మెయన్ ఫీచర్

ఈ నేరం అందరిదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి నదిలో వెళుతూ పాపికొండల రమణీయ దృశ్యాలను తిలకించాలని వెళ్లిన పర్యాటకుల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. గోదావరి నదిలో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా, దుర్ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి నిర్దిష్టమైన ప్రణాళికలు లేవని మరోసారి రుజువైంది. ఆంధ్ర, తెలంగాణల్లో గోదావరిపై లాంచీలు ప్రయాణించేందుకు అనువైన జలరవాణా మార్గం రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకు మాత్రమే ఉంది. చరిత్రలోకి వెళితే 1971లో రాజమండ్రి వద్ద రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి, రావులపాలెం వద్ద జొన్నాడ వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు లాంచీలపైనే ప్రజలు ఆధారపడే వారు. రాజమహేంద్రవరం వద్ద రోడ్డు కమ్ రైలు వంతెన అందుబాటులోకి వచ్చే వరకు ఉభయ గోదావరి జిల్లాలకు పాత రైలువంతెనే శరణ్యం. ఆ రోజుల్లో రాజమహేంద్రవరం వద్ద లాంచీల్లో ప్రయాణం ఎంతగానో
వర్ధిల్లింది. ఇక్కడి నుంచి భద్రాచలం- కూనవరం వరకు లాంచీల్లోనే ప్రయాణించే వారు. గోదావరికి ఎగువున గిరిజన ప్రాంతాలు, ఇటు దిగువన గౌతమి, వైనతేయ, వశిష్ట నదుల మధ్య విస్తరించి ఉన్న కోనసీమ ప్రాంతానికి వెళ్లాలంటే లాంచీలు, పడవలే ఆధారం. వంతెన నిర్మించడంతో కోనసీమకు, కాకినాడ మధ్య రోడ్డు మార్గం ఏర్పడింది.
మొదటి నుంచి గోదావరిలో పడవలు, మరపడవలు, లాంచీలకు ధవళేశ్వరంలోని బోటు సూపరింటెండెంట్ కార్యాలయం అనుమతులు ఇచ్చేది. ఏ అనుమతి కావాలన్నా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల సిఫార్సులు తప్పనిసరి. తాజాగా కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదాన్ని విశే్లషిస్తే ప్రతి ప్రమాదం తర్వాత వచ్చే డిమాండ్లనే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తెరపైకి తెచ్చాయి. దీనికి ప్రభుత్వ వైఫల్యంతో పాటు బోటు సిబ్బంది కారణమని చెబుతున్నారు. గగనతల, రోడ్డు రవాణాలకు ఇచ్చినంత ప్రాధాన్యత జల రవాణాకు ఇవ్వకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలికంగా ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కృష్ణా, గోదావరి నదుల్లో లాంచీ ప్రయాణాలపై సమగ్ర చట్ట విధానం అవసరం.
మొదటి నుంచి లాంచీలను నడిపే సరంగులకు సరైన సాంకేతిక శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. విమానం నడిపై పైలెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతున్నారు. విమానం సర్వీసులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ లైసెన్సులు జారీచేస్తుంది. పైలెట్‌లకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యేందుకు కఠిన నిబంధనలు ఉంటాయి. బస్సు డ్రైవింగ్‌కు సంబంధించి చాలా సంస్థలు ప్రతి చిన్న పట్టణంలో ఉన్నాయి. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఏజన్సీ (ఆర్‌టీఏ) అధికారులు మోటారు వాహనాలకు లైసెన్సులు జారీ చేస్తారు. ఆర్టీసీ బస్సు డిపో నుంచి బస్సు బయలుదేరేటప్పుడు ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. ఈ తరహా నిబంధనలు లాంచీలకు లేవు. ప్రస్తుతం కాకినాడలోని పోర్టు కార్యాలయం బోట్లకు లైసెన్సులను మంజూరు చేస్తోంది.
