మెయన్ ఫీచర్

వయనాడ్‌లో ‘హస్తం’.. ఇరకాటంలో సీపీఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించడంతో సీపీఎం ఇరకాటంలో పడింది. అమేథీలో ఓటమికి భయపడి రాహుల్ వయనాడ్‌లో పోటీ చేస్తున్నారా? లేదా దక్షిణాదిన ప్రభావం చూపాలనుకుంటున్నారా? అన్నది వేరే సంగతి. కానీ, తమకు బలమైన స్థావరంగా భావిస్తున్న ప్రాంతంలో పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించడాన్ని సీపీఎం జీర్ణించుకోలేక పోతున్నది. ఒక వంక రాజకీయ పరంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుండగా, మరోవంక జాతీయ పార్టీగా గుర్తింపు పోగొట్టుకోవలసి వస్తుందని సీపీఎం నేతలు ఆందోళన చెందుతున్నారు. వయనాడ్‌లో రాహుల్ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే సీపీఎం నేతలలో అసహనం వ్యక్తమయింది. కాంగ్రెస్‌తో అనుసరించ వలసిన వైఖరిపై సీపీఎం జాతీయ నాయకత్వంలో స్పష్టమైన విబేధాలున్న విషయం అందరికీ తెలిసిందే.
2015లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీతారాం ఏచూరి కాంగ్రెస్ అనుకూల విధానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, ఆ పార్టీలో అత్యధికులు అంతకు ముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ కారత్ అనుసరించిన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరినే అవలంబిస్తున్నారు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ రాజకీయ తీర్మానానికి వి రుద్ధంగా కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు ఏర్పరచుకోవడం ఏచూరి ప్రభావంతోనే అన్నది బహిరంగ రహస్యం. ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆమోదించిన రాజకీయ తీర్మానంలో- తమ పార్టీ పో రాటం ప్రధానంగా భాజపాకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ వ్యతిరేకతను పార్టీ కొన సాగిస్తున్నది. కాంగ్రెస్‌తో ఎటువంటి అవగాహన గాని లేదా పొత్తు గాని ఉండదని ఆ తీర్మానం స్పష్టం చేసింది. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్‌కు వదులుకోవలసి రావడమే కాక, క్రమంగా భాజపా బలం పుంజుకొంటూ, సీపీఎం నాలుగో స్థానానికి దిగిపోవలసి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధం ఉండరాదని మరోసారి 2018లో సీపీఎం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌లో సీట్ల సర్దుబాటు గురించి సీపీఎం నేతలు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఒక అవగాహనకు రాలేక పోవడం మరో విషయం. బెంగాల్‌లో పరస్పరం పోటీకి దిగకూడదని అనుకున్నప్పటికీ కాంగ్రెస్ మొండి వైఖరి వల్ల అవగాహనకు రాలేకపోయామని ఏచూరి పేర్కొనడం గమనార్హం.
కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోలేక పోయినా సైద్ధాంతికంగా తమకు విభేదాలు లేవనే సంకేతం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కేరళలో రాహుల్ పోటీకి దిగడంతో సీపీఎం నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సయోధ్య జరుపుతూ, కేరళలో మాత్రం ప్రధాన ప్రత్యర్థులుగా పోరుకు దిగడం సీపీఎంలో నెలకొన్న అవకాశవాద ధోరణులను వెల్లడి చేస్తోంది. కేరళలో మొదటి నుండి సీపీఎం కాంగ్రెస్ తో ఎటువంటి అవగాహనను జాతీయ స్థాయిలో గాని, రాష్ట్రాలలో గాని కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తోంది.
2004లో దేశమంతా ప్రతిపక్ష పార్టీలు భాజపాను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేరళలో సీపీఎం మాత్రం కాంగ్రెస్‌ను గల్లంతు చేసేందుకు ప్రయత్నించి, 20 ఎంపీ సీట్లలో 18 సీట్లను గెల్చుకుంది. అయితే, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటుకు వామపక్షాలు బయటినుండి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కేరళ నుండి రాహుల్ పోటీ చేయడం- తమపై కాంగ్రెస్ దాడి చేయడంగా సీపీఎం భావిస్తున్నది. కేరళలో వామపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి ఇది కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగా భావిస్తున్నది. సుదీర్ఘకాలం బెంగాల్ రాజకీయాలను శాసించిన సీపీఎం ఇప్పుడు ఆ రాష్ట్రంలో అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. గత లోక్‌సభ ఎన్నికలలో 42 స్థానాల్లో 2 స్థానాలను మాత్రమే గెల్చుకోంది. అంతకుముందు 25 ఏళ్లకు పైగా సగటున 31 సీట్లను వామపక్షాలు గెలిచేవి. ఇప్పుడు కేరళలో మాత్రమే సీపీఎం అధికారంలో ఉంది. శబరిమల ఉదంతం తర్వాత భాజపా బలం పెరగడంతో ఆ ప్రభావం సీపీఎం పై పడుతోంది.
