మెయిన్ ఫీచర్

వ్యక్తిత్వమే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం’’
-అన్న అలనాటి సినీకవి సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది. ఇనుప కచ్చడం బిగించి కఠోర తపస్సుచేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక వికాసానికి ఆనకట్ట వేసుకున్నాడు.
చింతామణి కోసం అత్తగారిచ్చిన అంటు మామిడి తోటలను సైతం అమ్మివేసి నీళ్ళబిందెలు మోసిన భవానీ శంకరం, చావుబతుకుల్లో ఉన్న భార్యను సైతం విడిచి వచ్చి కళ్ళు పొడుచుకొన్న బిల్వమంగళుడు, లక్షల విలువజేసే వ్యాపారం కోల్పోయి అట్ల పళ్ళెం చేత బట్టిన సుబ్బిశెట్టి పాతకాలం ఉదాహరణలు.
విమానంలోని అందగత్తెలతో అసభ్యంగా ఒళ్ళు మరచి ప్రవర్తించిన అడిక్ రామారావు, ప్రభుత్వ అతిథి గృహాన్ని తనకు నచ్చిన అందగత్తెతో శృంగార లీలలకు ఉపయోగించిన జె.బి.పట్నాయక్‌లు ఈనాటి ఉదాహరణలు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్లు దొంగచాటుగా శృంగారాస్వాదన చేస్తున్న స్వాములు మరెందరో!... వీరంతా ఎప్పుడో పొందే స్వర్గానందం ఇప్పుడే ఇక్కడే పొందుదామని తొందరపడి పోతున్నట్లుంది.
కానీ,
‘‘శరీరానందమే జీవిత మకరందం కాదు.
ఆత్మానందం పొందాలి..
ఈ మాటంటే!
వినేవారెవరు?
అందాన్ని ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించి, చివరికి శరీర సౌందర్యం తాత్కాలికమని గ్రహించిన వాడు కాబట్టి వేమన- ‘‘తొమ్మిది కంతల తిత్తికి ఇమ్మగు సొమ్ములు ఏటికి చెపుమా?’’ అన్నారు.
సత్కార్యాలు చేయటం ద్వారా ఆత్మ సౌందర్యం పెరుగుతుంది. శాశ్వతమయిన ఆనందం కలుగుతుంది. అన్నివిధాలా ఆనందానికి అర్హులవుతారు.
నాటి తరం నుంచి నేటితరం వరకూ అందరూ- అందానికి దాసులే.
అందం అయస్కాంతం లాంటిది. నేడు అందాల పోటీలు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోతారు. అంటే- దేశమంతటా సౌందర్య స్పృహ పెరిగింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అందాన్ని ఆపాదించుకోడానికి తాపత్రయపడుతున్నారు. అందానికి ఉన్న ఆకర్షణ అలాంటిది. అయితే-శారీరక సౌందర్యం కాలంతోపాటు కరిగిపోతుంది. వ్యిక్తిత్వ సౌందర్యమే కలకాలం నిలిచి ఉంటుంది.
ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, దియామీర్జా, గద్దె సింధూర వీళ్లంతా భారతదేశపు అందాల రాణులు. సౌందర్యం వీరికి విశ్వఖ్యాతి అందించింది. అందం పట్ల మోజు పెరుగుతోన్న నేపథ్యంలో నగరాలు, పట్టణాలకే కాదు పల్లెలకూ బ్యూటీపార్లర్లు విస్తరించాయి. దేశంలో సౌందర్య సాధనాల అమ్మకాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. అందానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈనాటిది కాదు. కావ్యాలు, ప్రబంధాల్లోనూ అందాల వర్ణనలు కోకొల్లలు. కాళిదాసు లాంటి కవులు తమ కథానాయకుల అంద చందాల గురించి చేసిన వర్ణనలు ఈనాటికి అద్భుతమే. కాలమేదైనా అందం అయస్కాంతం లాంటిది!
ఆకర్షణశక్తిని పెంచుకోడానికి ఆసక్తిచూపడంలో తప్పులేదు. అయితే వ్యాపార ప్రకటనలను నమ్మి పెంచుకునే కృత్రిమ అందంతో ఎంతవరకూ సఫలీకృతులం అవుతాం అన్నదే ప్రశ్న.
