతకాలం ఆయురారోగ్యాలతో జీవించి మరింత మంది పేదలకు ఆహారం అందించాలని ఆశిద్దాం.

- పి.హైమావతి