మెయన్ ఫీచర్

యుద్ధం.. అంతర్యుద్ధం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్‌లమధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం జరుగుతుందేమోనని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.. కశ్మీర్‌లోయలో అప్పుడే వదంతులు- పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనూహ్యంగా వంద కంపెనీల పారామిలటరీ బలగాలు అక్కడికి చేరుకోవడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న భావన చాలామందిలో కలుగుతోంది. దాంతో అక్కడి ప్రజలు నిత్యావసర సరకులను ఎక్కువ మోతాదులో కొనుగోల చేసి నిల్వ చేసుకుంటున్నారు. పెట్రోలు, డీజిల్‌ను సైతం నిల్వచేస్తున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుల్వామా దాడిని ఖండిస్తూ ఇరుదేశాలమధ్య ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. జమ్మూ-కాశ్మీర్‌లో చాలామంది వేర్పాటువాదులను అరెస్టు చేశారు. అవసరమైనప్పుడు ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నారు. ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండగా, యుద్ధమేఘాలు ఆవరిస్తున్న సమయంలో విజ్ఞులు కొందరు యుద్ధం అనర్థదాయకమని వాస్తవికాంశాన్ని గుర్తుచేస్తున్నారు. పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు అనేక మార్గాలున్నాయని చెబుతున్నారు. యుద్ధం ఎప్పుడైనా అనర్థాలకు దారితీస్తుందని, అమాయక ప్రజల ఆశలు చిదిమివేయబడతాయని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అంటున్నారు. ఇలాంటి అభిప్రాయాలపై మనసు పెట్టాల్సిన సందర్భమిది. ముఖ్యంగా ఉభయదేశాల వద్ద అణ్వాయుధాలున్నప్పుడు ఈ అభిప్రాయానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. కొందరికి ఈ వాదన నచ్చకపోవచ్చు. ఇది పిరికిపంద వ్యవహారంగా భావించవచ్చు. కాని వాస్తవిక దృష్టితో పరిశీలించాల్సిన అవసరం మాత్రం ఎప్పుడూ ఉంటుంది.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ నిర్వహించిన ‘ప్రపంచ వాణిజ్య సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధిలో పోటీపడుతుందని, అపనమ్మకాలను తొలగించి ప్రగతిని సాధించామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని కూడా అన్నారు. అసాధ్యమైనదేదీ ఉండదని, అన్నీ సాధ్యమేనని తనదైన శైలిలో ఆయన ప్రకటించారు.
ఒకవేళ యుద్ధమే వస్తే ఈ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. పోటీతత్వం మందగిస్తుంది. ప్రజల్లో నైరాశ్యం ఆవహిస్తుంది. వౌలిక రంగాల్లో అనేక అడ్డంకులు ఏర్పడతాయి. వర్తమానంలో చైతన్యం పెరిగింది. అవగాహన హెచ్చింది. పర్యవసానంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. ఈ ప్రయాణం దారితప్పరాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
పొరుగు దేశంతో యుద్ధమేగాక, దేశంలో అంతర్యుద్ధం పెరిగినా ఇలాంటి పర్యవసానాలనే ఎదుర్కోవలసి వస్తుంది. యుద్ధం ఎంత అనర్థదాయకమో అంతర్యుద్ధం సైతం అంతే అనర్థదాయకం. ఈ మెలకువతో ఆలోచించినప్పుడే అభివృద్ధికి సరైన బాటలు పడతాయి.
విచిత్రమేమిటంటే మావోయిస్టులు ఈ సూక్ష్మ విషయాన్ని గ్రహించకుండా అంతర్యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. పౌరులు యుద్ధం విషయంలో ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తారో అంతర్యుద్ధం పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ఈ అంతర్యుద్ధంలో అనేక వనరులు ధ్వంసమవుతున్నాయి. పదుల సంఖ్యలో జవాన్లు కన్నుమూస్తున్నారు. అపారమైన ఆర్థిక భారం ప్రజలపై పడుతోంది. లక్షలకుపైగా పారామిలటరీ బలగాలు దండకారణ్యంలో మావోల దాడులను ఎదుర్కోవడానికి మోహరించడమంటే ఏ మేరకు మానవ వనరులు నిర్వీర్యమవుతున్నాయో అంచనా కట్టవచ్చు.
ఉగ్రవాదులు పారామిలటరీ బలగాలను హతమారుస్తున్నట్టుగానే మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకుంటున్నారు. కొండొకచో వారికన్నా ఎక్కువ సంఖ్యలో మట్టుబెడుతున్నారు. నిరంతరంగా అనేక రాష్ట్రాల్లో అజ్ఞాతంగా ఉంటూ అంతర్యుద్ధం కొనసాగిస్తున్నారు. సంవత్సరానికి కోట్లాది రూపాయలు బూడిదలో పోస్తున్నారు. ఆయుధాలపై ఖర్చు చేస్తూ ఉద్రిక్త పరిస్థితుల్ని నెలకొల్పుతున్నారు. ఈ వైఖరి ప్రజలకు ఏవిధంగా ఉపకరించడం లేదు. వారి ఆర్థిక ప్రగతికి దోహదపడటంలేదు. మరెందుకీ అంతర్యుద్ధం?
