మెయిన్ ఫీచర్

అన్యోన్యతకు అసలు దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం సరదాల తోటని, సంతోషాల మూటని, ఇంకొకటని.. మరొకటని.. ఎవరెన్ని విధాలుగా వివరింపజూసినా జీవితం నవరసభరితం. ఇందులో కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు ఎంతమాత్రం పరిగణనలోకి రావన్నది గమనార్హం. అందుకోవాలన్నది అందుకోలేకపోవడం, ఎంత మాత్రం వూహించనిది సునాయాసంగా చేతికందడం, ఎంతగానో ఆశించింది పొందలేకపోవడం ఎవరి జీవితంలోనైనా సర్వసామాన్యం!
ప్రతి ఒక్కరికీ ఒక గతమున్నట్లే నేడు తాతలు, ముత్తాతలుగా వున్నవారికి సైతం ఓ గతం సర్వసామాన్యం. ఎన్నో దశాబ్దాల క్రితమే యువకుడిగా వున్నపుడు ఎన్ని సంబంధాలు మేమంటే మేమని పోటీపడినా వారి మనసు మరెవరి మీదనో వుండి సంబంధం కలుపుకోవాలని ఆశించినా సదరు యువతి తల్లిదండ్రులు మరొక సంబంధం కుదుర్చుకున్నపుడు కానీ, పీటల దాకా వచ్చిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయినపుడు కాని కొన్నాళ్లు కాదంటే కొనే్నళ్లు యువతికైనా, యువకుడికైనా బాధ అనివార్యం. పెద్దలు తగిన విధంగా స్పందిస్తే యువతికి తగిన భర్తరావడం, యువకుడికి భార్య దొరకడం సర్వసామాన్యం. నిన్నటి నేడు, నేటిలా రేపు వుండటం ఎక్కువ సందర్భాల్లో సాధ్యంకాదు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళనే ధోరణి వ్యవహారాల్లో పనిచేస్తుందేమో కాని ప్రేమలు, పెళ్ళిళ్ళ విషయాల్లో ప్రతికూల ప్రభావాలనే చూపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రేమలు ఫలించడంలో, అవి పెళ్లి పీటలపైకి ఎక్కించడంలో ఏ చిన్న అవాంతరాలు ఎదురుకానివారికి ఒకరికోసం ఒకరు పుట్టారేమో అన్నంత పరమానందం సర్వసామాన్యం. మనిషొకటి తలిస్తే దైవం మరొకటి జరిపిస్తుందని, రాతలుంటే ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిగా ఒకటవడాన్ని ఎవ్వరూ ఆపలేరని జీవితంలో ప్రతి నిత్యం వింటూనే వుంటాం. మన చుట్టూ జరిగే సంఘటనలు చూస్తూనే వుంటాం. ఆస్తులు అంతస్తుల గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి ఆరాతీస్తే తల్లిదండ్రులు అమ్మాయివైపే కాదు అబ్బాయి వైపు వుంటున్నారు. కులాంతర మతాంతర, దేశాంతర వివాహాల వైభవమెలా వున్నప్పటికి ఆడపడుచులు, అత్తమామలు తమ కుమార్తె వ్యవహారంలో వేలు పెట్టరాదని, అవసరమనుకుంటే అల్లుడే తమ కుమార్తెకు వండిపెట్టాలని షరతులు విధించేవారి సంఖ్య కులమతాల కతీతంగా పెరిగినట్లు సభ్య సమాజంలో ప్రతినిత్యం చెవులార వింటున్న, కనులార చూస్తున్న వింత పోకడలే!
నిజమే. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. ఎవరి కోసం ఆగదు కూడా! అత్తా ఒకింటి కోడలే అని చెప్పుకున్నా కోడలు కూడా అత్తగా అవతారమెత్తుతుందని చాటి చెప్పినా ఎవరికే అభ్యంతరాలు వుండవు, వుండకూడదు. బయట చేసే పనులను శ్రద్ధాసక్తులతో చేసినా, ఇంటా బయట ఎవ్వరితో మసలుకునే తీరులోనైనా భయమో భక్తో వుట్టి పడాలా? స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి ఎవరెన్ని విన్నా, ఎవరెన్ని వినిపించినా అడుగడుగునా వాటిని కాలరాచే వాళ్లు కొందరైతే, ఒకరి చెప్పు చేతల్లో బందీలుగా వుండటమేమిటని నిష్కర్షగా ప్రశ్నిస్తూ ఎవరి మెప్పుల గొప్పలకో కాక తమ స్వేచ్ఛకు, తమ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లకుండా, తమ మూలంగా ఎదుటివారికే అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తపడేవారున్నారు. ఇలాంటి విషయాలు ఎవరికెలా అనిపించినా తానొవ్వక, మరెవరిని నొప్పించరాదనే ఆలోచనలు ఎవరిలో వున్నా అభినందించదగినవీ, ఆహ్వానించదగినవీనూ!