1970 దశకం తర్వాత రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో పాత పద్ధతుల్లో లాంచీలను జాగ్రత్తగా నడిపే సరంగులకు పనిలేకుండాపోయింది. లాంచీలకు డిమాండ్ తగ్గడంతో సంప్రదాయ రీతుల్లో నైపుణ్యం ఉన్న సరంగులు తెరమరగయ్యారు. రాజమండ్రి నుంచి గిరిజన ప్రాంతాలకు సరకులు తీసుకెళ్లేందుకు ఒకటి రెండు లాంచీలు తిరిగేవి. గోదావరి తీరంలో ప్రతి పట్టణంలో లాంచీల రేవులున్నా లాంచీలు ఉండేవి కావు. 2000 దశకం వచ్చిన తర్వాత జనంలో పర్యాటక రంగం పట్ల ఆసక్తి పెరిగింది. కార్తీక మాసం వంటి సందర్భాల్లో రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ, పాపికొండలకు లాంచీల విహార యాత్రలు పెరిగాయి. దాదాపు ముప్పై ఏళ్లపాటు మూలపడిన లాంచీల రేవులు పర్యాటకులతో కళకళలాడడం ప్రారంభమైంది.
గోదావరి అందాలను చూడాలన్న ఆసక్తి,సినిమా షూటింగ్‌లు పాపికొండల్లో జరగడం, ఇసుక తినె్నలు, పట్టిసీమ దేవాలయం, అభయారణ్యాలు ఇవన్నీ కాలక్షేపాన్ని ఇచ్చే పర్యాటక ప్రదేశాలుగా మారాయి. కార్తీకమాసంతో పాటు (వరదల సీజన్ తప్ప) అన్ని కాలాల్లోనూ లాంచీ టూర్లు పెరిగాయి. ప్రభుత్వ పర్యాటక సంస్థ సైతం అన్ని హంగులున్న లాంచీలను ప్రవేశపెట్టింది. ఎటూ ప్రైవేట్ లాంచీలు ఉన్నాయి. పట్టిసీమ వరకు రోడ్డు ద్వారా వెళ్లి అక్కడి నుంచి గోదావరి మధ్యలో ఉన్న పట్టిసీమ దేవాలయం సందర్శనకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే లాంచీ ప్రయాణం తప్పనిసరి. గత 15 ఏళ్లుగా జనం పెద్ద సంఖ్యలో వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. పాపికొండల సందర్శనకు ఆన్‌లైన్ బుకింగ్‌లు జరుగుతున్నాయి. పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా లాంచీల ఆధునీకరణ లేదు. నైపుణ్యం, ఇతర అర్హతలున్న సరంగులు లేరు. ఈ రంగంలోనూ మాఫియా ప్రవేశించింది. లాంచీల టూర్లు ఒకప్పటి బెజవాడ సిటీ బస్సుల వ్యాపారంలా మాఫియా చేతుల్లోకి వెళ్లింది. పెట్టుబడి పెట్టేవాడు ఎక్కడో ఉంటాడు. ఇందులో సిండికేట్లు చేరాయి. ఆఫీసులు వెలుస్తాయి. బుకింగ్‌లు చేసే ఉద్యోగులు పెరిగారు. కాని గోదావరి నదిపై సరైన అవగాహన ఉన్న వారు కరవయ్యారు.
దాదాపు 700 మైళ్లు ప్రయాణించి భద్రాచలం వద్దకు చేరుకున్నప్పటి నుంచి గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా తదితర నదులు కూనవరం ఎగువున గోదావరిలో కలుస్తాయి. పాపికొండల్లో సాధారణ రోజుల్లోనే నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇక వరదల సమయంలో ప్రవాహం బీభత్సంగా ఉంటుంది. పాతరోజుల్లో సాంకేతిక శిక్షణ లేని సరంగులు తమ అనుభవంతో నీటి ప్రవాహాన్ని అంచనావేసి లాంచీలను నడిపేవారు. ఇప్పటి సరంగులకు అంతటి నైపుణ్యం లేదు. వీరు ఏమి చదువుకున్నారు? బోటు నడపడంలో శిక్షణ ఉందా? సరైన ఫిట్‌నెట్‌తో ఉన్నారా? రాత్రి వేళ మద్యం సేవించి ఉదయం డ్యూటీకి వచ్చా? అని ఎవరూ ఆరా తీయరు. వీరికి పెద్దగా వేతనాలు ఉండవు. రికార్డుల్లో ఉండే వారి పేర్లు ఒకటి, లాంచీలను నడిపే వారు వేరుగా ఉంటారు.