21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం బలపడుతున్న సందర్భంలో సమస్యల పరిష్కారానికి మార్గాలు మరోలా ఉన్నాయన్న విషయాన్ని విస్మరించి అంతర్యుద్ధం బాట పడితే అదెలా ఆమోదయోగ్యమవుతుంది?
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్‌నార్- లక్‌పాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున మందుపాతరలు అమర్చారు. ఈ ఐఈడి పదార్థాలు ఎంతో ప్రమాదకమైనవి. అదృష్టవశాత్తు వీటిని ముందుగానే కనుగొని నిర్వీర్యం చేశారు. లేకపోతే భద్రతా బలగాలకు భారీ నష్టం జరిగేది. గతంలో మందుపాతరలు పేలి పదుల సంఖ్యలో జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. మందుపాతరలకు తట్టుకుని ప్రయాణించే వాహనాలను సైతం ఛిద్రం చేసేట్టుగా భారీ ఐఈడీ సామగ్రిని మావోలు ఉపయోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పద్ధతిని ఇంకా కొనసాగిస్తూ అంతర్యుద్ధాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల డంప్‌ను చత్తీస్‌గఢ్‌లోనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా ప్రమాదకరమైన పేలుడు సామగ్రి, ఆయుధాలు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఇలా మందుపాతరలు, మర తుపాకులు, తూటాలు, గ్రెనేడ్లు నిత్యావసర సరకుల్లా పోగేస్తూ పోతే అంతిమంగా అదెక్కడికి దారితీస్తుంది? సహజంగానే అనర్థానికి దారితీస్తుంది. అభివృద్ధికి ఆటంకాలను సృష్టిస్తుంది. అనుదుత్పాదకతకు దారితీస్త్తుంది. దేశ ప్రజల అవసరాలు తీర్చడం ఆలస్యమవుతుంది. ఇది స్పష్టాతి స్పష్టంగా తేటతెల్లమవుతున్న అంశం. దీన్ని పట్టించుకోకుండా అంతర్యుద్ధానికి కాలు దువ్వితే ఎలా?
మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో ఇటీవల ఇన్‌ఫార్మర్లు అన్న నెపంతో ఐదుగురు ఆదివాసీలను మావోయిస్టులు చంపేశారు. బామ్రాగఢ్ గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించారన్న కోపంతో ప్రతీకార చర్యగా ఈ ఆదివాసీలను హత్యచేశారు. ఇలా దేశంలో వందలాది మంది అమాయకులను ఇన్‌ఫార్మర్ల పేర మావోయిస్టులు ‘ఖతం’ చేశారు. ఈ రకమైన విధానం ఎవరికి శోభనిస్తోంది? అంతిమంగా అమాయక-సాధారణ ప్రజల జీవనం మెరుగుపడాలని తాపత్రయపడేవాళ్ళు ఇలా ఆ ప్రజలనే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తే ఏమిటి అర్థం? మావోయిస్టు పార్టీకి చెందిన జిల్లా -రాష్ట్ర - కేంద్ర స్థాయి నాయకులు అరెస్టు అవుతున్నారు, లొంగిపోతున్నారు. వారివల్ల పార్టీకి జరగని నష్టం, వారిచ్చిన సమాచారం కన్నా ప్రమాదకర సమాచారం ఈ ఇన్‌ఫార్మర్లు ఇచ్చారా? ఇస్తున్నారా? వారికి మావోయిస్టులకు చెందిన సమాచారం తెలిసే అవకాశాలు మృగ్యం. అయినా వారు అసువులు బాస్తున్నారు. ఈ రకమైన యుద్ధ వాతావరణాన్ని మావోయిస్టులు అనేక రాష్ట్రాల్లో సృష్టిస్తున్నారు. ఇది ఏ రకంగా అభిలషణీయం? యుద్ధంకన్నా అంతర్యుద్ధం అత్యంత ప్రమాదకరం. ఈ విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గతంలో మావోయిస్టుల నుద్దేశించి అన్నారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని ఆయన ఆ రోజుల్లోనే గట్టిగా చెప్పారు. ఈ దశాబ్దం, దశాబ్దంన్నర కాలంలో ప్రపంచం ఎంతో మారింది. మావోల ఊహకు అందనంతగా ఆర్థిక ప్రగతి చోటుచేసుకుంది. ఆధునిక టెక్నాలజీ పల్లె పల్లెకు పాకుతోంది. దాంతో పౌరులు సాధికారతతో జీవించే అవకాశాలు మెరుగయ్యాయి. మరి ఈ నేపథ్యంలో సాయుధ పోరాటం కొనసాగింపు ఆహ్వానించదగ్గదా?.. భరతవాక్యం పలకడం మంచిదా?..
కొసమెరుపు: జార్ఖండ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (మావోయిస్టులు) గెరిల్లాలు ఇటీవల మరణించారు.

- వుప్పల నరసింహం.. 9985781799