మెయిన్ ఫీచర్

బతకడమే పరిష్కారం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్య అనే కంటే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐపిసి 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం చేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు’ అని స్పష్టం చేసింది.
ఈ రోజుల్లో ఏ పేపర్ తిరగేసినా ఆత్మహత్యల వార్తలే. మనిషి వందేళ్లు బతకాలని ఎన్నో ఆశలతో ఈ భూమి మీద అడుగు పెడతాడు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా బతికే క్రమంలో కష్టాలు ఎదురు అయితే ఆత్మస్థైర్యంతో నిలబడి ఎదుర్కొంటున్నాడా? కష్టాలని తట్టుకోలేని బేలతనం, సున్నితత్వంవలన మధ్యలోనే జీవితాన్ని చాలిస్తున్నారు. రెండు దశాబ్దాలక్రితం వరకు ఆత్మహత్యల సంఖ్య ఇంత భయానకంగా లేదు. తామరతంపరగా ఆత్మహత్యలు పెరగడానికి గల కారణాలని విశే్లషిస్తే, కుంటుబడిన కుటుంబ సంబంధాలు ఒక కారణం అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలిపోవడం మరొక కారణం. పూర్వకాలలంలో ఉమ్మడి కుటుంబం ఉండేది. అన్నదమ్ములు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఒకరికి కష్టం వస్తే కుటుంబం అంతా అండగా ఉండి ధైర్యాన్ని చెప్పేవారు. మనకంటూ కొంతమంది ఉన్నారు అన్న భరోసా ఉండేది. ఆర్థిక అవసరాల దృష్ట్యా కూడా ఒకరు కుంగుబాటుకు గురి అయితే మిగతా కుటుంబంలో వారు ఆదుకునేవారు. అభివృద్ధి సాధించిన ఫలాలలో వికృతమైనది కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం ధ్వంసం కావడం.. అసలు ఆత్మహత్యల కథాకమామీషు ప్రపంచంలో ఎలా ఉందో చూడండి.
భారతదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. హిందూ ధర్మశాస్త్రాలు ఆత్మహత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. సార్క్ దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్షమందిలో 8 నుండి 50 మందిదాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 45వ స్థానంలో ఉండగా, శ్రీలంక 12వ స్థానంలో వుంది.
ఇచ్ఛామరణం పొందిన ప్రముఖులు భీష్మాచార్యుడు అంపశయ్యపై తనువు చాలించాడు. స్వామి వివేకానంద కపాలమోక్షం పొందారు. పోతులూరి వీరబ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారు. కానూ సన్యాల్ ఉరి వేసుకుని చనిపోయారు.
మరోసారి ఆత్మహత్యలకు కారణాలు వెతికితే ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, అవాంఛిత గర్భం, వరకట్న వేధింపులు, నయంకాని జబ్బులు, అనారోగ్యం, తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు హీరోలపై మితిమీరిన అభిమానం, ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం, పురుగు మందుల అందుబాటు, అనువంశిక, జన్యులోపాలు, కుటుంబంలో ఎవరి అండదండలు లేకపోవడం వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం, మోసపోవడం, మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం, మద్యానికి బానిస కావడం, భార్యాభర్తలమధ్య గొడలు పడడం, ఒకరికొరు అర్థం చేసుకోకపోవడం- ఇవి కారణాలు అయితే ఆత్మహత్య పద్ధతులు భిన్నంగా ఉంటున్నాయి. మహిళలకన్నా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నరని ముఖ్యంగా వివాహితుల్లో భార్యలకన్నా భర్తలే రెట్టింపు సంఖ్యలో బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారని తేలింది. వీరిలో నడివయస్సువారే ఎక్కువ.
ఇక మతపరంగా చూసినా ఆత్మహత్య మహాపాపం అని అన్ని మతాలు అంటున్నాయి. హిందూ ధర్మం ప్రకారం ఆత్మహత్య మహాపాతకం అంటోంది. ప్రముఖులు మొదలుకొని సామాన్య జనం వరకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు? పైన పేర్కొన్నట్టుగా ఆర్థిక అవసరాలవలన కావచ్చు, ప్రేమరాహిత్యంవలన కావచ్చు, జీవితంపై విరక్తి చెందే, డిప్రెషన్‌వలనో-కారణం ఏదైనా కావచ్చు కానీ జీవితాన్ని బలవంతంగా ముగించాలని అనుకోవడం సరికాదు. మరి ఆత్మహత్యలను ఆపడం ఎలా? అంటే ఎక్కువమంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్లు మళ్లీ ఆత్మహత్య గురించి ఆలోచించరు. పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు, చిన్న విషయానికే ఆవేశం, మనస్తాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి. బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తుతెచ్చుకోవాలి. సమస్యలను తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.
ఎవరైనా ఆత్మహత్యకి పాల్పడాలి అనుకునేవారి ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్ని మారిపోతాయి. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తెలుసుకోవచ్చు. కుటుంబ సభ్యులు మిత్రులు, ఆఫీసులో పనిచేసేవారు ఆత్మహత్య చేసుకునేవారికి మోటివేషన్ ఇస్తే కాస్తంత కోలుకోవచ్చు. కొన్ని సామెతలని, మరికొన్ని మంచి మాటలు చెప్పి చావడం అనే ఆలోచనని మార్చవచ్చు. బతికియున్న శుభములు బడయవచ్చు, బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు, చచ్చి ఏం సాధిస్తావు? ఇలాంటి మంచి సామెతలు చెప్పి మనసుని మార్చవచ్చు.
ఆత్మహత్య అన్నది క్షణికావేశంలో తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం. ఆ క్షణంలో వారిని ఆపగలిగితే బతుకుమీద ఆశని కల్పించగలిగితే ఒక జీవితాన్ని కాపాడినట్టే. జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ (ఎస్‌పిఐఫ్) దీనికోసం పనిచేస్తుంది. హైదరాబాద్‌లో రోషిని అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఆత్మహత్య గురించి ఆలోచించేవాళ్ళకి, డిప్రెషన్‌లో కూరుకుపోయినవాళ్ళకి సహాయం అందజేస్తోంది.
చావడం మన చేతుల్లో లేదు.. బతకడం మాత్రం మన చేతుల్లో వుంది. దేవుడిచ్చిన బతుకుని క్షణికావేశంలో ప్రాణం తీసుకోవడం పాపమే కాదు నేరంకూడా. ‘బతుకు బతికించు’ సూత్రంతోముందుకు వెళితే ఆత్మహత్యలు తగ్గవచ్చు. ఆ దిశగా అడుగులేద్దాం.

-పుష్యమీ సాగర్ 90103 50317