మెయిన్ ఫీచర్

శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీరాజరాజేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ ముహూర్తం
ఆశ్వయుజ శుద్ధదశమి నాటి సాయంకాలము, నక్షత్ర దర్శనం అయ్యే సమయానికి ‘విజయ’ అని, ఆ సమయంలో నిశ్చల మనస్కులై, శక్తిని ఆరాధిస్తే, సమస్త కార్యమలు జయంగా జరుగుతాయని వ్రతగ్రంథాలు, శాస్తక్రారులు చెప్పారు. ఏ కార్యమైనా ఆచరించినపుడు ముగింపుగా శాంతి పాఠం చెప్పి, పూర్ణాహుతి చేస్తారు. విద్వాంసులు, పండితులు అందరిలోనూ శక్తిని దర్శించి గౌరవిస్తారు. ఇది విజయదశమి రోజున చేసే పండిత సత్కారములోని ఆంతర్యము.

శరదృతువులో, దేవాలయాల్లోనూ, ఇళ్ళలోనూ జగన్మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆదిపరాశక్తి తొమ్మిది అవతారాలతో పూజలు అందుకుంటుంది. ఈ పండుగ సందర్భంగా అమ్మవారి లీలలను స్మరించుకుంటూ పూజిస్తే, ముఖ్యంగా స్వార్థహితంగా, ధర్మబద్ధంగా సత్సంకల్పంతో ఆరాధిస్తే, తల్లి తప్పక చేయూతనిస్తుంది, బిడ్డలను సర్వదా కాపాడుతుంది. అమ్మ దయార్ద్ర స్వరూపిణి. మనిషిలోని పశు, రాక్షసత్వాలను అణచి మానవతా విలువలను గుర్తింపజేస్తుంది. అప్పుడే దైవతత్త్వం అనిపిస్తుంది. దాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపచేసుకుంటే, జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాం. ఇది దేవీ నవరాత్రుత్సవములు, పండుగలోని పరమార్థం.
తొమ్మిది రోజుల పూజానంతరం, పదవ రోజు ‘విజయదశమి’ దుష్ట రాక్షస సంహారానికి, విజయానికి సంకేతంగా, ఆనందోత్సాహంతో జరుకునే పండుగ ‘విజయదశమి’. దసరా మహోత్సవాలకు మకుటాయమానమైన పండుగ విజయదశమి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు కేంద్ర బిందువు పండుగలు. ఆధ్యాత్మిక చింతనను, సర్వమానవ సౌభ్రాత్రతను, సౌహార్ద భావాన్ని పెంపొందిస్తూ, నూతన తేజోత్సాహాన్ని కలుగజేస్తూ, జీవనసరళిని సుగమము, సుసంపన్నము చేసేవి పండుగలు.
పండుగలోని పరమార్థం
అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించే భక్తి, జ్ఞానాన్నిచ్చి కామాల్ని, అర్థాన్ని ధర్మబద్ధంగా అనుభవించటానికి, ఆచరణాత్మకంగా ప్రకటించటానికి ఏర్పడినవి పండుగలు. మన సంస్కృతిని సామరస్యము సమైక్యతను, ప్రకటిస్తూ, దైవప్రీతి, పాపభీతి, సంఘనీతిని అలవరచి సంస్కరించటానికి నిర్దేశింపబడినవి.
శరదృతువులో శక్తి ఆరాధన
అటువంటి పండుగలలో ముఖ్యంగా పేర్కొనబడినవి- శరదృతువులో చేసే శ్రీదేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవములు. మనిషి మనస్సు తమోగుణంతో అనగా తమస్సుచే ఆవరించబడి ఉంటుంది. మనస్సులో పరమాత్మను నిలుపుకొంటే, క్రమేపీ చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతమవుతుంది. దృశ్యమవుతున్న సర్వవస్తుప్రపంచం, వెలుగునుంచి ప్రభవించినవే, వెలుగులోనే లీనమయ్యేవే. ఆ వెలుగు ‘శక్తే’ శాశ్వతమయినది. అదే ‘విశ్వశక్తి’. ఇదే శ్రీదేవి అనగా జగన్మాత స్వరూపం. ఇది శ్రీ శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో బోధించిన ముఖ్యాంశం. ఇదే దసరా మహోత్సవములకు పూర్తి స్ఫూర్తి.
