మెయన్ ఫీచర్

‘సంకీర్ణ రాజకీయాల’కు భాజపా విముఖత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో విజయ ఢంకా మో గించిన బీజేపీ వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. హర్యానాలో జాట్లు, మహారాష్టల్రో మరాఠాల మద్దతు లభించే పార్టీకి అధికారం దక్కడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎన్డీఏ 1990 నుంచి 2009 వరకు అనుసరించిన ఎత్తుగడలకు, 2014 తర్వాత చేస్తున్న వ్యూహాలకు మధ్య పొంతన లేదు. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ 1998 నుంచి 2014 వరకు తన మిత్రపక్షాల పొత్తుపై ఆధారపడేది. 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకుడిగా ఎదిగారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 300 పైచిలుకు స్థానాలను భాజపా సొంతంగా సాధించడంతో- ఎన్డీఏలోని మిత్రపక్షాల జోరుకు కళ్లెం పడింది. మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి రాకుండా బీజేపీ జాగ్రత్తపడుతోంది. బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహకారంతో భాజపా చొచ్చుకెళ్లింది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏకు బదులు బీజేపీ ప్రభుత్వమే నడుస్తోంది. మిత్ర పక్షాలకు, ఉమ్మడి అజెండాలకు స్థానం లేకుండా పోయింది.
ఎన్డీఏలో బీజేపీ పెత్తనం పెరగడంతో మిత్రపక్షాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో, మహారాష్టల్రో శివసేనతో కలిసి బీజేపీ సంకీర్ణ రాజకీయాలను నడుపుతోంది. మహారాష్టల్రో ఒకప్పుడు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శివసేన 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూనియర్ పార్టనర్‌గా మారింది. ఇక్కడ బీజేపీ ప్రధాన పక్షంగా అవతరించింది. బిహార్‌లో నితీశ్ ప్రభుత్వంలో బీజేపీ జూనియర్ పార్టనర్‌గా ఉంది. బిహార్ నెలకొన్న పరిస్థితుల వల్ల బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే నితీశ్ వల్ల ఎన్ని అవరోధాలు ఎదురైనా బీజేపీ సర్దుకునిపోతోంది. మహారాష్ట్ర రాజకీయాలను 2014 అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా మార్చివేశాయి. ఆ ఎన్నికల్లో శివసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీకి సొంతంగా 28 శాతం సీట్లతో 122 సీట్లు, శివసేన 19 శాతం ఓట్లతో 63 సీట్లు వచ్చాయి. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ 28 శాతం ఓట్లతో 23 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. శివసేన 23 శాతం ఓట్లతో 18 ఎంపీ స్థానాలను గెలిచింది. మొత్తం మీద ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లోబలపడింది. లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న శివసేనకు 105 అసెంబ్లీస్థానాల్లో ఆధిక్యత లభించింది. బీజేపీ ఓట్ల శాతాన్ని కాపాడుకుని 122 అసెంబ్లీ సీట్లలో ఆధిక్యతను ప్రదర్శించింది.
మహారాష్టల్రో ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలకు కలిపి 32 శాతం ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లో పోలైనా ఐదు సీట్లు మాత్రమే దక్కాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే కాంగ్రెస్ పార్టీకి 22 అసెంబ్లీ సీట్లు, ఎన్సీపీకి 23 సీట్లలో ఆధిక్యత లభించింది. మజ్లిస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చాయి. ఔరంగాబాద్ లోక్‌సభ సీటును మజ్లిస్ దక్కించుకొంది. మహారాష్టల్రో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అవినీతి మరకలు లేకపోవడం, మోదీ హవా కొనసాగడం, 370వ అధికరణం రద్దు తదితర అంశాలన్నీ చూసి మంచి మెజారిటీ వస్తుందనే ఆశతో బీజేపీ నేతలు ఉన్నారు. శివసేన 288 సీట్లలో 135 సీట్లు కావాలని కోరుతోంది. సీట్ల పంపకం బీజేపీకి తలనొప్పిగా తయారైంది. సొంతంగా పోటీ చేయాలని ఒక వర్గం బీజేపీ నేతలు తమ అధిష్ఠానంపై వత్తిడి తెస్తున్నారు. శివసేన మాత్రం వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తే తప్ప సొంతంగాపోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్సీపీకి దిగువ స్థాయిలో మంచి బలం ఉన్నా, వరుస పరాజయాలతో ఈ కూటమి శిథిలమైంది. ఈ కూటమికి నిధుల కొరత పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్‌కు యువతరం దూరమైంది. మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వయోభారంతో సతమతమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ సమీకరణలు మారిపోతాయి. శివసేనతో భాజపాకు పొత్తు ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా తయారైంది. మహారాష్టల్రో పొత్తు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోటీలా ఉంటుందని శివసేన సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. సీట్ల విషయంలో రాజీపడినా, ఈ సారి ముఖ్యమంత్రి పదవి తమకు మొదట ఇవ్వాలని శివసేన కోరుతోంది. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 122 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని ఆ తర్వాత శివసేన పొత్తుకు కలిసి రావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బీజేపీ, శివసేన అజెండాలకు పెద్దగా తేడా ఉండదు. చాలా విషయాల్లో ఈ పార్టీల మధ్య భావసారూప్యత ఉంటుంది. శివసేనకు మరాఠా సామాజికవర్గంలో తిరుగులేని పట్టుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ శివసేనతో పొత్తును తెగ తెంపులు చేసుకోవద్దని, కొన్ని సీట్లు వదులుకుని అయినా మిత్రధర్మాన్ని పాటించాలని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ చెబుతున్నారు. అద్వానీ హితవును పట్టించుకునే స్థితిలో బీజేపీ నాయకత్వం లేదు. శివసేన కూడా సీట్ల విషయంలో రాజీలేదని నిర్మొహమాటంగా చెబుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన బీజేపీ ఈసారి కూడా అదే విధంగా పోటీ చేయాలని తాపత్రయపడుతోంది. ఎన్డీఏలో ఉన్న రిపబ్లికన్ పార్టీ కూడా తమకు పది సీట్లు ఇవ్వాలని వత్తిడి తెస్తోంది.
