మెయిన్ ఫీచర్

ఆర్థిక ప్రణాళిక తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'ధనం మూలం ఇదం జగత్’ అని ఆర్యోక్తి. జగతి జీవనాధారానికి డబ్బు మూలం అని అర్థం. డబ్బే ప్రపంచం కాకూడదుగానీ ప్రపంచం గడవడానికి డబ్బు అవసరం. ప్రతి మనిషికి కోరికలనేవి ఉంటాయి. అవి తీరాలంటే ఆర్థిక వనరులు అవసరం. ‘కోరికలే బాధలన్నిటికీ మూలం’ అని బోధివృక్షం క్రింద జ్ఞానోదయంతో బుద్ధుడు చెప్పాడు. మనిషిగా పుట్టాక కోరికలు లేకుండా బ్రతకడం సాధ్యమయ్యే పనేనా?
అందుకే ‘నాది అనే మమతేరా బాధకుమూలం’ అంటూనే ‘ఏదీ లేదనుకుంటే అంతా శూన్యం’ అని కూడా అన్నాడు ఒక సినీ కవి. ఆ శూన్యం అనేది జీవితంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే ఆ కోరికలకు హద్దులు నిర్ణయించడం, వాటిని నెరవేర్చుకునేందుకు, ఆర్థికంగా పరిపుష్టి కోసం ఉత్తమ మార్గాలను అనుసరించడం అవసరం. వాటిని మర్చిపోతే మాత్రం అనర్థాలే జరుగుతాయి.
‘న స్ర్తి స్వాతంత్ర మర్హతి’ అని మనువు మనుస్మృతిని రాశాడని, ఈనాటివరకు స్ర్తివాదులు, అభ్యుదయవాదులు, నానారకాలుగా విమర్శిస్తున్నారు. స్ర్తి వికాసానికి దోహదపడే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇవ్వాల్సిందే. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అమ్మ జ్ఞానవంతురాలైతే కుటుంబం సరస్వతి నిలయం అవుతుంది అనేదే హిందూ సంప్రదాయ భావన. పూర్వం కొన్ని అనివార్య కారణాలు వలన స్ర్తిలకు కొన్ని కట్టడులు చేయాల్సి వచ్చింది. అది సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సడలించుకుంటూ వస్తూనే వున్నారు. కాబట్టి ‘ఉద్యోగం పురుష లక్షణం’ అనే భావన నుండి, ప్రస్తుత ఆర్థిక అవసరాలను అధిగమించడానికి ‘చన్నీళ్లకు వేడినీళ్లు తోడు’ అనే భావన పెంపొందించుకోవటంవలన స్ర్తిలకు ఉద్యోగ స్వేచ్ఛ లభించింది.
ఆ స్వేచ్ఛను స్ర్తిలు సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిపుష్టి కోసం భర్తకు చేదోడు వాదోడుగా నిలవాలి. కొంత ఇప్పటికే మార్పు వచ్చిందని చెప్పవచ్చు. అయితే మగ తోడు లేని మహిళలు అధికంగా.. ఆర్థికంగా ముందుకు పోతున్నారని పరిశీలకులంటున్నారు. పెళ్లికాని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు లేదా ఇతర కారణాలవల్ల జీవిత భాగస్వాములకు దూరంగా వుంటున్న మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతకాళ్ళపై నిలబడాలనుకొని, ఆర్థికంగా ముందుండి మంచి ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకొన్న చందంలా ఆర్థిక ప్రణాళిక లేని కారణంగా కొందరు అనాలోచనతో పప్పులో కాలేస్తున్నారు. అలాంటివారు కొన్ని సూచనలు పాటించాల్సిందే!
ఒకప్పుడు జేబునిండా చిల్లర డబ్బులు వేసుకొని పోతే సంచినిండా నిత్యావసర వస్తువులు వచ్చేవి. నేడు అది రివర్స్ అయింది. అయినా సరిపడా వస్తువులు రావడంలేదు. నిత్యావసర ధరలు నింగిని తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికప్రణాళికే లేకుంటే కుటుంబ బడ్జెట్ అస్తవ్యస్తం కాగలదు. తమకొచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా, పారదర్శకతతో నిర్వహించుకోవడం ఉత్తమం.