శక్తి ఆరాధన- సమాజ వికాసం
‘‘యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా, నమస్తసె్తై నమస్తసె్తై నమో నమః’’ అన్నది దేవీ నమస్తుతి. విశ్వమంతా శక్తిమయం. శక్తిలేనిదే మనం ఏ పనీ చేయలేము గనుక. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతి పథంలో పయనిస్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై, వారి జీవితాలలలో కూడా వెలుగును నింపే శక్తిమంతుడవుతాడు. అప్పుడు సమాజ వికాసం కలుగుతుంది. దీనితో దేశాభ్యున్నతి జరుగుతుంది.
భక్తి- జ్ఞానం - భక్తి
‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’’ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు చెప్పారు. వాటిలో భక్తి- జ్ఞానం రెండూ ప్రశస్తమైనాయి. అయితే రెండూ వేటికవి స్వతంత్య్రమైన రెండు మార్గాలా లేక ఒక మార్గంలో వచ్చే రెండు మజిలీలా? రెండు మజిలీలే. అయితే ఏది ముందు, ఏది వెనుక? అనే ప్రశ్న వస్తుంది. భక్తి అంటే భజించటం అని సామ్యాన్యార్థం. దీనికి వ్యతిరేకమైన మాట ఏమిటి? విభజించటం- అంటే విడదీయటం. కనుక భజించటమంటే కలుసుకోవటం అని అర్థం వచ్చింది. కలుసుకోవాల్సింది ఎవరు? ఎవరిని? జీవుడు- పరామాత్మని అదే పరబ్రహ్మరూపమైన జగన్మాతని భజించాలి. భజిస్తే అప్పుడు అపరిపూర్ణుడైన జీవుడు పరిపూర్ణుడవుతాడు. కనుక భక్తి జ్ఞానానికి దారితీస్తే జ్ఞానం మరలా భక్తి చేత పరిపూర్ణమవుతుంది. మొదటి భక్తి- సగుణం- సాకారం- జ్ఞానం తరువాత వచ్చే భక్తి నిరాకారం, నిర్గుణం- అదే మోక్షం. మోక్షప్రదాయిని, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవములలో దశమినాడు పూజలందుకొనే జగన్మాత. ఈ విషయానే్న త్యాగరాజస్వామి ‘ప్రేమ ముప్పిరిగొనువేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతునికి నిజదాసులైనవారు’ అన్న శ్రీరాగ కీర్తనాచరణములో వివరించారు. మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు వెనె్నలను పండించే శరదృతువులో, శుక్లపాడ్యమి నుంచి నవమివరకూ తొమ్మిది రోజులు అంబికారాధన చేస్తారు. దీని ఆంతర్యమేమిటంటే, పశురాక్షసత్వంతో కూడిన మానవుడు, సక్రమంగా భావనాయుక్తంగా నవాహ్నిక (తొమ్మిది రోజులు) దీక్షతో వ్రతాన్ని ఆచరించి, మానవతా విలువలను కాలప్రాముఖ్యాన్ని తెలిసికొంటాడు. అనగా మనలో చేరిన తొమ్మిది విధములయిన అజ్ఞాన లక్షణాలను సాధన ద్వారా దూరం చేసికోవడం, తనలో ఉన్న మహిత్వాన్ని పారద్రోలి మనీషత్వాన్ని పొందటం. పదవరోజు విజయదశమి, శరన్నవరాత్రి ఉత్సవానికి మకుటాయమానమైన పండుగ. నవరాత్రి పూజకు జయకేతనం- విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరమాతను విజయదశమినాడు పూజిస్తాం.
