మెయిన్ ఫీచర్

అతి గారాబం వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ! వారిని కొట్టరు, తిట్టరు, ఎన్ని చిలిపిపనులు చేసినా చూడనట్లు వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా తండ్రులకు అమిత ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడపరు కదా! అదే కారణం కావచ్చు. తల్లి ఇంతో అంతో భయపెట్టినా, పిల్లలకోసం భార్యాభర్తలు తగువులాడటం సర్వసాధా రణమై పోయి ంది. ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే పాఠశాలకు కూడా వెళ్లని వయసులో, అక్షరం ముక్క రాకున్నా స్మార్ట్ఫోన్ ఆపరేట్ చేసే స్థితిలో ఉన్నారు నేటి చిన్నారులు. దీనికంతటికీ కారణం ముమ్మాటికీ తల్లిదండ్రులే అని చెప్పక తప్పని పరిస్థితి.
తల్లిదండ్రులు సైతం వారి వారి పనుల్లో తీరిక లేకుండా గడపడం, ఉద్యోగరీత్యా ఇద్దరూ అలసిపోవడమో, ఏ ఇతర పనుల్లో ఉండటం, మరే ఇతర కారణాలవల్ల పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నారన్నది వాస్తవం. కనీసం నాన్నమ్మ, తాతయ్యలతో గడపటానికి ఉద్యోగరీత్యా వేరే గ్రామాలలో లేదా పట్టణాలలో వేరుకాపురం పెట్టడంవల్ల పిల్లలకు కథలు చెప్పడం, భవిష్యత్ గురించి మంచి మాటలు వినే అదృష్టానికి నేటి చిన్నారులు నోచుకోవడంలేదు.
గతంలో రాత్రి ఎనిమిదిగంటలకల్లా భోజనం పూర్తిచేసుకొని ఆరుబయట పడుకొని ఆకాశంవైపు చూస్తూ, నక్షత్రాల గురించి ఎన్నో కథలను అల్లి అందులో నీతిని బోధిస్తూ, ఐకమత్యం గురించి, మన సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి, పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో తెలియజేసేవారు.
ఆనాడు పాఠశాలలకు వెళ్లకపోయినా సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పేవారు. కానీ నేడు ఆ కథలు చెప్పేవారు అసలే లేరు. అక్కడక్కడా ఉన్నా పరిణామక్రమంలోని మార్పులవల్లో, లేదా మరే ఇతర కారణాల ప్రభావం మూలంగా పిల్లలు వినడానికి సిద్ధంగాలేరు. వీటన్నింటి మూలంగా వచ్చే తరానికి భవిష్యత్‌లో సక్రమంగా ఎలా నడచుకోవాలో తెలియజేయలేని పరిస్థితి ఏర్పడింది.
కనీసం పాఠశాలలోనైనా నేర్చుకుంటారనుకుంటే అక్కడా అన్నీ ర్యాంకులు బట్టి చదువులు. సదువు చారెడు - బలపాలు దోచెడు అనే విధంగా తయారైంది. ఇదిలాగే కొనసాగితే సమాజానికి ఎలాంటి ఉత్పత్తినిస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
ఉన్నత పాఠశాలలకు వచ్చేసరికి ఇక్కడ తల్లిదండ్రుల భయం, అక్కడ ఉపాధ్యాయుల భయం లేకుండా నేటి సాంకేతిక పరిజ్ఞానానికి లోనై, ఏం చేస్తున్నారో, ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి దాపురిస్తోంది. ఇంకో విషయమేమిటంటే నేటి పరిస్థితుల్లో పిల్లలకు ఎవ్వరి భయం లేకపోవడమనేది క్రమశిక్షణా రాహిత్యానికి దారితీసి, చెడు సావాసానికి పురిగొల్పి ప్రక్కదారి పట్టిస్తుంది. తరగతి గదిలో నలుగురు మంచి నడవడిక కలిగిన మిత్రులతో సావాసం చేస్తే చెడ్డవాడు సైతం మంచివాడిగా మారడానికి వీలవుతుంది. కానీ నలుగురు చెడ్డవారితో సావాసం చేస్తే మంచివాడు సైతం వారిలా మారాల్సిందే.
నేడు పాఠశాల విద్యలోనే విద్యార్థులు వివిధ చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. గతంలో పట్టణాలు, నగరాలలో కాలేజీ విద్యార్థులను లక్ష్యం చేసుకొని కొన్ని ప్రైవేటు వ్యాపారులు విదేశాలనుండి మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ను విద్యార్థులకు అలవాటుచేసి ఆర్థికపరమైన వ్యాపారం చేసేవారు. కానీ అది కాస్తా నేడు పాఠశాల స్థాయిదాకా రావడం బాధాకరం. ఇపుడు చిన్న చిన్న నగరాలకు కూడా వ్యాపించి పాఠశాల వయసులోనే విద్యార్థులు ఇలాంటి దురలవాట్లకు బానిసలు కావడం చాలా దురదృష్టకరం.
బాధాకరమైన విషయమేమిటంటే తల్లిదండ్రులకు వారి పుత్రరత్నాలు ఎలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులివ్వడం, గారం చేసి గుడ్డిగా వారిని నమ్మేయడమే. ఎలాంటి నిఘాలు, తనిఖీల చేయకుండా, ఏం చదువుతున్నాడో ఆరా తీస్తూ పరిశీలించడం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పనులు. లేదంటే మన పిల్లలు మనకు దక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదిఏమైనా జరగరానిది జరిగితే తల్లిదండ్రులకే ఎక్కువ బాధ కలుగుతుంది. కావున చిన్నతనంనుండి పిల్లల పెంపక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే సమాజానికి ఉత్తమ పౌరులను అందించినవారమవుతారు.

- డా॥ పోలం సైదులు 94419 30361