మెయిన్ ఫీచర్

మహోపాధ్యాయుడు రాధాకృష్ణన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికతా కేంద్రాలుగా భాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో
ఇనుమడింపజేయాలి. వారిలో నిగూఢంగా వున్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

భారతీయ దార్శనిక చింతనాధోరణులను, సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు తనదైన శైలిలో రచనల ద్వారా తెలియజేసిన గొప్ప రచయిత, విద్యావేత్త, వేదాంతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. సంస్కృత భాషలోని భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను తాత్త్విక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయ దర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యయనం చేసేలా కృషిచేసిన వేదాంతి రాధాకృష్ణన్. ఆయనవల్లనే భారతీయ దర్శనం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది అనుటలో అతిశయోక్తి లేదు. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీరి రచనలో ముఖ్యమైనవి ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ద ఐడియల్ వ్యూ ఆఫ్‌లైఫ్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్ ఇండియన్’, ‘ది దమ్మపద గౌతమబుద్ధ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. భారతదేశ సంస్కృతిని, నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన జన్మదినం అయినటువంటి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం మన దేశంలో ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితి 1962లో ప్రారంభమైంది. ఇది ఏ విధంగా ప్రారంభమయిందో ఓసారి చూద్దాం.
రాధాకృష్ణన్‌గారు మన దేశానికి 1952 నుండి 1962 వరకు ఉపరాష్టప్రతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్టప్రతి పదవిని అలంకరించారు. భారత రాష్టప్రతిగా పదవీబాధ్యతలు చేపట్టే సందర్భంలో దేశ విదేశాల్లో వున్న తన శిష్యులు శ్రేయోభిలాషులు అంతా అతనిని కలిసి మనసారా అభినందించి తన జన్మదినమయినటువంటి సెప్టెంబర్ 5న ఆ సంవత్సరం ఘనంనంగా జరుపుటకు నిర్ణయించుకున్నట్లు తెలుపగా తన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటి నుండి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది. తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరాడు అంటే అతనికి ఆ వృత్తిపైనున్న గౌరవం ఎంతటిదో అవగతమవుతుంది. తన జీవితంలో సింహభాగం దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు బోధనావృత్తిని ఆయన ఎంతో పవిత్రంగా, ఆదర్శంగా నిర్వహించారు. భారత రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పిదప కూడా ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమైన తన జీవితాన్ని ఆయన ఏనాడూ విస్మరించలేదు. తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ద్వారా ఆ వృత్తికి సమాజంలో గుర్తింపును, గౌరవాన్ని, స్థాయి, ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలనేది అతని ప్రగాఢ విశ్వాసం. అతని దృష్టిలో సమాజంలో గుణాత్మకమైన మార్పు విద్యావిధానం ద్వారానే గాక విద్యను బోధించే ఉపాధ్యాయుల ద్వారా అధికంగా వస్తుంది. దేశంలో నైతిక విలువలతో కూడిన ఆదర్శ సమాజ నిర్మాణం అసాధ్యమైంది ఏమీ కాదు. సమాజంలో మనం ఆశిస్తున్న విలువలతోకూడిన గుణాత్మకమైన మార్పు కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యవౌతుంది. ఈ గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనే గాక మంచి సమాజాన్ని నిర్మించగలరు. ఉపాధ్యాయుల ప్రభావం పాఠశాల నాలుగు గోడలకే పరిమితం కాక సమాజం అంతటా విస్తరిస్తుంది అనేది అతని ప్రగాఢ విశ్వాసం.