శ్రీరాజరాజేశ్వరీ మాత విశేషాలు
ఆకారము లేనటువంటిది, అన్ని ఆకారాలు తానే అయినటువంటిది- జగన్మాత స్వరూపం. తల్లిగా కరుణతో లాలించి తండ్రిగా పోషించి, గురువుగా విజ్ఞానాన్నందించి, చదువులోని మర్మమలెల్ల తెలిసి, ఈ విశ్వంలో ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం వుందో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, తప్పుద్రోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది శ్రీమాత, శ్రీరాజరాజేశ్వరి. ఈ విశ్వం తల్లి ఏలుబడిలో ఉంటుంది. జగన్మాత సామ్రాజ్యం మూడు లోకాలలో వ్యాపించి ఉంది. కనుక బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. రాజలక్షణమైన రాజఠీవి, పరిపాలనా దక్షత, కాఠిన్యం, మాతృవాత్సల్యం- ఈ త్రిగుణాలతో త్రిమూర్తులచే సృష్టి స్థితి లయములను చేయిస్తూ, త్రిమూర్తులకే కాక చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి. ఇంద్రాది అష్టదిక్పాలకులు రాజులైతే వారికి రాజులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు- వీరికి రాజ్ఞి జగన్మాత. రాజసూయయాగము చేసినవారు, భూమండలాధిపతులు రాజాధిరాజులు, అందరూ సామ్రాజ్య పదవీ లబ్దులు. తన భక్తులకు సామ్రాజ్య పదవి కన్నా మిన్నయైన ఆత్మానంద సామ్రాజ్యాన్ని అనుగ్రహించే, జగజ్జనని శ్రీ రాజేరాజేశ్వరి.

శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన
జగన్మాత ఆరాధనను మూడు విధాలుగా చేస్తూ ఉంటారు. సాకారంగా కొలటం, ఆరాధింటచటం- మొదటిది. శబ్ద శక్తిగా నామపారాయణలు వేదమంత్రోచ్ఛాటనములతో ఉపాసించటం, రెండవది యంత్ర ప్రతిష్ఠ చేసి, బీజాక్షరములతో యంత్రమునకు (శ్రీచక్రార్చన) అర్చన చేయటం మూడవది. దేవీ నవరాత్రములలో ఈ మూడు రకములైన విధానమలు జరుగుతాయి. జగన్మాత స్వరూపమైన శ్రీచక్రార్చన చేయటం, శ్రీవిద్యోపాసనలకు చెప్పబడింది శ్రీవిద్య, బ్రహ్మవిద్య, మోక్షవిద్య. శ్రీవిద్యకు, శ్రీచక్రానికి దగ్గర సంబంధం ఉన్నది. శ్రీవిద్య ‘మంత్రం’, ‘శ్రీచక్రం’- యంత్రం. శ్రీలలితా సహస్రం, మంత్రానికి యంత్రానికి అనగా శ్రీవిద్యకు, శ్రీచక్రానికి సంబంధించిన ‘తంత్రం’. తంత్రం అంటే, వ్యాపించేది అని అర్థం. శ్రీవిద్యలో అక్షర రూపంలో వున్న పరమేశ్వరి, శ్రీచక్రంలో రేఖాకారంగా, శ్రీసహస్రంలో సూక్ష్మరూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అంత సులభతరం కాదు. కానీ, దేవీ సహస్ర నామములతో జగన్మాతను అర్చించటం అందరికీ సులభసాధ్యం. నిండు మనసుతో, స్వార్థరహితంగా నలుగురికీ ఉపకరించేటట్లుగా, లోకకళ్యాణార్థం, చేసే ఏ మంచి కార్యక్రమమైనా శ్రీ చక్రార్చనే, శ్రీవిద్యోపాసనే, శ్రీసహస్రపారాయణే అని వక్కాణిస్తూ, దానికి తన ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయని హామీ ఇస్తోంది శ్రీ మహారాజ్ఞి, శ్రీచక్రేశ్వరి- శ్రీ రాజరాజేశ్వరి.
