మెయిన్ ఫీచర్

మనసున్న మహానేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండైన వ్యక్తిత్వం..
గొప్ప నాయకురాలు..
ఉత్తమ పార్లమెంటేరియన్..
పరిపాలనా దక్షురాలు..
మార్గదర్శకురాలు..
అసాధారణ రాజకీయవేత్త..
ప్రజల గొంతుకై నిలిచిన గొప్ప వక్త..
ఇన్ని విశేషణాలు ఆమెకు మాత్రమే సొంతం. అందుకే వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆమెను ‘ది మోస్ట్ లవ్‌డ్ ఇండియన్ పొలిటీషియన్’ అని అభివర్ణించింది. ఆమే సుష్మాస్వరాజ్. ఒకసారి బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. అక్కడ ఆర్.ఎస్.ఎస్. నేతల మధ్య చిట్‌చాట్ జరుగుతోంది. అప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్‌కే పరిమితం. ‘ఇందిరాగాంధీ శకం చూశాం కదా.. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో ఓ మహిళ ప్రధాని అభ్యర్థిని మన పార్టీ నుంచి ప్రతిపాదించే అవసరమే వస్తే.. టాప్ 20లో ఒక పేరు ఉంటుంది.. ఆమే సుష్మా’ అన్నాడు ఓ సీనియర్ నాయకుడు. ‘అవును.. కానీ మహిళా అభ్యర్థి అని అనకండి. ప్రధాని అభ్యర్థి అనండి చాలు.. అద్వానీ తరువాత ఆమే..’ అన్నాడు మరో సీనియర్. ఆ మాటకు అక్కడున్న అందరూ తలలూపారు. ఇది అతిశయోక్తి కాదు.. నిజంగానే ఆ స్థాయి నాయకత్వ లక్షణాలను కలిగిన నాయకురాలు ఆమె. కోట్లాది మందికి మార్గదర్శకురాలు. ప్రజాసేవ, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. గొప్ప పరిపాలనా దక్షురాలిగా.. ఆమె పనిచేసిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. అద్భుత కార్యదక్షత కలిగిన నేత. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే ఆమె వెంటనే స్పందించి సాయం అందించేవారు. అంతేకాదు ఆమె అద్భుతమైన పార్లమెంటేరియన్. గొప్ప వక్త. పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాల విషయంలో రాజీలేని నేతగా గొప్ప పేరు తెచ్చుకుంది సుష్మాస్వరాజ్. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు సుష్మాస్వరాజ్. భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. విద్యార్థి నాయకురాలి నుంచి కేంద్రమంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమే.. విదేశాంగమంత్రిగా ఎంతోమంది భారతీయులకు ఆపన్నహస్తం అందించింది. భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఆమె స్వయంగా సహాయం చేసిన సందర్భాలెన్నో..
రాజకీయ ప్రస్థానం..
సుష్మా 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలా కంటోనె్మంటులో జన్మించారు. కళాశాల విద్యవరకు అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌లో న్యాయవిద్యను అభ్యసించారు సుష్మాస్వరాజ్. అలా తన ‘లా’ డిగ్రీ అయిపోయిన వెంటనే.. 1973 నుంచే అంటే 21 సంవత్సరాల వయస్సు నుంచే సుప్రీంకోర్టులో లాయర్ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. 1970లలో అంటే.. విద్యార్థి దశలోనే సుష్మాస్వరాజ్.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. చండీగఢ్‌లో లా చదువుతున్నప్పుడే స్వరాజ్ కౌశల్ పరిచయమయ్యారు. తరువాత స్నేహితులయ్యారు. లా పూర్తయిన తరువాత ఇద్దరూ సుప్రీంకోర్టులో జార్జ్ ఫెర్నాండెజ్ దగ్గర పనిచేసేవాళ్లు. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఇద్దరూ.. అలా వీరు 1975 జులైలో పెళ్లి చేసుకున్నారు. 1977లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. మొదటిసారిగా హర్యానా నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి, పాతిక సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిపోయింది. అలా హర్యానా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అతి పిన్నవయస్సులో ఓ రాష్ట్రానికి మంత్రి కావడం దేశంలో తొలిసారి. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోక్‌దళ్- భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం మరియు పౌరసరఫరాల శాఖా మంత్రిగా వ్యవహరించారు. 1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు రెండోసారి దక్షిణ దిల్లీ నుంచి ఎన్నికైన సుష్మా.. వాజ్‌పేయి రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖలకు మంత్రిగా పనిచేశారు. దిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం సుష్మాస్వరాజ్‌ను రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో భాజాపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2014 నుండి 2019 మే వరకు విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన ఈమె ఎంతోమందికి సహాయం చేశారు.
