మెయన్ ఫీచర్

కేసీఆర్ ప్రతిష్టకు సరికొత్త సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టాలు ఒక్కొక్కటిగా వస్తే ఎదుర్కొనవచ్చు. అవి ‘ప్యాకేజీ’ రూపంలో ఒక్క ఉదుటున దాడిచేస్తే ఎవరైనా ఇబ్బంది పడక తప్పదు. తెలంగాణలో అధికార తెరాస పార్టీని ఇపుడు ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి. ఉపఎన్నికలను సహజంగా జనం పెద్దగా పట్టించుకోరు. రాజకీయ పార్టీలు కూడా మొక్కుబడిగా పోటీ చేస్తాయి. అధికార పార్టీ సైతం అంతగా దృష్టి పెట్టదు. అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేందుకు ఆసక్తి చూపరు. ఉపఎన్నికల ఫలితాలు రాజకీయాలను తారుమారు చేయవు. ‘మెజారిటీ’కి ఒక టో, రెండో సీట్లు తక్కువగా ఉన్నపుడే అధికార పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాటపడుతుంది.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21న ఉపఎన్నిక జరుగుతోంది. మామూలుగా అయితే ఈ ఉపఎన్నిక ఫలితంపై ఎవరూ అంతగా ఆలోచించేవారు కారు. అధికార తెరాస పార్టీకి గెలుపు ఖాయమనుకునేవారు. 119 సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో తెరాసకు వందమందికి పైగా ఎమ్మెల్యేలున్నారు. ఉపఎన్నిక తేదీని ప్రకటించే వరకు రాజకీయంగా ఎలాటి వేడి లేదు. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని విశే్లషిస్తే హుజూర్‌నగర్ ఫలితం రాష్ట్ర రాజకీయాలను మార్చివేసే అవకాశాలు లేకపోలేదనిపిస్తుంది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిస్తే వచ్చే నాలుగేళ్లు విపక్ష పార్టీల నోటికి తాళం పడినట్లే. టీఆర్‌ఎస్‌కు భంగపాటు ఎదురైతే మాత్రం రాజకీయాలపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది.
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇపుడు హుజూర్‌నగర్ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మారి, భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరింది. ఉపఎన్నిక బరిలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెరాసను లక్ష్యంగా చేసుకుని అన్ని అస్త్రాలను సంధిస్తున్నాయి. మంత్రివర్గమంతా హుజూర్‌నగర్‌లోనే బస చేసి పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉంది. తమ అంతర్గత సర్వేలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని తేలిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సర్వశక్తులనూ ఒడ్డి తమ సీటును నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. బీజేపీ మాత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఫలితాలు చూశాక బీజేపీని తక్కువగా అంచనా వేయడానికి రాజకీయ పండితులు సంశయిస్తున్నారు. తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికైనందున, ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికను ప్రభావితం చేసే అనేక అంశాలు నెలకొని ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్ పరిసర జిల్లాలను మినహాయిస్తే దాదాపు 30 జిల్లాల్లో తీవ్రమైన వెనకబాటుతనం ఉంది. తమ పనులకు వెళ్లేందుకు ప్రజా రవాణా వ్యవస్థపైనే 90 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించి, చర్చల ప్రక్రియ కొనసాగించే వైఖరిని అవలంబిస్తే బాగుండేది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవ రావు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం గంభీరమైంది. రాజకీయ కోణంలోనే ఈ తరహా విధానాలపై అధికారంలో ఉండే పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వ్యవధిని తీసుకుని, 48వేల మంది కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి ఉంటే బాగుండేది. పనిచేసిన కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో తెరాస ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న శక్తులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో- ఆర్టీసీ సమ్మె వారికి తురుపుముక్కలా దొరికింది. ప్రజారవాణా రంగంలో కార్మికులు సమ్మె చేస్తే విపక్షాలు ఊరికే కూర్చోవు. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఏ కార్మిక సంఘమైనా రాజకీయ పార్టీల మద్దతును తీసుకోవడంలో తప్పేమీలేదు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, సికింద్రాబాద్‌లో కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం ప్రజలను కలచివేసింది. యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ముగించడమనేది కాలం నిర్ణయిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె యుద్ధమైతే, దాన్ని ముగించే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండే వ్యవస్థలు కూడా చిన్న పాటి ఘటనలకు ఖాయిలా పడుతుంటాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇంతే. 100 మందికిపైగా ఎమ్మెల్యేల బలంతో తిరుగులేని నాయకుడిగా అవతరించి విశేషాధికారాలు అనుభవిస్తున్న కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే ఒక గంటలో సమ్మెకు పరిష్కారం దొరుకుతుంది. ఒక్కోసారి శక్తిమంతులైన నేతలు కూడా పంతాలకు వెళితే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చివరకు తీవ్ర పరిణామాలు తప్పవు.