చిచ్ఛక్తి స్వరూపిణి- జగదంబ
కామేశ్వరుని రంజింపచేసే పరమేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి, ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలి అని తల్లిగా హితవు పలుకుతుంది. మానవ శరీరం- క్షేత్రం. క్షేత్రానికి అధిష్ఠాత్రి అయి, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞణ్ణి రక్షించే శ్రీ రాజరాజేశ్వరీ మాతకు, వృద్ధి క్షయాలు లేవు. తరిగిపోయేది శరీరం మాత్రమే. కనుక క్షీణించే శరీరంలో, క్షీణించకుండా రాణించే చిచ్ఛక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఇదే శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వం. శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణములుంటాయి. అందు ‘బిందు’ రూపంలో మహాచైతన్యంతో వెలిగే మహోదాత్త శక్తి- శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయం, తల్లికి ఆలయం.
శ్రీ శంకర భగవత్పాదులు అందించిన తల్లి వైభవం
చితాభస్మాది లేపో గరళ మశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతి హరీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగతిశైక పదవీం
భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం
చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషాహారమైనవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుఱ్ఱెకలవాడు, భూతనాధుడు. అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినారమ్మా, ఓ భవాని రాణీ’’ అని సంబోధిస్తూ, అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- జగన్మాత పాణిగ్రహణ పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించారు, జగదుర్గరు శంకరాచార్యులు. భవుని భావమే భవాని. భవ భయ బాధలను పరిహరించి, భవాన్ని విభంగా మార్చగల మహోదాత్త శక్తి భవాని అని పేర్కొన్నారు శ్రీ శంకర భగవత్పాదులు.
నామపారాయణ ఫలితం
‘నామపారాయణాభీష్ట ఫలదాయైనమః’ అన్న ఒక నామము ఉంది జగన్మాతకు. తల్లి నామాలను పారాయణ చేస్తే అపమృత్యుభయం పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మనోధైర్యం కలుగుతుంది, ఆత్మస్థైర్యం అబ్బుతుంది, పాపాలు నశిస్తాయి. జగన్మాత నామాల్ని జపించగా జపించగా, తనకు తల్లికి భేదంలేదని, తల్లి చైతన్యమే అందరిలోనూ ఉన్నదని గోచరమవుతుంది. అంతేకాదు, చేసే ప్రతి మంచిపనికీ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంతకంటె మానవజన్మకు కావలసిందేమిటి? జీవ బ్రహ్మైక్య స్థితిని పొందుతాడు.
మహాసామ్రాజ్ఞి సర్వేశ్వరి
జగన్మాత సన్నని బాహువులతో ఉన్నా, సర్వేశ్వరి, మహనీయులకంటే మహేయసి. దయ, దర్పం, రెండూ తల్లిలో మేళవించి ఉంటాయి. జనని పాలించే రాజ్యం- మహాసామ్రాజ్యం. శబ్ద బ్రహ్మను సేవించటం, శబ్దాన్ని శాసించటం, శబ్ద స్పర్శ రూప రస గంధాలను శబ్దం నుంచి తగు రీతిలో వెలయించటం- మహాసామ్రాజ్యశాలిని చేసే మహత్కార్యాలు. శబ్ద శాసనుడైన పాణిని, అమ్మ దయతో, భాషకు భాష్యం వ్రాస్తే, పతంజలి, జగన్మాత కటాక్షంతో, ఆ భాష్యానికి మసాభాష్యం వ్రాశారు. మహాభాష్యం చదివిన మహోదాత్తులు, చదివితే మహాభాష్యం చదవాలి, ఏలితే మహాసామ్రాజ్యాన్ని ఏలాలి అని చెప్తారు. మహాభాగ్య రచన తల్లి కటాక్షం, మహాసామ్రాజ్యానికి సమ్రాజ్ఞి సర్వేశ్వరి.