ఈ రోజుల్లో చాలామంది తమ వాస్తవిక ఆదాయంపైన మాత్రమే ఆధారపడి జీవనాన్ని సాగించడంలేదు. నేటి క్రెడిట్ కల్చర్‌వల్ల ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నాయి. ఈ సంస్కృతి లేనప్పుడు చేతిలో డబ్బు వుంటేనే ఆర్థిక అవసరాన్ని తీర్చుకునేవారు. ఇప్పుడు చేతిలో పచ్చ కాగితం వుండాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ కార్డు వుంటే చాలు. కనబడ్డ వస్తువు ఇంటికొచ్చేస్తుంది. ఆనక జేబుకు చిల్లుపడుతుంది.
క్రెడిట్ కార్డులు దేన్నయినా కొనాలన్న ఆతృతను ఎంతగా కలిగిస్తాయో అదేసమయంలో సమస్యనూ అంతే సృష్టిస్తాయి. అవసరం వున్నా లేకపోయినా షాపింగ్ చేయాలన్న కోరికను కలిగిస్తాయి. అందుకే ఎప్పుడో తప్పదు అనుకున్నపుడు మాత్రమే కార్డుల్ని ఉపయోగించుకోవాలి. కార్డు బదులుగా క్యాష్‌నే చెల్లించే అలవాటు ఉత్తమం. జరుగుతున్న కార్డుల మోసాలను దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని జాగ్రత్తగా వినియోగించుకోక తప్పదు.
ఓ పద్ధతి ప్రకారం బడ్జెట్‌ను రూపొందించుకొని కొంచెం అటూ ఇటూగానైనా దాని ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఆర్థిక ఒత్తిడులూ వేధించవు. వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సజావుగా సాగిపోతుంది. ముందు మనం ఖర్చులపై నిఘా వేయాలి. అన్నింటికి లెక్కలు కట్టి స్వయం నియంత్రణ విధించుకోవాలి. ఆదాయ లెక్కల్లో స్థిర చర ఆస్తులు రెండింటినీ కూడా కలుపుకోవాలి.
ఖర్చును మించి ఆదాయం వున్నట్లయితే దాన్ని అనవసర ఖర్చులకోసం వినియోగించుకోకుండా పొదుపు ఖాతాలో జమ చేయాలి.
ఆరోగ్య బీమా తీసుకోవడం, ఉద్యోగస్తులయితే ఉద్యోగాల్లో చేరే ముందే జీతాలకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తెలుసుకోవటం, ఎంత వీలైతే అంతకాలం వృత్తిలో కొనసాగటం, రిటైర్మెంట్ ఫండ్స్ సమకూర్చుకోవడానికి బీమాలు చేయడం చేయాలి. సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. ఇంట్లో ఉండే మహిళలు తాము దాచుకున్న డబ్బును సిస్టమాటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ వంటి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
మహిళలు అధిక లాభాలు పొందేందుకు, ఎక్కువ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కస్టమైజ్డ్ అకౌంట్లు ఓపెన్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్స్ వంటి అవకాశాలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం కూడా వుంది. టర్మ్ ఇన్సూరెన్స్, ఎన్నో బీమా కంపెనీలు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బీమా పాలసీ ప్రీమియంలో ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మహిళల సగటు ఆయుష్షు పురుషులకంటే ఎక్కువ ఉండడం. అంతేకాదు ఇంకా ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లు కూడా మహిళల కోసం అందుబాటులో వున్నాయి. గత ఏడాది ప్రభుత్వం మహిళల ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను ఎనిమిది శాతం చేసింది. మహిళలు ఉద్యోగం చేస్తున్న కంపెనీలు పనె్నండు శాతం ఈపిఎఫ్ జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగంలో చేరిన మొదటి మూడు సంవత్సరాలు మాత్రమే ఇది అమలులో వుంటుంది. ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటే మహిళలు అవసరమైతే వృద్ధాప్యంలో కూడా ఎవరిపైనా ఆధారపడకుండా జీవించవచ్చు.
