మెయన్ ఫీచర్

వలసలను నియంత్రించేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్లిళ్ల రీత్యా, చదువుల నిమిత్తం ఒక్కెతె్తైతే బ్రతుకుదెరువుకై కొందరు, వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెళ్ళడం ఇంకొకెత్తు.
తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల నుండి వలస కూలీలు మహారాష్ట్ర, హైదరాబాద్, కువైట్, దుబాయ్.. వంటి ఇతర ప్రాంతాలకు బ్రతుకుదెరువుకై వలసలు వెళ్ళిన సందర్భాలెన్నో చూశాము. వివిధ దినపత్రికలు, టీవీలలో, మాస పత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రాల ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం. ఏదో ‘గుడ్డికంటే మెల్ల నయ్యం’ అన్నట్లుగా ఉన్నదన్నది నగ్న సత్యం.
మన తెలంగాణ రాష్ట్ర వలస బ్రతుకులు అందరికీ తెలిసినవే. కానీ మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వలసలు వచ్చిన వారి బ్రతుకులను ఒక్కసారి పరిశీలిస్తే...
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాలను కాంట్రాక్టర్లకు అప్పగించడం ఆనవాయితీ. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిషా, తెలంగాణ ప్రజలు భాగ్యనగరంలో చేసే పనులను చూస్తే...
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న, చితక పనులు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. వారి సంపాదన తక్కువగా వుండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాలలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపుతుంటారు.
బిహార్ రాష్ట్రం నుంచి వచ్చే వలస కార్మికులు కొంత మంది తెలంగాణలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవంతులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధ పండ్ల తోటల పెంపకం చేపడుతూ, అందులో పనిచేయడానికి ఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది. అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జీలు, వంతెనలు, ప్రాజెక్టులు, డ్యాముల నిర్మాణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందిన వారుంటారు.
బోర్‌వెల్స్‌లో పనిచేసే కార్మికులలో అత్యధిక మంది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆదివాసులే వుంటారు. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికే పరిమితమై పనిచేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపుతుంటారు.
భాగ్యనగరంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందిన వారుంటారు. వారు నామమాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు. పేదరికంతో ముందుగానే వారివద్ద డబ్బులు తీసుకొని, అప్పు తీర్చుటకు నెలలకొద్దీ పనిచేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణకు వలసల వచ్చి పండ్ల తోటలలో పనిచేస్తున్నవారు కొందరు. జార్ఖండ్ నుండి ఇక్కడకు పనిచేయుటకు వచ్చి ఆకలితో చనిపోవడం లాంటి వార్తలను వివిధ దినపత్రికల్లో చూస్తున్నాము.
హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ సమీపంలోకి వెళ్ళి చూస్తే ప్రత్యక్షంగా వలస కూలీల బ్రతుకులను దగ్గరగా చూడవచ్చు. వారితో సంభాషిస్తే వారి బాధలను కథలుగా వినవచ్చు. ఏదో బ్రతుకుదెరువుకై వచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకొని సంతోషంగా గడుపుతున్నారంటే అదీ లేదు, ఉద్యోగ భద్రత లేకుండా, యజమానుల క్రింద వెట్టిచాకిరీ చేస్తున్న... యజమానులకు కాసుల పంట పండుతుంది కానీ, వీరికి మాత్రం దినదినం గండంగానే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలస కూలీల బ్రతుకులను మార్చేదెవరు? అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికెళ్తున్నాయో అర్థంగాని పరిస్థితి.
దేశంలో సైతం వృద్ధిరేటు పెరుగుతుందని ఏవో సర్వేలు చేసి ఘనంగా చెప్పుకుంటారు తప్ప, ఎక్కడున్నది అభివృద్ధి? వీరి బ్రతుకులు మారేదెప్పుడు? మార్చేదెవరు? వీరి భద్రతకు ఎవరు భరోసానిస్తారు? అర్థంగాకుండా వున్నదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వలసలు పోవడంలో తప్పలేదు గానీ, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రక్షణగావిస్తూ, నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుంబంతో సంతోషంగా గడిపే విధంగా యజమానులు వుండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
దేశంలో రోజురోజుకు నిరుద్యోగత పెరిగిపోతున్నది, ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. పేదవారి పరిస్థితులను తెలపాలంటే వ్రాస్తే రామాయణమంతా, చెబితే మహాభారతమంతా ఉంటుందనడంలో నిజం లేకపోలేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రభుత్వాలు పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
నేటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలనాధికారులు ఇచ్చే ఉపన్యాసాలు అంతా ఇంతా గాదు, కానీ ఆచరణలో మాత్రం అనుకున్నంత మేరలో ఉండదు. ఎవ్వరైనా అవే విషయాలను ప్రస్తావిస్తే మేమనలేదని, అవి సాధ్యపడవని మాటలు మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా పేద, నిమ్న వర్గాలకు చెందిన ప్రజల బ్రతుకులకు భరోసా లేనప్పుడు ఈ ప్రభుత్వాలెందుకో అర్థంగాని పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన యంత్రాంగం మాటలు ఆపి ఆచరణలో సాధ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏవో పథకాలను చేపట్టి, డబ్బులు లెక్కలు చూపించి, పేపర్లకు పరిమితం గాకుండా క్షేత్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల పట్ల, శ్రామిక వర్గాల పట్ల అండగా వుంటూ, రక్షణనిస్తూ, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగా చట్టాలను గావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం. ఆ దిశగా ఆలోచిస్తూ వలసల నియంత్రణ గావిస్తూ, వారికి ఆర్థికపరమైన భరోసానివ్వాలని ఆశిద్దాం.

- డా.పోలం సైదులు