నదిలోప్రమాదం జరిగినప్పుడు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, కాకినాడ పోర్టు అధికారులు రంగంలోకి వస్తారు. లాంచీల రాకపోకలను నియంత్రించేందుకు తగిన వ్యవస్థ ఉండాలి. లాంచీల రాకపోకల వివరాలను నమోదు చేసేందుకు ఇరిగేషన్ సిబ్బంది ఉన్నా, వారంతా మామూళ్లకు అలవాటు పడ్డారనే అభియోగాలు ఎటూ ఉన్నాయి. గోదావరిలో నీటి ప్రవాహం, ఎక్కడెక్కడ సుడిగుండాలు ఉన్నాయి, ఇసుక తినె్నలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ప్రమాదకరమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై లాంచీల యజమానులు, సరంగులకు సమాచారం ఉండదు. ఎంత ఎక్కువ మంది పర్యాటకులు వస్తే అంత మందిని బోటు ఎక్కించడం, వారికి వినోదాన్ని కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంపైనే బోటు యజమానుల ధ్యాస. కొన్ని బోట్లపై సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో జల్సాలు జరుగుతున్నాయి. కొంత మంది గ్రూపుగా ఏర్పడి లాంచీలను బుక్ చేసుకుని పాపికొండలకు వెళుతుంటారు. వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ఇవ్వరు. వాటిని ఎలా వేసుకోవాలని చెప్పే వారుండరు.
లాంచీల నియంత్రణకు చట్టపరమైన అధికారాలు ఉండే కొత్త వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలి. బోటు ప్రమాదం జరిగినప్పుడు ఇరిగేషన్, పోర్టు, పోలీసు, రెవెన్యూశాఖల వారు ఒకరినొకరు నిందించుకునే పనికి స్వస్తి పలకాలి. సరంగులకు ఆధునాతన శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేయాలి. లాంచీలు, బోట్‌లకు తనిఖీలు తప్పనిసరి చేయాలి. బోట్లలో మద్యపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ప్రతి ప్రయాణీకుడికి బీమా ఉండేలా టిక్కెట్లలోనే రుసుము వసూలు చేయాలి. అన్ని అర్హతలు, శిక్షణ కలిగిన సంస్థలకు లైసెన్సులను మంజూరు చేయాలి. లాంచీలను నడిపేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఊపందుకున్నందున భవిష్యత్తులో గండి పోశమ్మ, సింగనపల్లి నుంచి మాత్రమే పాపికొండలు వరకు లాంచీల ప్రయాణం ఉంటుంది. రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ వరకు కూడా లాంచీ టూర్లు ఎటూ ఉంటాయి. ప్రతి పాయింట్ వద్ద పటిష్టమైన తనిఖీ కేంద్రం ఉండాలి.
లాంచీ యాత్ర రేట్లు పెంచినా జనం భరించే స్థితిలోనే ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లాంచీల వ్యవస్థను ఆధునీకరించాలి. ప్రభుత్వం లాంచీల టూర్లను స్వ యంగా నిర్వహించినా కచ్చితంగా భ్రష్టుపడుతుంది. ఎందుకంటే సిబ్బందిని ఔట్ సోర్సింగ్‌పై నియమిస్తారు. దీనివల్ల వారు అవినీతికి అలవాటుపడి వ్యవస్థను త్వరితగతిన పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు విచారణలు చేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వాలకు అలవాటు. మరో 45రోజుల్లో కార్తీక మాసం వస్తుంది. ఇది హిందువులకు పవిత్ర మాసం. గోదావరి జిల్లాల ప్రజలు కార్తీక మాసం రోజుల్లో పట్టిసీమ, పాపికొండల యాత్రలు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఈలోగానే లాంచీల టూర్లపై సమగ్ర విధానం తేవాలి. దేవీపట్నం సమీపంలో తాజా ప్రమాదానికి- నైపుణ్యం లేని సరంగులు, సాంకేతిక పరిజ్ఞానం లేని సిబ్బంది, మాఫియాగా మారిన బోటు యాజమాన్యాలు, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కారణాలు. లాంచీల టూర్లను నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. కఠినమైన చట్టాలు అమలు చేసి వ్యవస్థలోని లోపాలు సరిదిద్దాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097