సహజ సౌందర్యానికి మెరుగులు దిద్దడం మరచి, కృత్రిమ అందాలకు తాపత్రయపడటం ఎండమావుల వెంట పరుగెత్తడం లాంటిదే. సహజమైన జీవనశైలి, తగినంత వ్యాయామం, మంచి ఆహారం ద్వారా పొందే ఆరోగ్యం మన అందాన్ని, ఆకర్షణనూ పెంపొందిస్తుంది. అంతే తప్ప కృత్రిమ సౌందర్యం కలకాలం నిలవదు. అదే వ్యక్తిత్వ సౌందర్యం చిరస్థాయిగా నిలుస్తుంది.
అందం ఆకర్షిస్తుంది. ఆకర్షణ సమాజానికి ఆధారం. ఆకర్షణతోనే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడతాయి. పరస్పర ఆకర్షణ ద్వారా మాత్రమే వ్యక్తులు సమాజంలో సభ్యులుగా రాణించగలుగుతారు. ఎక్కువకాలం జీవించగలుగుతారు.
అయితే, దీనికి శారీరక ఆకర్షణ ఒక్కటే సరిపోదు. గుణగణాలు, వ్యక్తిత్వం లాంటి మానసిక ఆకర్షణలు అవసరం. ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యానికి, భౌతిక, మానసిక అంశాలు రెండూ ముఖ్యమే. అయితే, ఇందులో శారీరక ఆకర్షణ తొలిమెట్టు మాత్రమే. అది వయసుతోపాటు కరిగిపోతుంది. సాన్నిహిత్యం పెరిగేకొద్దీ మానవ సంబంధాల్లో వ్యక్తిత్వ అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వాములు సైతం ఒకరినొకరు వ్యక్తిత్వ లక్షణాలతోనే ఎక్కువ ఆకర్షణకు గురవుతారు. యువతీ యువకులు ఎక్కువగా శారీరక ఆకర్షణకు గురికావచ్చు కానీ, ఆ ఆకర్షణలోనూ వ్యక్తిత్వ లక్షణాలు, బుద్ధి, తెలివితేటలకు ప్రాధాన్యత ఉంటుంది.
కాబట్టి పదుగురినీ ఆకట్టుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ అదే పనిగా తిరగాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. బాహ్య సౌందర్యంకన్నా ఆత్మ సౌందర్యం చూడాలి.
ఎదుటివారి ముందు ఎలాంటి దాపరికం లేకుండా మనం మన వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించాలి. అయిస్కాంతంలాంటి చిరునవ్వుతో ఎదుటివారిని ఆకర్షించాలి. అందంగా ఉండటమంటే డిజైనింగ్ దుస్తులు వాడమని కాదు, ఉన్న వాటిని శుభ్రంగా వాడుకుంటే చాలని. ఎదుటివారికి అందంగా కనిపిస్తారు. కూర్చున్నా, నిల్చున్నా మనకంటూ ఒక స్టయిల్ ఉండాలి. మాట్లాడే వ్యక్తి కళ్లలోకి సూటిగా చూడటం అలవాటు చేసుకోవాలి. కళ్లతోనే ఆకర్షణ పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం కలిగించే స్నేహాన్ని నలుగురికీ పంచాలి. ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా విని, తర్వాత మనోభావాలను వ్యక్తీకరించాలి.
ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరొకరిని పొగడకూడదు లేదా నిందించకూడదు. మాటల్లో వ్యక్తంకాని విషయాలను తెలిపే బాడీ లాంగ్వేజ్‌ని గమనించాలి. చిన్న, పెద్ద తేడాలులేకుండా అందరి పట్లా గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి. క్రమశిక్షణ అలవర్చుకోవాలి.
మృదుభాషణతో ఎదుటివారి స్పందనను అంచనావేయాలి. ఎదుటివారి స్పందనకు అనుగుణంగా మన మనసులోని భావాలను వెల్లడించాలి. అవతలివారు మనతో మాట్లాడటం ఓ ఆనందకరమైన విషయంగా పరిగణించేలా నడచుకోవాలి. వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నంతలో శుభ్రంగా, పోషక విలువలతో మంచి ఆహారం తీసుకుంటూ, రోజూ వ్యాయామం, యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆనందంతోపాటు అందమూ మీ సొంతమవుతుంది. వ్యక్తిత్వమూ నిలుస్తుంది!...

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660