ఒకవిధంగా చూస్తే చదువులు, వాటి మూలంగా లభిస్తున్న అవకాశాలు యువతకు సంతృప్తినిస్తున్నాయి. అవే వారిని కుటుంబాలకు దూరం చేస్తున్నాయనే పెద్దల అభిప్రాయాలను కాదనలేం కాని రెక్కలొచ్చిన పక్షులు ఒకచోట నిలకడగా వుండవన్నది, వుండలేవన్నది జగద్వితితమే కదా! ఆస్తులు, అంతస్తులు, చేస్తున్న ఉద్యోగాలు ఆలుమగల మధ్య అన్యోన్యతను దూరం చెయ్యాలా? స్థిరచరాస్తులు సంపాదించుకోవాలన్న ఆలోచనలు, ఆధునికతను నిత్య జీవితంలో ప్రతిబింబింపజేయాలనుకోవడం మెచ్చుకోదగినవైనా మూడడుగులు ముందుకేస్తే ఏడడుగులు వెనక్కిపడే తీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసిందే. ఈ సందర్భంగా బంధు మిత్రులందరూ మననుంచి ఏదో ఆశించేవాళ్లేనని అనుకోక మన అన్యోన్యతను మనసారా ఆకాంక్షించే వారున్నారన్న ఆలోచన ఆరోగ్యకరమైనది. జీవితం గడిచేందుకు సంపాదన అవసరమే తప్ప జీవితమే సంపాదించడానికన్నట్లు ఎవరన్నా తప్పే! మన చుట్టూ కనిపించేది ఇందుకు భిన్నంగా వుంది.
రంగు రంగుల సినిమాల్లో సైతం ప్రేమలు, పెళ్లిళ్ళు, దాంపత్యాలు, కాపురాలు- మొదటినుంచి చివరిదాకా కళ్లకింపునే కలిగించవు. మనసుని మెలిపెడతాయి. అడుగడుగునా ఎదురయ్యే అవాంతరాలు ఆలోచింపజేస్తాయి. జీవితాల్లోంచి సినిమాలు పుట్టుకొచ్చినా జీవితమెప్పుడూ రంగుల సినిమా కాదు. దాంపత్యంలో అన్యోన్యత వారికి కలగబోయే పిల్లల ఎదుగుదలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేస్తుంది. ఈ విషయం భార్యాభర్తలకు తెలియాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకొని అమలు చేసుకోగలగాలి. బంధు, మిత్రులు, ఇరుగుపొరుగు నిజంగా తమ క్షేమాన్ని, భవితను కోరుకుంటున్నారా? క్షణాల్లో తమని మాయజేసి వారి పబ్బం గడుపుకోవాలని ఆశిస్తున్నారా అన్నది పసిగట్టగలగాలి.
జీవితంలో ఎవరి అవసరాలు వారికుంటాయి. అవసరాలను ఎవరు స్వేచ్ఛగా వదిలేసినా అవి జీవితంలోని మర్యాద మన్ననలను కాలరాసేవే. ఫలితంగా పరిచయం పేరుతో, స్నేహ సాన్నిహిత్యాల పేరుతో ఎవరినైనా ఏ విధంగానైనా ఉపయోగించుకో చూస్తాయి. ఈ క్రమంలో ఎవరికైనా ప్రతిఫలంగా అందే కృతజ్ఞతలకన్నా చేతిలో వున్నది పోగొట్టుకోవడం, తమ ముందు నిలబడి కళ్ళలోకి చూసే అర్హత లేనివారితో సైతం దుష్ప్రచారానికి గురవడం! అందుకే ఏ స్నేహం ఎటుదారితీసేది, ఏ బంధుత్వం ఎటు పరుగులు పెట్టించేది గుర్తెరిగి నడచుకోవాలి. ఈ విషయాల్లో ఎటువంటి మొహమాటాలకు గందరగోళాలకు అవకాశం ఇవ్వొద్దు.
పుట్టినప్పటినుండి ఒకరికొకరు ఎంతో తెలిసినవారైనా, ముక్కూ మొహం తెలియక పెళ్లితో ఒకటైన వారైనా జీవితాంతం నువ్వే నేనని, నేనే నువ్వని వుంటూ మూడు ముళ్ళకీ, ఏడడుగులకు విలువని పెంచేవారు తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఆనందదాయకంగా వుంచడంలో అన్ని వేళల్లో ముందేవుంటారు. వర్తమానాన్ని సుసంపన్నం చేసుకుంటూ భావితరాలకు తమ ఆత్మీయతను కానుకగా అందజేస్తూనే వుంటారు.

- డా॥ కొల్లు రంగారావు 98662 66740