వెలుగులకు వెలుగు - శ్రీమాత
శ్రీచక్రం, శ్రీమాత, శ్రీవిద్య- ఈ మూడూ ఒకే తత్త్వానికి మూడు రూపాలు. ఆ తత్త్వమే జగన్మాత. శివశక్తి సమన్వయాన్ని ప్రత్యక్షంగా ప్రకటించే పరమేశ్వరి- లోకమాత, శ్రీమాత. సకల లోకాలను లాలించి పాలించే శ్రీరాజరాజేశ్వరి తల్లులకు తల్లి, కొలతలకు కొలత, విలువలకు విలువ, వెలుగులకు వెలుగు.
ఆదిశక్తి శ్రీమాత
తల్లిపేరు తలిస్తే మాంగల్యం ఫలిస్తుంది. మంగళ ధ్వనులు వినిపిస్తాయి. సౌఖ్యం లభిస్తుంది. చక్కని వేషభాషలతో, సుగంధ పరిమళములతో, సువాసినుల సహవాసంతో, పరమ పావన శోభతో నిర్మలమైన మనస్సుతో ఆనందబిందువులా, జగన్మాత కదలివస్తుంటే చూచిన ప్రతిబిందువూ, మహాసింధువులా పొంగిపోతుంది. బ్రహ్మాండంలో జీవించే జీవకోటి అనేక విందు సందోహమైన మానవ మహాసముద్రం. అందరికంటె ముందు త్రిపుర సౌందర్యాన్ని వెలయించిన ఆదిశక్తి, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమతి సింహాసనేశ్వరి- శ్రీ రాజరాజేశ్వరి.
యజ్ఞప్రియా, యజ్ఞకర్తా,
యజ్ఞమాన స్వరూపిణి
‘యతో వా ఇమా ని భూతాని జాయంతే’ యత్- పదార్థాన్ని తెలుసుకునేందుకు చేసే సాధన యజ్ఞం. ఈ ప్రాణికోటి అంతా ఎక్కడినుంచి ఉదయిస్తూ ఉంది? ఏ ఆధారంలో జీవిస్తూ ఉంది? చివరకు ఎక్కడ లయిస్తుంది? అనేదే తెలుసుకోమని చెప్తోంది ఉపనిషత్తులు. ఆ ‘యత్’ పదార్థాన్ని తెలుసుకునేందుకు సహస్రారంలో సహస్ర కాంతులతో వెలసియున్న ‘యా’దేవి అనుగ్రహం కావాలి. తల్లి అనుగ్రహం కోసం యజ్ఞం చేయాలి. యజ్ఞం వివిధ రకాలు. ధ్యానయజ్ఞం, జ్ఞానయజ్ఞం, జపయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, నామయజ్ఞం- ఇలా యజ్ఞం అనేక రకాలు. ఏ రూపంలో చేసినా జగన్మాతకు యజ్ఞమంటే యిష్టం, సంతుష్టురాలవుతుంది. ఈ యజ్ఞాలు, ఈ విషయాలన్నీ మాకు అర్థం కావటంలేదు. సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్లు చెప్పమంటారా? ‘్ఫలాపేక్ష లేకుండా అనగా స్వార్థరహితంగా, సర్వజన క్షేమాన్ని కాంక్షించే సంకల్పంతో చేసే ప్రతి కార్యం యజ్ఞమే. పరమేశ్వరుడు సమయజ్ఞుడు, తల్లి సమయజ్ఞి. జగన్మాత యజ్ఞేశ్వరి, యజ్ఞికర్త్రి, యజ్ఞికర్తృస్వరూపిణి. మంచి సంకల్ప యజ్ఞం చేసే యజమాని హృదయంలో ఉండి, అతని చేత ఆ పనిని సక్రమంగా చేయిస్తుంది. అన్ని ధర్మాలకు తల్లి ఆధారం. ధర్మం, మనం చేసే పనులకు ఆధారం. మంచి పనులవలన యజ్ఞం ఫలిస్తుంది. తల్లి ధనాధ్యక్షురాలు. ధనధాన్యాల్ని కటాక్షిస్తుంది. ఒక్కరు చేసే స్వార్థరహిత యజ్ఞం, ఎంతమందికో లభిస్తుంది. గతించినవాళ్ళకు, జీవించి ఉన్నవాళ్ళకు ఇక ముందు జీవించబోయే జీవకోటికి, అందరికీ ఉపకరిస్తుంది. ఈ విధంగా విశ్వచక్రాన్ని ఒక పద్ధతిలో త్రిప్పుతూ నడిపించే విశ్వమాత శ్రీ రాజరాజేశ్వరి.
నాదయోగి అర్చించిన శ్రీరాజరాజేశ్వరి
‘పరాశక్తి మనుపరాదా నాపై పరాకేలనమ్మా పురాణి ధర్మసంవర్థని, శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి’ అని, శ్రీపురమైన తిరువారూరులో పంచనద క్షేత్రం తిరువాదిలో వెలసిన ధర్మసంవర్థని శ్రీ రాజరాజేశ్వరీ మాతను స్తుతిస్తూ, ధర్మవర్తనులకు మాత్రమే శ్రీ రాజరాజేశ్వరిదేవి సామ్రాజ్యంలో స్థానం ఉంటుందని, వారికే జగన్మాత శాశ్వత సౌఖ్యాన్నిస్తుందని, శ్రీపురా రాజరాజేశ్వరీదేవిని, నాదయోగి త్యాగరాజస్వామి సావేరీ రాగంలో ఆద్యమైన ఆదితాళ నిబద్ధనలో గానం చేశాడు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్యసిద్ధికి దర్పణం.
శివశకె్తైక్యం -ఏకేశ్వరోపాసన
శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములను ఆశ్వయజు శుద్ధ పాడ్యమి రోజున, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో కలశస్థాపన చేసి ప్రారంభిస్తారు. మరల నవరాత్రి అనగా నవాహ్నిక దీక్షతో తొమ్మిది రోజులు పూజ చేసిన అనంతరం పదవనాడు, దశమి రోజున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో మహోత్సవములు ముగుస్తాయి. ప్రారంభం, ముగింపు రెండూ (హస్త, శ్రవణానక్షత్రములు) చంద్ర నక్షత్రములోనే జరగటం, గమనార్హం, విశేషం. ఎందుకో తెలుసా? చంద్రుడంటే తల్లి- జగన్మాత- చల్లని తల్లి. చంద్రుడు, మనస్సుకు అధిపతి. కనుక మనస్సును అదుపులో పెట్టుకునే మార్గాల్ని దర్శింపజేసేది తల్లి.
