మెయిన్ ఫీచర్

అడ్డగోలు నిబంధనలు.. విద్యార్థులతో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదులు కాదు..
అయినా సరే చెకింగ్ పేరుతో ఒళ్లంతా తడమడమే....
అరాచక శక్తులు అంతకంటే కాదు..
కానీ తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకూ కాయమంతా కఠిన పరీక్షలే..
ముక్కుపుడక, కమ్మలే కాదు.. ఆఖరికి తాళిబొట్టు అయినా సరే తీసేయాల్సిందే..(అధికారులు తాళిబొట్టును కూడా ఓ నగగా భావించారేమో..)
ఆఖరికి అమ్మాయి వేసుకున్న పైట.., చెప్పుకుంటే సిగ్గుచేటు.. లోదుస్తులు అంటే ‘బ్రా’ తీయందే పరీక్ష హాలులో ప్రవేశం లేదు అన్న అధికారుల తీరును ఏమనాలి?
పరీక్షల పుణ్యమా.. అని విద్యార్థులను అనుమతించే క్రమంలో పైశాచిక చర్యలకు దిగుతున్నారు కొందరు అధికారులు. ‘వెనుక నుంచి ఏనుగు పోయినా ఫర్వాలేదు కానీ ముందు నుంచి చీమ కూడా వెళ్లడానికి వీళ్లేదు’ అని భీష్మించుకుని కూర్చున్నట్లున్నారు మన విద్యాధికారులు. అడ్డగోలు నిబంధనలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునే కొత్త ప్రయత్నాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం అతి వేగంగా అందిపుచ్చుకుంటోంది. వీటికి తమదైనరీతిలో కొత్త నిబంధనలను జోడించి చాలా అతి చేస్తోంది. అసలు పరీక్షల నిబంధనలు ఏమిటి? వివరాల్లోకి వెళితే..
నేటి విద్యార్థులకు పరీక్ష రాయడమే పెద్ద పరీక్షగా తయారైంది. ‘అనుమతులు, నిబంధనలు కేవలం విద్యార్థులకు మాత్రమే.. అధికారులమైన మాకు ఏమాత్రం వర్తించవు అన్నట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు’ నేటి విద్యాధికారులు.. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో మూడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసిన అధికారుల సంగతి ప్రజలింకా మరువనే లేదు.. ఇందుకు మేము ఏమాత్రం మినహాయింపు కాదని ముందుకు వచ్చేశారు నీట్ పరీక్ష నిర్వాహకులు. గతంలో ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు అనుమతివ్వాలంటే మంగళసూత్రం తీయాల్సిందేనని విద్యార్థినికి పెట్టిన నిబంధన చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. నీట్ నిర్వాహకులు వీళ్లను మించి పోయారు. మాకు అంతకుమించి వికృత చేష్టలు చేయడం వచ్చు అని నిరూపించుకున్నారు.
గత ఆదివారం దేశవ్యాప్తంగా నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పదకొండు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 104 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్ష కోసం పెట్టిన నిబంధనలు చూస్తే ‘బాబోయ్..’ అనాల్సిందే.. కోడిగుడ్డుపై ఈకలు పీకేలా ఉన్నాయి అధికారుల నిబంధనలు.
పొడుగు చొక్కా వేసుకోకూడదు, తల పిన్నులు పెట్టుకుంటే పరీక్ష రాయడానికి లేదు. బూట్లు వద్దు.. జీన్స్ పాంట్‌కు గుండీలు ఉండకూడదు. అమ్మాయిలు చెవి రింగులు పెట్టుకోకూడదు. ముక్కుపుడకలు కూడా వద్దు. పలుచని దుస్తులు మాత్రమే వేసుకోవాలి.. ఇలా ఎన్నో రకాల నిబంధనలు.. ఇవే నీట్ సిలబస్ అంత పెద్దగా ఉన్నాయి. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులను ఉగ్రవాదుల్లా పరీక్షించడమేమిటో, శరీరమంతా స్కానర్లతో గుచ్చిగుచ్చి చూడడమేంటో తెలియక విద్యార్థులు.., వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. కొన్నిచోట్ల ఇవేం పనులంటూ నిలదీశారు కూడా.. ఈ ప్రశ్నకు అధికారులు ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ‘ఇష్టం ఉంటే పరీక్ష రాయండి.. లేకపోతే లేదు.. ఇది పరీక్ష రూలు.. అంతే..’. ఈ సమాధానానికి మారు మాట్లాడకుండా విద్యార్థులు రాజీ పడి, వారు చెప్పింది చేసి పరీక్ష హాలులోకి వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేరళలోని ఒక సెంటరులో అధికారులు మరింత అతిగా ప్రవర్తించారు.
కేరళలోని ఓ సెంటర్లో పరీక్షకు హాజరైన విద్యార్థి లోదుస్తుల్లో అంటే బ్రాలో స్ట్రాప్‌కు అడ్జెస్టబుల్ మెటల్ బటన్ ఉందని హాల్లోకి అనుమతించలేదు. ఆమె బ్రా తీసేసిన తరువాతే పరీక్షకు అనుమతిచ్చారు. ఇంతకంటే అమానుష చర్య ఎక్కడైనా ఉందా? ఇలాంటి సంఘటనలతో ఆ విద్యార్థిని ఎంతటి మానసిక ఒత్తిడికి గురైందో.. అదే స్కూల్లో ఆ విద్యార్థిని తల్లి కూడా పనిచేస్తోంది. ఈ విషయం తెలిసినా కూడా విద్యార్థిని భవిష్యత్తు కోసం వౌనంగా బాధను దిగమింగుకుంది. ఇంత మానసిక క్షోభను అనుభవించిన ఆ విద్యార్థిని ఎలా మనశ్శాంతిగా పరీక్షను రాయగలదు? మరో విద్యార్థిని ముక్కు పుడక పెట్టుకుందని పరీక్షకు అనుమతించలేదు. అది తీద్దామంటే రాలేదు. దాంతో కటింగ్ ప్లేయర్‌తో ముక్కుపుడకను కట్ చేసుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది ఆ విద్యార్థినికి.. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారుల లీలలు ఎనె్నన్నో..
అధికారులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పరీక్ష నిర్వాహకులు.. తెలుగు మీడియంలో పరీక్షకు కూర్చున్న విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ మీడియం ప్రశ్నపత్రాలను ఇచ్చి తమ మేధస్సును చాటుకున్నారు. ఇక మొన్న జరిగిన ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాల చోద్యం మనం చూశాం కూడా.. ఎంతమంది విద్యార్థినీ విద్యార్థులు వీరి నిర్లక్ష్యానికి బలయ్యారో.. ఒక్కరు కూడా సమంగా, నిజంగా సమాధానం చెప్పలేదు. చెప్పలేరు కూడా.. ఎందుకంటే తప్పు వారిదే కాబట్టి.. ఇవేవీ రాజకీయ నాయకులకు, పై అధికారులకు పట్టవు. కేవలం విద్యార్థినీ విద్యార్థులను మాత్రమే వారు నిలదీస్తారు. దీనికి తోడు దిక్కుమాలిన నిమిషం లేటు నిబంధన. ఒక్క నిమిషం లేటైనా పరీక్ష రాయనివ్వం అని గంభీరమైన స్టేట్‌మెంట్లు ఇస్తారు. ఈ ప్రకటనలను బట్టి గేట్ల వద్ద పోలీసులు, సెక్యూరిటీ మరికాస్త ఓవరాక్షన్ చేసేస్తుంటారు.. ఒక్క నిముషం కాకూడదు, టపీమని గేట్లు మూసేస్తారు. ఏడ్చినా, మొత్తుకున్నా వినరు.. ఇంతకూ ఏ గడియారంలోని టైము కరెక్టు అనేది ఎవడైనా చెప్పగలడా? అస్సలు ఓ పదినిముషాలు లేటుగా వస్తే నష్టపోయేది విద్యార్థులే కదా.. మరి నువ్వెందుకు రానివ్వవు? అని ఎవరూ అడగరు. అడిగితే పైనుంచి మాకు ఆర్డర్లు అని సమాధానం. ఆ పైవాడు ఎవడో పైవాడికైనా తెలుసో.. లేదో.. ఇలా నిబంధనల పేరుతో విద్యార్థినీ విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. అసలు పరీక్షకు వెళ్లేటప్పుడు వాళ్లెంత ప్రశాంతంగా ఉంటే పరీక్ష అంత ప్రశాంతంగా రాయగలరు. కానీ ఈ విషయం ఎవరికీ పట్టదు.. విద్యార్థినీ విద్యార్థులు నిబంధనలను పాటించినా నిబంధనల్లో లేని నిబంధనలు ఎన్నో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది నేటి విద్యావ్యవస్థ. అసలు ఇలాంటి పరీక్షలు చేసే పరీక్ష నిర్వాహకులను దేశ సరిహద్దుల్లోని భద్రతా విభాగంలోనో, ఎయిర్‌పోర్ట్ చెకింగ్ కౌంటర్‌లోనే పెడితే ఇంకా బాగా పనిచేస్తారని నాకు గట్టినమ్మకం. నాకే కాదు చాలామంది విద్యార్థినీ విద్యార్థుల నమ్మకం కూడా ఇదే..
సహన పరీక్ష!

* పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా తీసుకురావాలి.
* విద్యార్థులు పలుచటి వస్త్రాలతో కూడిన దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
* దుస్తులకు పెద్ద గుండీలు, బ్యాడ్జీలు ఉండరాదు.
* పరీక్షకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు బూట్లను ధరించకూడదు. కాళ్లకు స్లిప్పర్.. అదీ తక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే ధరించాలి.
* విద్యార్థినీ విద్యార్థులు ఎటువంటి ఆభరణాలతో పరీక్షకు హాజరుకాకూడదు.
* ఎటువంటి ప్రింటింగ్ మెటీరియల్, పుస్తకాలు, జామెంట్రీ బాక్స్, కాలిక్యులేటర్, పెన్నులు, స్కేలు, రైటింగ్ ప్యాడ్, పెన్‌డ్రైవ్, ఎరైజర్, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదు.
* మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ మైక్రోఫోన్స్, పేజర్, హెల్త్ బ్యాండైడ్లను అనుమతించరు.
* హ్యాండ్ బ్యాగులు, బెల్ట్‌లు, క్యాప్‌లు, ఎటిఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్లాస్టిక్ ఐడెంటిటీ కార్డులు, రిమోట్ పరికరాలు అనుమతించరు.
* వాచీలు, కెమెరాలు, మెటాలిక్ వస్తువులు, తినుబండారాలు, వాటర్ బాటిల్స్‌ను అనుమతించరు.
* ఉదయం 7:30 గంటలకు పరీక్ష హాలులోనికి ప్రవేశం ఉంటుంది.
* ఉదయం 7:30 గంటల నుండి 9:45 గంటల వరకు అడ్మిట్ కార్డు చెకింగ్.
* ఉదయం 9:45 గంటలకు టెస్టు బుక్‌లెట్ పంపిణీ.
* ఉదయం 9:30 గంటల తరువాత పరీక్ష హాల్లోకి అనుమతి లేదు.
* ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
* పరీక్ష మూడు గంటల పాటు అంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఇవీ నిబంధనలు..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి