మెయిన్ ఫీచర్

గోరింటాకు పేరు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలంనుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. వేదాలలో గోరింటాకు ఎరుపును సూర్యునికి ప్రతీకగా చెపుతారు. సంస్కృతంలో గోరింటాకు చెట్టును ‘మెంథికా’ అంటారు. ఆ పదం నుంచే మెహిందీ వచ్చింది. గోరింట ఆకులను ఎండబెట్టి, పొడిచేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాల్లో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి పెరిగి, అండాశయం పనితీరు సక్రమంగా ఉంటుందని చెపుతారు. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటే ఆషాఢంలో బయటి వాతవారణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయటి వాతవారణానికి విరుద్ధంగా తయారై అనారోగ్యాలు తప్పవు. అందుకే శరీరంలో వుండే వేడిని తగ్గించే శక్తి వున్న గోరింటాకును పెట్టుకుంటారు. ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని పెద్దలే కాకుండా డాక్టర్లు కూడా అంటున్నారు. అంతేగాక అరచేతి మధ్యలో స్ర్తి గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. పొలం పనులు చేసేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు నీటిలో కాళ్ళు చేతులు తడపడంవల్ల చర్మవ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజులు ఆపుతుంది.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గోరింటాకు పెట్టుకుని ఉంటారు. గోరింటాకు ఎలా పుట్టిందంటే పెద్దలు చెప్పే ఎక్కువ ప్రాచుర్యంలో వున్న కథ ఇది. గోరింటాకు (గౌరింటాకు) గౌరి ఇంటి ఆకు. అది కాస్తా గోరింటాకు అయ్యిందట. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునేలోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్ర్తి సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. స్ర్తిల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని చెప్పాడట. అప్పటినుంచి స్ర్తిలకు గోరింటాకుపై ఎనలేని మక్కువ పుట్టిందట. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢమాసంలో తల్లిగారింట్లోవున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట.
ప్రయోజనాలు
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో వుండే లాసోన్ అనే సహజ రసాయనంవల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. అంతేగాక పండుగలు, ఫంక్షన్లకు చేతులు అందంగా కనిపించేందుకు గోరింటాకును పెట్టుకుంటారు.
‘‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడని, గనే్నరులా పూస్తే కలవాడు వస్తాడని, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగివస్తాడని’’ అనే సినీ గేయాన్ని ఆషాఢమాసంలో మహిళలు ఆలపిస్తుంటారు. ఆషాడంలో గోరింటాకు ఎక్కడ ఉన్నా మహిళలు వెతికి మరీ మెత్తగా రుబ్బి చేతులకు కాళ్లకు అందంగా పెట్టుకుంటారు. ఎంత బాగా పండితే అంతగా వారి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందనే నమ్మకం వివాస సమయంలో పెండ్లి కుమార్తెలకు మెహందీ పెడతారు. గోరింటాకు డిజైన్లు పెట్టడం ఎందరికో ఉపాధి చూపిస్తోంది. ఇపుడంటే మార్కెట్లో పౌడర్లు, కోన్స్ లాంటివి రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. మహిళలకు ఇష్టమైంది గోరింటాకు. ‘‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా, మురిపాలా అరచేతా మొగ్గా తొడిగిందీ’’ అని ఓ కవి ఎంతో రమ్యంగా గోరింటాకు అందాలను వర్ణించాడు. కృత్రిమ గోరింటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకును వాడటం ఎంతైనా మేలు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు పుచ్చిపోయి పిప్పి గోళ్ళు అయ్యే ప్రమాదముండదు. గోర్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దానిని గోరింటాకు అన్నారు. గోరు + అంటు - గోరును అంటుకుని ఉండేదని అర్థం. సంస్కృతంలో దీని అసలు పేరు నఖరంజని.
వివాహం కానివారు, జాతకంలో శుక్రదోషం వల్ల ఇబ్బందులున్నవారు ఈ గోరింటాకును దానం చేయడంవల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గోరింటాకును రుబ్బి కీళ్ళ నొప్పులకు పట్టు వేస్తే తగ్గుతాయట. ఆషాఢంలో ఆదివారంనాడు ఖచ్చితంగా అతివలందరూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. ఇంట గోరింట ఉంటే వెంట ఆరోగ్యం వున్నట్టే అని పెద్దలు చెబుతారు. గోరింటాకు పెట్టుకోవడంవల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. గోరింటాకు పువ్వులను తలక్రింద పెట్టి నిద్రపోయినట్లయితే బాగా నిద్ర వస్తుంది. గోరింటాకు పెట్టుకోవడమనేది మన జీవన విధానంలో ఒక ఆచారంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనేలా చేశారు. వాతావరణ పరిస్థితుల కనుగుణంగా పెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్పథం తేటతెల్లవౌతుంది. తెల్లని జుట్టును కూడా నల్లబరిచే ఔషధ గుణం గోరింటాకులో ఉన్నదని ఇటీవల శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. ఈనాడు బ్యూటీపార్లర్‌లలో మనం కోరిన విధంగా రకరకాల డిజైన్లలో గోరింటాకును డిజైన్ చేస్తున్నారు. మీరూ గోరింటాకును పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.

- కె. రామ్మోహన్‌రావు 9441435912