ఈ తొమ్మిది రోజులలో మహాశక్తిలో త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని, విలీనం చేస్తారు. పూర్వం ‘శక్తి’ తమకు అనుగ్రహించిన అస్తశ్రస్త్రాల్ని, ఆయుధాల్ని తల్లికి యిస్తారు. ఎందుకంటే, ఏ పురుషుని చేత కాకుండా స్ర్తిమూర్తి చేతనే సంహరింపబడేటట్లుగా వరాల్ని పొందారు రాక్షసులు. స్ర్తిలు అబలలని, వారు తమను ఏమీ చేయలేరని వారి భావన, స్ర్తిల పట్ల వారికున్న చులకనభావన. రాక్షసులను సంహరించవలసిందిగా, ఇంద్రాది దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. చండ, ముండ, నిశుంభ, శుంభ, ధూమ్రాక్ష, ధూమ్రలోచన, రక్తబీజ, మహిషాసురాది రాక్షస సంహారం చేసింది జగధీశ్వరి. శివుని ఆశ్రయించి ఉంటుంది శక్తి, శక్తిలేనిదే శివునికి శక్తి ఉండదు. కనుక విజయోత్సాహంతో, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజు సాయంకాలం సంధ్యా సమయంలో శివశక్తుల సంయుక్తోపాసన, శమీవృక్షం క్రింద జరుపుతారు. ఇదే ఏకేశ్వరోపాసన. ఇదే శివశక్తి సామరస్యం- అర్థనారీశ్వరతత్త్వం. ‘‘శమీ శమయతే పాపం, శమీ శతృవినాశిని అర్జునస్య ధనుర్థారి, రామస్య ప్రియ దర్శనః’ అనే శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షానికి (జమ్మిచెట్టు) ప్రదక్షిణం చేస్తారు. జమ్మి పత్రాల్ని ఒకరికొకరు యిచ్చి పుచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని శమీవృక్షాన్ని ప్రార్థిస్తూ శివశక్తుల ఏకేశ్వరోపాసన చేసి, శివశకె్తైక్యాన్ని దర్శిస్తారు జన్మసాఫల్యతను పొందారు.
శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం
సామాన్య దృష్టికి పైకి వేరుగా కనపడినా, అది ఒకే తత్త్వం. భిన్నంలో అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వముల ‘వాగర్థావివ సంపృక్తా’ అన్నవి కాళిదాస మహాకవి చెప్పినట్లు వాక్కు, అర్థములవంటివి. జీవుడు, శివశక్తులను సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయానే్న ‘అంగన సహిత భుజంగ శయన ఎన్న కంగళి గుత్సవవీయో’ అనే కీర్తనలో శివశక్తి సామరస్యాన్ని ప్రకృతీ పురుషుల సామరస్యాన్ని, ఏకేశ్వరోపాసనను సూచించాడు, వాసుదేవ విఠలునివాసిగా భజించిన కర్నాట సంగీతానికి ఆద్యుడైన పురందరదాసు.
గంగాయమునా నదుల సంగమం - ఏకాత్మతాభావం
అయోధ్యకు పుష్పకంలో తిరిగివస్తూ క్రిందకు చూసిన శ్రీరామచంద్రునికి, ప్రయాగవద్ద గంగా యమునా నదుల సంగమం హృద్యంగా కనిపించింది.
క్వచిచ్ఛ కృష్ణోరగ భూషి తావ, భస్మాంగ రాగా తనురీశ్వరస్య
పశ్యాన వద్యాంగి విఖాతి గంగా భిన్నప్రవాహా యమునా తరంగైః
నల్లత్రాచుల్నే నవాభరణాలుగా ధరించి భసితానులిప్తమైన తెల్లని పరమేశ్వరుని శరీరంగా- గంగా యమున నదీ సంగమం కనిపించింది. నల్లత్రాచులు అమ్మవారి రూపమే. కుండలినీశక్తి మహాకాళి. కనుక గంగా (తెలుపు) యమున (నలుపు)ల తెలుపు నలుపులు వాటివి కావు, శివశక్తులవే. పరస్పర విరుద్ధంగా కనిపించే గుణసామరస్యమే సృష్టి అంతా అలముకొని ఉంటుంది. అనేకత్వం నుండి ఏకత్వం వైపు మనల్ని తీసికొని వెడుతుంది. శక్తివివర్ణమైన అనేకత్వం, ఏకరూపమైన శివతత్త్వంలో లీనమవుతుంది. మనలో రాజస తామస గుణములు నశించి, సత్వగుణ సంపన్నుంతో, జీవితం దేదీప్యమానంగా ప్రకాశించటమే- శశిశకె్తై్యక్యం. ఏకాత్మతాభావం. దీన్ని భక్తులకు అనుగ్రహించే జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి. ఎంత గొప్పగా చెప్పాడో అమ్మ భక్తుడు, వరప్రసాది, కాళిదాస మహాకవి, తన రఘువంశ కావ్యంలో. ఇది ‘రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ, రాజ్యవల్లభా రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రీతా, రాజ్యలక్ష్మీ కోశనాధ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా అయిన జగన్మాతకు విజయదశమి రోజున చేసే పూజకు సంపూర్ణ దీప్తినిస్తుంది.