ఈనెల 19న జరుపతలపెట్టన తెలంగాణ బంద్ కంటే ముందే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిపించి సమ్మెకు తెర దించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సమ్మె ముగిసినా ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్‌నగర్‌పై ఉంటుంది. ఉద్యమ సమయంలోను, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజాదరణ కలిగిన గొప్ప నేత కేసీఆర్ అనడంలో సందేహం లేదు. కానీ, గత ఏడాది డిసెంబర్ నుంచి బేరీజు వేస్తే వరుస ఎన్నికలు, కోడ్ అమలు, ఆలస్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, మంత్రివర్గ విస్తరణలో జాప్యం ఇవన్నీ తెరాసకు ప్రతికూలాంశాలుగా మారాయి.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కొత్త అసెంబ్లీ భవనం, సచివాలయం నిర్మాణంపై ప్రజల్లో సానుకూలత లేదని చెప్పవచ్చు. ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలపై పునరాలోచించుకోవడం మంచిదనే అభిప్రాయం ఇపుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. పైగా ప్రభుత్వం తీసుకునే ప్రతి అంశంపైనా కోర్టు కేసులు దాఖలవుతున్నాయి. ‘అన్ని రోజులూ ఆదివారాలు కావు, ప్రతి ఆదివారం కూడా సెలవు కాదు’ అనే ఆంగ్లసామెత చందంగా కేసీఆర్‌కు ఇపుడు బలహీనమైన విపక్ష పార్టీల నుంచి బలమైన సవాళ్లు వస్తున్నాయి. మంత్రివర్గంలో విపక్షాలకు దీటుగా బదులిచ్చే నేతలు లేరు. ఒక తెలియని నిశ్శబ్దం రాజ్యమేలుతుందనిపిస్తోంది. రైల్వే శాఖను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని కేసీఆర్ విమర్శిస్తున్నా, మోదీ సర్కారుపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు.
ఆర్టీసీ అంటే ప్రజాజీవితంలో విడదీయలేని భాగం. సామాన్య ప్రజల జీవితాలతో ఆర్టీసీ కార్మికులు పెనవేసుకుని పోయారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం ఒకటే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. నష్టాల ఊబిలో ఆర్టీసీ కూరుకుని పోకుండా పెట్రో ధరలు పెంచినప్పుడల్లా చార్జీలు పెంచాలి. బస్సు చార్జీలను నిర్ణయించేందుకు ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండరాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్టీసీని ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి. బస్సు చార్జీలు పెంచితే ప్రజలకు ఆగ్రహం వస్తుందనే ఆందోళనతో ప్రభుత్వాలు ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు జోలికి వెళ్లడం లేదు. దీని వల్లనే దీర్ఘకాలంలో ఆర్టీసీ, విద్యుత్ డిస్కాంలు నష్టాల్లో చిక్కుకుని భ్రష్టుపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర వహించారు. కార్మికులను చర్చలకు ఆహ్వానించి ,వాస్తవమైన డిమాండ్లను ఆమోదించి, సంక్లిష్టమైన కోర్కెలపై నిర్ణీత గడువుతో కూడిన నిపుణుల కమిటీని నియమించడం మంచిది.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితం కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. అధికార పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి. తనకు ఎదురులేదనే రీతిలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ పార్టీ హుజూర్‌నగర్‌లో పాగా వేస్తుందా? కాంగ్రెస్ ఈ సీటును నిలబెట్టుకుంటుందా? లేదా బీజేపీ ఉత్తర తెలంగాణలో మాదిరిగా సంచలనం సృష్టిస్తుందా? ప్రజల నాడి అంతుచిక్కని వైనంలా ఉంది. ఉపఎన్నిక ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే కచ్చితంగా తెలంగాణలో కొత్త రాజకీయాలకు అంకురార్పణ చేసినట్లవుతుంది. రాజకీయ శక్తుల పునరేకీకరణ అనివార్యమవుతుంది. విపక్షాలకు ప్రజలు షాక్ ఇస్తే మాత్రం వచ్చేనాలుగేళ్లు టీఆర్‌ఎస్‌ను పల్లెత్తు మాట అనే సాహసాసికి రాజకీయ పార్టీలు దిగడం కష్టమే.

-కె.విజయ శైలేంద్ర 98499 98097