దయా హృదయురాలు
విదేశాంగశాఖామంత్రిగా తనదైన ముద్ర వేశారు. ‘చాలామంది దౌత్యవేత్తలు నిద్రపోయే సమయంలో కూడా సెల్‌ఫోన్లు ఆఫ్ చేసేవారు కాదు’ అని సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు సరదాగా జరిగిన ప్రచారం. ఎవరైనా సహాయం కోసం సుష్మాను ఆశ్రయించిందే తడవు.. వెంటనే ఆమె సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ‘నేను నిద్రపోను.. నా దౌత్యవేత్తలను నిద్రపోనివ్వను..’ అని ఓ ప్రెస్‌మీట్‌లో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఆమె పనితీరుకు అద్దం పడతాయి. విదేశాంగ శాఖ అంటే వ్యూహా లు.. ప్రతి వ్యూహాలు.. ఇటువంటి శాఖను ఆమె ప్రజలకు చేరువ చేశారు. బధిర యువతి గీతను పాకిస్థాన్ నుంచి మాతృదేశానికి తీసుకొచ్చారు. వివాహబంధంలో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ఉజ్మాను రక్షించారు. భర్త చేతిలో మోసపోయి దిక్కులేకుండా శరణార్థ శిబిరంలో తలదాచుకున్న గురుప్రీత్‌ను అక్కున చేర్చుకున్నారు ఈ చిన్నమ్మ. వీరం తా ‘్భరతమాత కూతుర్లు’ అని చెప్పేవారు సుష్మా. యెమన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో సుష్మా పాత్ర కీలకం. తమ దేశ ప్రజలు ఎక్కడున్నా రక్షించేందుకు వాయుసేన విమానాలను సైతం వినియోగించగలమని ప్రపంచానికి తెలియజెప్పింది. మెడికల్ వీసాల సమయంలో మానవీయ కోణంలో ఆలోచించారు సుష్మా. ఇది ప్రజల మనసులు గెలుచుకుంది. మనదేశ యువతులకు రంగుల కలలు చూపించి విదేశాలకు తీసుకెళ్లి మోసం చేసే ఎన్నారైల భరతం పట్టడానికి ఉద్దేశించిన బిల్లును సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వారికి అమ్మగా వ్యవహరించారు సుష్మా. గల్ఫ్ దేశాల్లో మగ్గి, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎంతోమందిని సొంత ఊళ్లకు చేర్చి మానవత్వం చాటుకున్నారు.
పాకిస్థానీల పట్ల కూడా..
పాక్‌తో ఎన్ని విభేదాలున్నా.. ఆ దేశ సామాన్య ప్రజల పట్ల మాత్రం సుష్మాస్వరాజ్ తన దయాహృదయాన్ని చాటుకుంది. పాకిస్థాన్ లాహోర్‌కి చెందిన ఓ సివిల్ ఇంజినీర్.. తమ నెలల పసికందుకి భారత్‌లో చికిత్స కోసం వీసా వచ్చేలా సాయం చేయాలని ట్విట్టర్‌లో కోరాడు. ఎప్పటిలాగానే వెంటనే స్పందించిన సుష్మా.. ‘నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు’ అని భరోసా ఇచ్చి.. ‘ముందు పాక్ హైకమిషన్‌ను సంప్రదించండి.. మీకు మెడికల్ వీసా వచ్చేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు. అలాగే నసీం అక్తర్ అనే మహిళకు కాలేయ మార్పిడి శస్తచ్రికిత్స కోసం వీసా ఇవ్వాలని ఆమె కుమారుడు కోరగా.. భారత హై కమిషన్ సాయం తీసుకోవాలని స్పందించి వారి సమస్యకు వెంటనే పరిష్కారం చూపారు. ఇలా దాయాది దేశం భారత్‌పై ఎన్ని కుయుక్తులు పన్నినా సుష్మా మాత్రం అక్కడి సామాన్య ప్రజలకు అండగా నిలిచారు.