1888 సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్‌గారు మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తుని నగరంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువల్లూరులో, రేణిగుంటలో పాఠశాల, ఉన్నత విద్యను, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన తత్త్వశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్ జార్జ్ ఆచార్య పీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్ఠించారు. 1929లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపాల్‌గా, ఆ పిదప ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్’ బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. యునెస్కో అధ్యక్షులుగా మాస్కోలో భారత రాజబారిగా పనిచేసిన రాధాకృష్ణన్‌గారు 1952లో ఉపరాష్టప్రతిగా, 1962లో రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. సర్వేపల్లి గొప్ప రచయిత, తత్త్వవేత్త, సమకాలీన దార్శనికులలో పేరెన్నికగలవారు. 1954లోనే మన దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకొని 1962లో రాష్టప్రతిగా ఎన్నికయినపుడు ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్’ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు.
రాధాకృష్ణన్‌కు చిన్నతనంనుంచే తాత్త్విక జిజ్ఞాస మెండు. ఉపనిషత్తుల ప్రభావం అతనిపై అధికంగా ఉండేది. ముఖ్యంగా తైత్తిరీయ ఉపనిషత్తులో వౌద్గల్య మహర్షి చెప్పిన ఉపాధ్యాయ లక్షణాలు- విలువలతో అతను ఎంతగానో ప్రభావితమయ్యారు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఎలాంటి సంబంధముండాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే సమాజంలో ఉపాధ్యాయునికి ప్రతిష్ఠ, గౌరవం గుర్తింపు, స్థాయిలు లభిస్తాయో, సామాజక ధర్మాన్ని లేదా సంఘ ధర్మాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా నిర్వహించాలి అనే పెక్కు అంశాలను వౌద్గల్య మహర్షి ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు లక్షణాలు, విధులకు సంబంధించిన 15 అంశాలను వివరించారు. ఆ 15 అంశాలు ఉపాధ్యాయుని విధులను నిర్దేశిస్తాయి. ప్రతిభతోపాటు ఆ 15 లక్షణాలు ఉన్న వ్యక్తే ఆ వృత్తికి అర్హుడు. ప్రతిభ ఒక్కటే ఉపాధ్యాయ వృత్తికి కొలమానం కారాదు. ప్రతిభతోపాటు సత్యం చెప్పటం, సత్యాన్ని జీవిత పర్యంతం ఆచరించటం, తోటి మానవులయందు దయా దాక్షిణ్యాలు కలిగివుండటం, ధర్మబద్ధంగా సంసారం చేయటం, కోపాన్ని నిగ్రహించుకోవటం, నైతిక విలువలను కలిగి వుండటం, అధ్యయనం బోధన ఉపాధ్యాయునికి ఉండవల్సిన ప్రధాన లక్షణాలుగా ఈ ఉపనిషత్తు పేర్కొంటుంది. వీటన్నింటిని తన జీవిత పర్యంతం ఆచరించిన వ్యక్తి రాధాకృష్ణన్. ప్రతి ఉపాధ్యాయుడు వీటిని ఆచరించి సమాజంలో ఇతరులకు మార్గదర్శకంగా, ఆదర్శవంతులుగా నిలబడ్డప్పుడే వాళ్ళు సామాజిక ధర్మాన్ని నెరవేర్చినవారవుతారనేది రాధాకృష్ణన్ ప్రగాఢ విశ్వాసం.
ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్‌గారు తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు - విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికతా కేంద్రాలుగా భాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో ఇనుమడింపజేయాలి. వారిలో నిగూఢంగా వున్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల మానసిక పరిపక్వతకే గాక వారి శారీరక అభివృద్ధికి అవి దోహదపడాలి. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజ న్యాయం మొదలగు ప్రజాస్వామ్య విలువలను విశ్వవిద్యాలయాలు సంరక్షించాలి. అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలబడాలి కానీ దీనికి భిన్నంగా నేడు పెక్కుమంది ఉపాధ్యాయులలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో సామాజిక నైతిక విలువలు క్షీణించి స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఉపాధ్యాయ వృత్తి మసకబారుతుంది. బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు క్షీణించిపోవడానికి ఒక్క ఉపాధ్యాయులే కారణం కాదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానం కూడా కొంతవరకు కారణమే. బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలతోపాటు సామాజిక నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తుకుతెచ్చి ఆ వృత్తికి న్యాయం చేకూర్చటంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిద్దాం.

- ప్రొ॥ జి. లక్ష్మణ్ 98491 36104