చిరు ఉద్యోగస్థులు, చిరు వ్యాపారులు, వృత్తికారులు.. ఇలా ఆదాయం ఖర్చుల కోసం చాలడం లేదనుకున్నపుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని అనే్వషించాలి. అలాగని అక్రమ మార్గాలను ఎన్నుకోకూడదు. ఆదాయ వనరుల కోసం భార్యాభర్తలిద్దరూ కుటుంబ పోషణకై పాటుపడితే తప్పులేదు. ఉమ్మడి కుటుంబంలో అయితే మిగతా కుటుంబ సభ్యులపాత్ర కూడా భాగస్వామ్యం చేయాలి. కుటుంబ బడ్జెట్- అవసరాలు, విలువలు, ప్రాధాన్యాలకు అనువుగా, అనుకూలంగా వుండాలి. వ్యక్తిగత లక్ష్యాల్ని పూరించేదిగా ఉండాలి.
ఉన్నంతలో సంతృప్తికరంగా మలచుకోవాలే తప్ప లేనిదాని గురించి ఆలోచించకూడదు. అసంతృప్తిని పెంచుకోకూడదు. ‘ఆదాయాన్ని అనుసరించి ఖర్చులు’ అన్న తరతరాల నానుడిని ఎవరికివారు అప్లయ్ చేసుకోవాలి.
ఏ రకం బడ్జెట్‌లోనైనా తగుమాత్రం పొదుపు వుండేవిధంగా శ్రద్ధ వహించి, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే, అత్యవసర సమయాల్లో ఆందోళన పడాల్సిన అవసరం వుండదు. ఆర్థిక ఇబ్బందులవలన కుటుంబంలో కలిగే చిరాకు పరాకులు చీకుచింతాకు దూరం కాగలరు.
ఉన్నది ఉన్నట్లు ఖర్చుపెట్టేసే ధోరణిని విడనాడి, కొంత మొత్తాన్ని పొదుపు చేసే సూత్రాన్ని నేర్చుకోవాలి. లక్ష్యం ఏదైనా తగు మాత్రంగా, ఇబ్బందిపెట్టకుండా వాస్తవిక దృక్పథంతో ఉండాలి. పెద్ద పెద్ద ప్రణాళికలతో పనిలేదు. నిర్ణయించుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా అనుసరించగలిగేలా అందుబాటులో వుంచుకోవాలి.
ముందే పెద్ద మొత్తంలో దాచుకోవాలనే అత్యాస ఉండకూడదు. కొద్ది కొద్దిగా పదులు, వందల్లో మొదలుపెట్టినా చాలు. అవి క్రమంగా పెరిగి ఏడాదికో, ఐదేళ్ళకో పెద్ద మొత్తంగా చూపగలవు. ఆ తర్వాత లక్ష్యాన్ని చేరుకోగలవు. ఈ ప్రక్రియవల్ల సమస్యల్లోంచి కూడా గట్టెక్కగలవు. ఏ రకం ఒత్తిడి, ఆందోళన కలగవు. జీవితంలో అనుకోని అవాంతరాలకు సంబంధించి ఒక ధైర్యం, నమ్మకం కూడా కలుగుతుంది. అవకాశాలను బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కోసమో లేదా ఖర్చులను తగ్గించుకునే పద్ధతుల కోసమో అనే్వషించాలి తప్ప సరితూగని ఆదాయ వ్యయాల లెక్కల నడుమ సతమతం కాకూడదు. పెరిగే ఖర్చులు, నిలకడగా వున్న ఆదాయం నిరంతరం ఒత్తిడిని పెంచుతాయని గుర్తెరిగి ఆ ప్రకారం ప్రతి ఖర్చునూ బేరీజు వేసుకుంటూ నడుచుకోవాలి. బడ్జెట్‌లో హెచ్చుతగ్గులు, ఖచ్చితంగా పాటించలేకపోవడం సహజమే. అయితే బడ్జెట్ వేసుకోవడం తప్పనిసరి. అనుకోని ఖర్చులు వచ్చిపడినా దిగులుపడాల్సిన అవసరం లేదు.
ఓ ప్రణాళిక, పద్ధతి ప్రకారం, వాటిని అనుసరించడానికి ప్రయత్న లోపం లేకుండా వుంటే చాలు. సగం విజయం సాధించినట్లే. ఆదాయ వ్యయాల నడుమ సమతౌల్య ప్రయత్నమే ఆర్థిక ప్రణాళిక అన్న సంగతిని గుర్తుంచుకుంటే ఆర్థిక ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గిస్తుంది.
ధనమే అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుకోవడం మానవ ధర్మం..

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660