కేరళలో సీపీఎంను హిందువుల పార్టీగా భావిస్తూ ఉంటారు. కాంగ్రెస్‌ను 46 శాతంగా ఉన్న క్రైస్తవులు, ముస్లింలు మద్దతు ఇచ్చే మైనారిటీల పార్టీగా భావి స్తుంటారు. భాజపా బలం ఎంతగా పెరిగితే ఆ మేరకు సీపీఎం బలం తగ్గిపోతూ ఉంటుంది. శబరిమల అనంత పరిణామాలలో సీపీఎం బలహీనం కావడం, భాజపా బలం పుంజుకోవడంతో 20 సీట్లలో 18 సీట్ల వరకు తాము గెలుచుకుంటామని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో రాహుల్ పోటీ చేయడం మొత్తం రాష్ట్రంపై ప్రభావం చూపి, వామపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితులు ఏర్పడగలవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ త్రివేణి సంగమం వంటిదని, ఆ పోటీ ప్రభావం కేరళతో పాటు కర్ణాటక, తమిళ నాడులపై కూడా పడుతుందని మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేరళలో ఒక్క లోక్‌సభ సీటు కూడా గెల్చుకోలేని భాజపా శబరిమల ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు కనీసం నాలుగు సీట్లను గెల్చుకుంటామనే ధీమాతో ఉంది. రాహుల్ పోటీ చేయడంతో కేరళలో భాజపా అకౌంట్ ఓపెన్ కాకుండా చేయడమే తమ లక్ష్యమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొనడం గమనార్హం. భాజపా ఉనికి పట్ల కాంగ్రెస్ ఒకింత ఆందోళనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వయనాడ్‌ను రాహుల్ ఎంచుకోవడం ఉద్దేశ పూ ర్వకంగానే జరిగిందని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం యథాలాపంగా ఎంచుకున్నట్లు చెబుతున్నాయి. 2009లో వయనాడ్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుండి రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏంఐ షానవాజ్ గెలుస్తూ వచ్చారు. గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ప్రస్తుతం ఖాళీగా అంది. కాంగ్రెస్‌కు బలమైన మిగిలిన సీట్లలో సిట్టింగ్ అభ్యర్థులను కాదని పోటీ చేయడం ఎందుకని, ఖాళీగా ఉన్న ఈ సీటును రాహుల్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. రాహుల్ ఇక్కడి నుండి పోటీ చేయడం ఒక విధంగా ప్రకాష్ కారత్‌కు సంతోషం కలిగించినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌తో చెలిమిని తొలి నుండి వ్యతిరేకిస్తున్న ఆయన రాహుల్ ఇక్కడ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకోగానే ఓడించేస్తాం అంటూ ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అటువంటి ప్రకటన చేశారు.
అయితే, ఇదే సమయంలో అమేథీలో ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్న అడిగితే సీతారాం ఏచూరి కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపిస్తున్నది. భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేసే బలమైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్నది తమ విధానం అని చెప్పడం ద్వారా అక్కడ రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నుండి పోటీ చేస్తుంటే, ఒక చోట (అమేథీలో) ఆయనకు మద్దతు ఇస్తూ, మరో చోట (వాయనాడ్) ఓడిస్తామనడం సీపీఎం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
రాహుల్ గాంధీని ‘అమూల్ బాయ్’ అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యానాన్ని మరోసారి గుర్తు చేస్తుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచుతానందం మరో సైద్ధాంతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. వామపక్షాలు భాజపాకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు లోపాయికారి మద్దతు ఇవ్వడాన్ని తొలినుండి వ్యతిరేకిస్తున్న ఆయన తాము ఆ రెండు పార్టీలపై పోరాడవలసి ఉన్నదని హితవు చెప్పారు. ‘బిజెపి మా ప్రధాన శత్రవు’ అన్న వాదన రాహుల్ పోటీతో తప్పని నిరూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందాలని సీపీఎం, భాజపా వేసుకున్న అంచనాలను రాహుల్ పోటీ వల్ల పటాపంచలం కాగల అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో జాతీయ పార్టీగా తాము గుర్తింపు పోగొట్టుకో వలసి వస్తుందనే ఆందోళన సీపీఎంలో వ్యక్తం అవుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఆ పార్టీ కనీసం మూడు రాష్ట్రాల నుండి 11 లోక్ సభ సీట్లను గెలుపొందాలి లేదా కనీసం నాలుగు రాష్ట్రాలలో నాలుగు లోక్ సభ స్థానాలను గెల్చుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాలలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొందవలసి ఉంది. ప్రస్తుతం సీపీఎం పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలకు పరిమితమైన పార్టీ. 2014లో కేవలం 9 ఎంపీ సీట్లను గెల్చుకోంది. 3.25 శాతం ఓట్లు పొందింది. ఇప్పుడు కూడా ఈ మూడు రాష్ట్రాలు తప్ప ఎక్కడా ఆ పార్టీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. త్రిపుర, బెంగాల్ లో ఆ పార్టీ పరిస్థితి డోలాయమానంగా ఉంది. కేరళలో కూడా పట్టు కోల్పోతే జాతీయ పార్టీగా గుర్తింపు కోల్పోక తప్పదు.
రాహుల్‌ను ఓడించడానికి భాజపా నేతలు ప్రయోగిస్తున్న పదజాలాన్ని కేరళలో వామపక్ష నేతలు సైతం ప్రయోగిస్తుండడం గమనార్హం. వామపక్షాల తరపున రాహుల్‌కు వ్యతిరేకంగా సీపీఐ నుంచి పోటీ చేస్తున్న పి.సునీర్ బలమైన అభ్యర్థి కాకపోయినా, ఎన్నికల ప్రచారం మొత్తాన్ని ఇప్పుడు సీపీఎం తన భుజస్కందాలపై వేసుకొంది. ఆ పార్టీ అగ్రనాయకులు ఏచూరి, ప్రకాష్ కారత్, బృందా కారత్, రామచందన్ పిళ్ళై వంటి వారంతా ప్రచారం చేయనున్నారు. సీపీఎం నేతలు, వారి ప్రచార సాధనాలు రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయి. ఈ తరహా ప్రచారం కేరళలో సీపీఎం పట్టు కోల్పోతోందన్న ఆందోళనతోనే అని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలకు వామపక్షాలు దిగుతున్నా, తాను మాత్రం వారిపై ఒక్క మా ట కూడా మాట్లాడబోనని రాహుల్ చెప్పడం గమనార్హం.

-చలసాని నరేంద్ర 98495 69050