మహారాష్టల్రో దళితులు, ముస్లింలు దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. మజ్లిస్ పార్టీ కూడా ముస్లింలు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీల్చిన ఓట్ల వల్ల బీజేపీ, శివసేన పార్టీలు కొన్ని స్థానాల్లో గెలిచాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. చక్కెర బెల్ట్‌లో ఎన్సీపీ ఆధిపత్యం గణనీయంగా తగ్గింది. మొదటి నుంచి మహారాష్టల్రో దళితులు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉండేవారు. దళితుల్లో కూడా చీలిక వచ్చింది. ఈ వర్గం ఓట్లను బీజేపీ ఆకట్టుకుని తన బలాన్ని పెంచుకుంది. మహారాష్టల్రో హిందుత్వ- జాతీయ వాదం ప్రభావం ఎక్కువ. మరాఠా ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం కూడా మహారాష్టన్రే. అంబేద్కరిజాన్ని అనుసరించే వారు గణనీయంగా ఉన్నారు. మహారాష్టల్రో బీసీలు, అగ్రకులాల్లో మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలే శివసేనకు ఆయువుపట్టు. ప్రస్తుతం ఈ ఓటుబ్యాంకు బీజేపీ వైపు కదిలింది. లౌకికశక్తుల పునరేకీకరణ లేకపోవడం, తమ పార్టీలో కొత్త నేతలు లేకపోవడం, ఎన్సీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బదలాయింపుకాకపోవడం, ముస్లింలు, దళితుల ఓట్లలో చీలికల వల్ల వరుస పరాజయాలతో కాంగ్రెస్ గాయపడింది.
బీజేపీని ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉంటే తప్ప ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి రావడం అంత సులువు కాదు. 2004లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామని అప్పటి బీజేపీ నేతలు ఊహించలేదు. ‘అంతా బాగుంది, భారత్ వెలుగుతోంది’ అనే నినాదం బీజేపీ పుట్టి ముంచింది. ప్రస్తుతం ఆ తరహా నినాదాలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో బీజేపీ లేదు. మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో బీజేపీ ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకుని విజయాలను నమోదు చేసుకుంటోంది. హిందీబెల్ట్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హర్యానా ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన కోట. ఉత్కంఠ భరితమైన రాజకీయాలకు హర్యానా పెట్టింది పేరు. హర్యానా ధనిక రాష్ట్రం. ఇక్కడ జాట్ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. స్వీయ తప్పిదాలతో హర్యానాను కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. హర్యానా అంటే మనకు దేవీలాల్, భజన్‌లాల్, ఓం ప్రకాశ్ చౌతాలా లాంటి రాజకీయ నేతలు గుర్తుకొస్తారు. ఆయారాం, గయారాం సంస్కృతి ఎక్కువ. సిద్ధాంతాలకు విలువలేదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పది లోక్‌సభ సీట్లలో బీజేపీ విజయం సాధించింది. అసెంబ్లీలోని 90 సీట్లలో 75 సీట్లను గెలుచుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎంఎల్ కట్టార్ ఢంకా భజాయించి చెబుతున్నారు. విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యత ఇక్కడ బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని చెప్పవచ్చు. సైన్యంలో హర్యానా వాసులు ఎక్కువమంది చేరుతారు. 370వ అధికరణ రద్దు ప్రభావం బాగా కనపడుతుందని రాజకీయ విశే్లషకులంటున్నారు. సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల బీజేపీ ఈ అంశాన్ని విశేషంగా ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కూడా 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరిని బహిరంగంగా తూర్పారబట్టిన విషయం విదితమే. 2009 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి 9.05 శాతం ఓట్లు వస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 33.2 శాతానికి ఎగబాకింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయా? లేక ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడుతాయా? అన్న విషయమై ఇపుడు రసవత్తమైన చర్చ సాగుతోంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097