జమ్మిచెట్టు అసలుకథ
శివశక్తుల ఏకేశ్వరోపాసన జమ్మిచెట్టు క్రిందనే ఎందుకు చేయాలి? జమ్మి చెట్టు అగ్నితత్వం. లక్ష్మీస్వరూపం. మనం ఏ దేవతారాధన చేసినా, ఆహుతులు, హవిస్సులు యిచ్చినా అగ్నిద్వారానే యిస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మాకు పొందించమని, అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాం. అగ్ని సంబంధమైన వృక్షం శమీవృక్షం- జమ్మిచెట్టు. శ్రీపతి పండితయ్య అనే శివభక్తుడు విజయవాడలో నివసించేవాడు. ఆయన రోజూ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను సేవిస్తూ ఉండేవాడు. అమ్మకు అర్చనలు చేసేవాడు. మల్లిఖార్జున లింగానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, బిల్వార్చనలు చేసేవాడు. అర్థనారీశ్వర తత్త్వాన్ని ఆకళింపు చేసుకొన్న మహాభక్తడు, తాత్త్వికుడు- పండితయ్య. పండితయ్య శివతత్త్వసారము అనే గ్రంథాన్ని కూడా రచించాడని పెద్దలు చెప్తారు. ఆ రోజులో విజయవాడ వేంగి రాజుల పరిపాలనలో ఉండేది. అనంతపాలుడు అప్పటి ప్రభువని, చరిత్రకారులు చెప్తారు. శ్రీపతి పండితయ్య మీద కొందరు ద్వేషం పెంచుకొని, యజ్ఞయాగాది క్రతువులకు ఆయన్ని పిలవటం మానేశారు. అయినా పండితయ్య పట్టించుకోలేదు. పెద్దలను గౌరవించాలనే విషయాన్ని కూడా విస్మరించి, అవహేళనం చేయసాగారు. అగ్నినేత్రి నేత్రంగా ధరించిన మల్లిఖార్జునస్వామిని ప్రార్థించి మంత్రశక్తితో అగ్నిని తన ఉత్తరీయంలో ఆవాహన చేసి మూట కట్టి జమ్మివృక్షానికి (శమీవృక్షానికి) వ్రేలాడదీశాడు శ్రీపతి పండితయ్య. జగన్మాత త్రినేత్రి. మూడవది జ్ఞాననేత్రం. పండితయ్య శాక్తేయుడు కూడా. పండితయ్య మంత్రపూర్వకంగా కట్టడి చేసినందువలన, ఊళ్ళో అగ్నిహోత్రుడు లేడు. వంట వార్పు ఆగిపోయింది. యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయినాయి. వర్షాలు లేవు, ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. అనంతపాల ప్రభువు జరిగింది తెలిసికొన్నాడు. శ్రీపతి దగ్గరకు ప్రజలందరితో కలిసి వెళ్లి ప్రార్థించాడు. పండితయ్య అగ్నిని ప్రార్థించి, అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. ఈనాటికీ విజయవాడ పాతబస్తీ, బ్రహ్మణవీధిలో మల్లిఖార్జున మెట్లు మొదట్లో జమ్మిదొడ్డిగా పిలువబడుతోంది. ఆనాటి పండితయ్య మూటకట్టిన శమీవృక్షం మీద కొన్ని శాసనాలు దొరికినాయని శాస్తజ్ఞ్రుల వెల్లడించారు. ఈనాటికీ ప్రతి సంవత్సరం విజయదశమి నాడు, దుర్గామల్లేశ్వరస్వామివార్ల సంయుక్తోపాసన ఈ శమీవృక్షం క్రిందనే జరుగుతుంది.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464