సామాజిక మాధ్యమాల్లో...
సామాజిక మాధ్యమాలను ప్రజల ఉపయోగానికి వాడిన గొప్ప నేత సుష్మాస్వరాజ్. ట్విటర్ వేదికగా తమ సమస్యలను చెప్పుకున్న ఎంతోమందికి ఆమె అండగా నిలిచి ఖ్యాతికెక్కారు. ‘మార్క్స్‌పై చిక్కుకున్నా సరే.. భారతీయుల కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాం’ అంటూ చేసిన వ్యాఖ్య భారతీయుల సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనం. ఆమెకు ట్విటర్‌లో 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని మోదీకి ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సున్నితమైన మనసున్న సుష్మాజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ..
నా తల్లిని పోగొట్టుకున్నాను
సుష్మాస్వరాజ్ మరణవార్తను గీతకు బుధవారం ఉదయం చెప్పారు. అది విన్నప్పటి నుంచీ గీత ఏడుస్తూనే ఉంది. తన హావభాలు, సైగల ద్వారా ‘నేను నా తల్లిని పోగొట్టుకున్నాను’ అని కుమిలిపోతూనే ఉంది గీత. గీతకు, సుష్మాస్వరాజ్‌కు ఉన్న అనుబంధం అటువంటిది మరి. సుష్మా ఎప్పుడు మధ్యప్రదేశ్‌కు వచ్చినా గీతను కలిసేవారు. వీరిద్దరి అనుబంధం ఏంటంటే.. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్థాన్ చేరుకుంది. లాహోర్ రైల్వేస్టేషన్‌లో సంజౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా కూర్చుని ఉన్న గీతను పాక్ రేంజర్లు గుర్తించారు. అప్పుడు ఆమె వయస్సు ఏడు - ఎనిమిదేళ్లు. దాదాపు 12 సంవత్సరాలు ఆమె పాక్‌లోని ఈదీ ఫౌండేషన్‌లో ఉంది. సుష్మాస్వరాజ్ జోక్యంతో ఎట్టకేలకు 2015 అక్టోబర్ 26న గీత భారతదేశానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సుష్మాస్వరాజ్‌తో గీత తన సైగల ద్వారా ‘నేను భారతీయురాలిని.. మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టాను. అందుకే భారతదేశంలోనే ఉండాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అప్పటినుంచి సుష్మాస్వరాజ్ గీతను ‘్భరతమాత కూతురు’ అంటారు. తరువాత గీతను సుష్మా ‘డెఫ్-మ్యూట్ ఆర్గనైజేషన్’కు పంపారు. అప్పటినుండి ఆమె అదే ప్రాంగణంలో ఉంటూ, ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ పర్యవేక్షణలో చదువుతోంది. సుష్మాస్వరాజ్ గీత గురించి అప్పుడప్పుడూ వీడియోకాల్ చేసి మాట్లాడేవారట. గీతకు తనే మంచి సంబంధం చూసి, కన్యాదానం చేసి పెళ్లి చేస్తానని ఒకానొక సందర్భంలో చెప్పారు సుష్మా. ఒకసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన సుష్మాస్వరాజ్ గీతను కలుసుకున్నారు. దాదాపు గీతతో ఇరవై నిముషాలు మాట్లాడి.. ‘ఇంతమంది యువకులను చూశావు కదా! వారు నీకెందుకు నచ్చలేదు?’ అని అడిగారట. అప్పుడు గీత తన సైగలతో.. ‘ముందు మా అమ్మానాన్నలను చూశాకే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పిందట. అందుకు సుష్మా ‘మీ అమ్మానాన్నలను మేం వెతికి పెడతాం! నువ్వు ఇప్పుడు పెళ్లిపై దృష్టిపెట్టు.. తగిన వరుణ్ణి ఎంచుకో!’ అని చెప్పారట. ఇంతవరకూ గీతకు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలియలేదు. సుష్మాస్వరాజ్ వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు సుష్మాస్వరాజ్ గీత కోసం తగిన వరుడ్ని వెతుకుతూనే ఉన్నారు. అలా గీతకు వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే, కన్యాదానం చేయకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఈ అమ్మ కాని అమ్మ.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి