మెయిన్ ఫీచర్

అనవసరపు ఆలోచనలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి ఎప్పుడూ ఏవో ఆలోచనలు వస్తూనే వుంటాయి. ఏదో ఒక అంశం గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడూ ఒకే అంశంపై దృష్టిని కేంద్రీకరించి ఆ ఆలోచనలతోనే.. ఆ కోరికలతోనో.. ఆ వ్యాపకాలతోనే కాలం గడపటం అంత మంచిది పద్ధతి కాదు. ఈ లక్షణాలు కలిగినవారు చాలామంది ఉంటారు.
నిత్యం ఆలోచనలతోనే పొద్దుపుచ్చడం లాంటి లక్షణాల్ని ఆంగ్లంలో ‘అబ్సెషన్’ అంటారు. అబ్సెసషన్లలో కూడా అనేక రకాలున్నాయి. కొందరికి పరిశుభ్రత పిచ్చి, మరికొందరికి సోకు పిచ్చి. పరిశుభ్రత, ఆరోగ్యం, వస్తధ్రారణ, తాజాగా మొబైల్స్.. ఇలా ఏదో ఒక అంశంమీద చాలామంది పిచ్చి వ్యామోహంతో ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఈ శ్రద్ధ, ఆసక్తి మితిమీరకుండా వున్నంతవరకు ఫర్వాలేదు. అవధులు దాటి.. వ్యసనపరులుగా మారి అనుక్షణం వాటి గురించే ఆలోచిస్తూ, భ్రాంతిలోనే పొద్దుపుచ్చుతుంటే మనసులో చికాకు, చీకు చింత ఏర్పడుతుంది. చివరికి మతిస్థిమితం కోల్పోతారు.
ఆహారం గురించి, వయసు గురించి, నిద్ర అలవాట్ల గురించి, వృత్తి, ఉద్యోగ జీవితం గురించి, వ్యాపారం గురించి, ప్రమోషన్ల గురించి, పైచదువుల గురించి, పై అధికారులు, సహోద్యోగులు.. ఇలా ఎదుటివారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ చింతిస్తూ కాలం గడిపేస్తుంటారు. అవే సర్వస్వం అనుకుంటూ, ఇరవై నాలుగు గంటలు అదే భ్రమతో మానసికంగా వేదనకు గురౌతుంటారు.
ఈ అబ్సెషన్లకు దూరంగా వుండకపోతే అసాధారణమైన అలవాట్లు కూడా వచ్చి మనపై పడతాయి. అబ్సెషన్ల ఫలితంగా జీవితం సాఫీగా సాగకపోగా మనశ్శాంతి, సుఖసంతోషాలు కరవవుతాయి. తమకి తెలియకుండానే జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించి అనేక అంశాలను అలక్ష్యం చేయడం జరుగుతుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత, ఆనందం దూరం కాకమానదు.
అవగాహనలేమి, అపనమ్మకాలు లాంటి సమస్యలు వెన్నంటి ఉండి వాటిని మరింతగా పెంచుతాయి. వీటికితోడు మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మన సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభించదు. తమ సమస్య గురించి ఇతరులకు చెప్పుకోలేక బయటపడే మార్గం తెలియక వీరు సతమతమవుతుంటారు. మనకు సాధారణంగా తెలిసిన స్క్రిజోఫ్రీనియా తదితర మానసిక వ్యాధులకంటే భిన్నమైనవ్యాధి అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్. ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య అత్యధికంగా వున్నా, సహాయం కోసం వైద్యులను సంప్రదించేవారి సంఖ్య మాత్రం నామమాత్రమే. ఈ వ్యాధితో 2 నుంచి 3 శాతం మంది బాధపడుతున్నారని వైద్య పరిశోధకులంటున్నారు. ఈ వ్యాధి సాధారణంగా 18 సంవత్సరాల వయసులో ఆరంభమవుతుంది. వ్యాధికి గురైన 5 నుంచి 10 సంవత్సరాల తరువాతే బాధితులు వైద్యులను సంప్రదించడం జరుగుతుందని పరిశోధకులంటున్నారు. అయితే మానసిక సమస్యలవల్ల ‘అబ్సెషన్’ ఉచ్చులో ఇరుక్కొనడానికి ఖచ్చితమైన కారణం ఏమిటో ఇంతవరకు రుజువు కాలేదు. అయితే కొంతమంది మానసిక భ్రాంతులకు కొన్ని కారణాలను గుర్తించి నివారణోపాయాలు సూచించారు.
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, సాంఘిక సేవ, నటన, నాట్యం, పుస్తకపఠం, వ్యాయామం, ఆటలు వంటి వాటి పట్ల అత్యంత ఆసక్తి కనబర్చడంవల్ల మానసిక ఉల్లాసం, విజ్ఞానం పొందవచ్చు. మనలోని ప్రతిభ కూడా బయటకు వస్తుంది.
ఏదిఏమైనా, ప్రతి నిమిషం ఒకే యావ వుండే వ్యక్తి, దాని ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకోవాలంటే మనసును ఇతర అంశాలమీదకు మళ్లించడంసరైన వైద్యం. ఏదో వ్యాపకం పెట్టుకోవడం, శారీరక శ్రమ చేయడం, విహారయాత్రలకు వెళ్లిరావడం, పత్రికలు - పుస్తకాలు చదవడం, రచనలు చేయడం వంటి వాటి ద్వారా మనసును పక్కకు మళ్లించి అబ్సెషన్లనుంచి దూరం కావాలి. క్రమం తప్పక ఇలాంటి నివారణోపాయాలను పాటించడంవల్ల ఆలోచనలను నియంత్రణలో వుంచుకోగలిగి, అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలుగుతారు. లేదంటనే అబ్సెషన్‌వల్ల ఎన్నో నష్టాలకు గురికావాల్సి వస్తోంది. ప్రతి నిమిషానికీ ఆందోళన, చింత పెరిగిపోతాయి. నిద్రపట్టకపోవడం, గాభరాగా ఉండడం, రక్తపోటు ఎక్కువ కావడం జరుగుతాయి. మానసిక ఒత్తిడివల్ల తలెత్తే తలపోటు, అజీర్తి, ఆర్థరైటిస్, ఎలర్జీల వంటి అనారోగ్యాలూ కలుగుతాయి. ఈ అబ్సెషన్ తారాస్థాయికి చేరుకుంటే మానసిక బలహీనతలకు దారితీసి పిచ్చివాళ్లుగా మారవచ్చు.
అలాగే మద్యపానం, మాదకద్రవ్యాల వాడకం, ధూమపానం వంటివాటికి దగ్గరై లేదా మితిమీరి మానసిక రుగ్మతలకు, అర్థంపర్థంలేని అబ్సెషన్లకు గురికావాల్సి వస్తోంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ అబ్సెషన్లకు దూరంగా ఉండాలి. అబ్సెషన్ తీవ్రమైపోతే మానసిక వైద్య నిపుణుల నుంచి వైద్య సహాయాన్ని తీసుకోవడం తప్పనిసరి.
ఈ అబ్సెషన్ నుండి బయటపడలేమనే అపనమ్మకం చాలామందిలో నాటుకుపోయివుంది. కానీ ఇది సత్యం కాదు. గత రెండు దశాబ్దాల్లో ఈ వ్యాధికి చేసే చికిత్సలో అనేక మార్పులు సంభవించాయి. మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆలోచనలు, తద్వారా చర్యలను మార్చే పద్ధతి వంటి అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధిగ్రస్తులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వ్యాధిగ్రస్తులు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చికిత్స ఆరంభించిన వెంటనే మార్పు రాదు. ఈ వ్యాధిలో మందులు ప్రారంభించిన 6 నుండి 12 వారాల తరువాత మార్పు కనిపిస్తుంది. ముఖ్యమైన విషయమేమిటంటే వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కాని, వారి స్నేహితులు, బంధువులు కాని బాధితులను కించపరిచేలా, బాధపడేలా ప్రవర్తించకూడదు. ఇది పెద్ద వ్యాధి కాదన్నట్లు, దీనికి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమై, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి.
అబ్సెషన్లవల్ల మనోవ్యాకులత పెరిగి, అనర్థాలు సంభవిస్తాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మన పురోగతికి అది ఓ పెద్ద బంధకమని గ్రహించాలి. సాధ్యమైనంత వరకు ఏవేవో భ్రాంతులలో పడి కొట్టుకుపోకుండా ముందుగా జాగ్రత్తపడాలి. ఒకవేళ పొరపాటున అబ్సెషన్ బారిన పడినా వీలైనంత త్వరగా బయటపడటానికి ఆత్మీయులు, బంధు, మిత్రులమధ్య గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం అబ్సెషన్ల నివారణోపాయాలను పాటించడం చేయాల్సిందే. తప్పదుమరి!

-కంచర్ల