మెయిన్ ఫీచర్

ఫేస్‌‘బుక్’ అయతే ఇక అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. పరిచయం లేని వ్యక్తులతో ఫేస్‌బుక్ కొత్త స్నేహమే ఓ అభం శుభం తెలియని బాలిక ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన యువకుడు అమ్మాయి పాలిట యముడిగా మారి ప్రాణాలు తీశాడు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన 17 సంవత్సరాల అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమించానంటూ, కోరిక తీర్చుకుని ఆపై ముఖం చాటేసిన హైదరాబాద్ యువకుడు... ఇలాంటి వార్తలతో సంచలనాత్మకంగా మారిన ఈ ఘటనలు యావత్ ప్రజానికాన్ని నివ్వెరపరుస్తున్నాయి.
ఇటీవల యువత నోట్లో బాగా నానుతున్న మాట ముఖచిత్రం (ఫేస్‌బుక్). స్నేహితులను ఆన్‌లైన్‌లో పలకరింపులతో పాటుగా సందర్భం ఏదైనా అందరితో పంచుకునేందుకు ఒక వేదిక, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు, ఏదైనా విజయాన్ని సాధిచినప్పుడు, వేడుకలు, సన్నివేశాలు పంచుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితోపాటుగా విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహ శుభకాంక్షలు, విషాద సంఘటనలు.. సందర్భం ఏదైనా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కట్టిపడేసింది అని చెప్పవచ్చు. ఫేస్‌బుక్ దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఏదో ఒకటి పోస్ట్ చేస్తేనే కాస్తంత సరదా.. ఈ సరదాలే అప్పుడప్పుడు జీవితాలను మారుమారు చేస్తున్నాయి.
అమ్మాయిలూ.. జాగ్రత్త
ఫేస్‌బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోయి చాలామంది దానికి బానిసలవుతున్నారు. కొందరి జీవితాలలో ఫేస్‌బుక్ ఒక వ్యసనంగా మారిపోయి పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్‌లతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్‌బుక్ మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అపరచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో స్నేహం చేయడంవల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతూనే వున్నాయి.
బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్
కొందరు బినామీ పేర్లతో ఫేస్‌బుక్ అకౌంట్లు నిర్వహిస్తున్నారు. అమ్మాయిల పేర్లు, ఫొటోలతో ఫేస్‌బుక్ అకౌంట్లు ఎక్కువగా వుంటున్నాయి. ఫేస్‌బుక్ రిక్వెస్ట్‌లు పంపించి మెల్లిమెల్లిగా స్నేహం పెంచుకుని వారితో సరదాగా మొదలైన ఛాటింగ్ ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపుతున్నారు. బినామీ అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలి. వీటివల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు.
ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు దూరం..
ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు ఓకే చెప్పకూడదు. తెలిసినవారా లేదా అని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు దూరంగా ఉండాలి. అలాంటి రిక్వెస్ట్‌ల బారినపడి మోసపోవద్దు.
ఫేస్‌బుక్‌తో ప్రపంచ విషయాలు
ఫేస్‌బుక్‌తో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి ఎంతగా వుంటుందో చెడు అంతకంటే ఎక్కువగా త్వరగా ప్రభావం చూపుతుంది. స్నేహితులతో సరదాగా విషయాలు పంచుకోవడం, కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడం, ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా తెలుసుకునే వీలు ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ప్రకటనలు ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు.
వ్యక్తిగత విషయాలపై జాగ్రత్త
అందరికీ తెలిసేలా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత, కుటుంబ సంబంధ ఫొటోలు, స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయకూడదు. వ్యంగ్యమైన, సమాజ ఆమోదయోగ్యం కాని పోస్టింగుల విషయంలో దూరంగా ఉండడం మంచిది.
తల్లిదండ్రులు దృష్టి సారించాలి
సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని అవుతుంది. అలా కాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారితీస్తుంది. పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లతో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం వుంది. తల్లిదండ్రులుగా మీరు ఎంతగా చెప్పినప్పటికీ పిల్లలు ఫేస్‌బుక్ వ్యసనం నుండి బయటపడకపోతే వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

- డా॥ అట్లశ్రీనివాస్‌రెడ్డి 97039 35321