మెయన్ ఫీచర్

పొద్దుతిరుగుడు పువ్వుల పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో నైతిక విలువలు నేతిబీర చందం. రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని, తాము విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నామని, అసలు తామొక్కరే నైతిక మడి కట్టుకున్నామని ఎవరైనా చెబితే, సదరు నైతికమూర్తుల వ్యక్తిత్వాన్ని నిలువునా శంకించాల్సిన రోజులివి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈమధ్య ఫిరాయింపు రాజకీయాలపై వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారాయని మహా ఆవేదన చెందారు. కానీ, ఈ రాష్ట్రంలో అలాంటి పవిత్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తన పార్టీ అన్న విషయం ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యం.
జానారెడ్డి వ్యక్తిగా రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూఉండవచ్చు. ఆయన పూర్వాశ్రమంలో పార్టీ మారే ముందు రాజీనామా చేసి, చేరి ఉండవచ్చు. అందుకే ఇనే్నళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సమైక్యాంధ్ర చివరిరోజుల్లో జానారెడ్డికి సీఎం ఆఫర్ వచ్చినమాట నిజం. కానీ తాను ఆ పదవి తీసుకుంటే, తెలంగాణ ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు తనను నాయకత్వం పావుగా వినియోగించుకుందన్న అపప్రధ ఎదుర్కోవలసి వస్తుందని ఆయన వెనుకంజవేశారు. ఇది కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజం.
తెలంగాణ ఉద్యమంలో జానారెడ్డి ముందుండి పాల్గొనలేకపోయినా దానికి దన్నుగా నిలిచారు. కేసీఆర్‌తో కలసి జాక్‌ను పుట్టించింది ఆయనే. అసలు అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ల విభీషణ పాత్ర లేకపోతే, కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచేవారు కాదు. ఢిల్లీ మనోగతాన్ని కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వేగుల రూపంలో చెవిలో వేసిందీ కాంగ్రెస్ పెద్దలే. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పింది నమ్మి, కేసీఆర్ తమ చేతుల్లో ఉన్నారని ఢిల్లీకి చూపి, సొంత ఉనికి కాపాడుకునేందుకూ కొందరు కాంగ్రెస్ పెద్దలు పథకం వేశారు. కాకపోతే అతనికంటే ఘను డు ఆచంటమల్లన్న అన్నట్లు.. కేసీఆర్ వీరందరికంటే నాలుగాకులు ఎక్కువే చదవడంతో కథ అడ్డం తిరిగింది. అది వేరే విషయం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామ్యమని జానారెడ్డి వాపోవడం చూస్తే, ఆయన ఇంకా సత్తెకాలంలోనే పరిభ్రమిస్తున్నారేమోననిపిస్తోంది. రాజకీయాల్లో నైతికవిలువలకు నీళ్లొదిలి చాలాకాలమే అయింది. అంతెందుకు? వైఎస్ హయాంలో ఇదే తెరాస ఎమ్మెల్యేలను చీల్చినప్పుడు, మంత్రిగా ఉన్న జానారెడ్డి అప్పుడు ఇదే మాట చెబితే బాగుండేది. కేసీఆర్ కూడా అదే అడుగుతున్నారు మరి! ఒక్కొక్కరికీ ఒక బలహీనత ఉంటుంది. కొందరు మనీకి, మరికొందరు మగువకు, ఇంకొందరు మందుకు, మరికొందరు పొగడ్తలకు పడిపోతుంటారు.
కేసీఆర్ ఈ విషయంలో మొదటి లైనులో వెళ్లారు. దాన్ని తప్పుపడితే, అంతకుముందు జరిగిన ఫిరాయింపులనూ తప్పని ఒప్పుకోవలసిందే. ఇందులో న్యాయాన్యాయాలకు తావులేదు. అయితే, తాను రాజకీయంగా పెంచి పెద్దచేసిన ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కారెక్కడమే జానారెడ్డిని బాధించిందట. మోసం చేసే వారిది తప్పు కాదు. మోసపోయేవాళ్లదే తప్పు. ఆ సూత్రం పెద్దాయనకూ వర్తిస్తుంది.
తెలంగాణలో ఫిరాయించని ఎమ్మెల్యేలను అభినందించాల్సిందే. ఇంత ఒత్తిళ్లలోనూ లొంగని వారి నైజానికి సలాము చేయాల్సిందే. తెలుగుదేశం, కాంగ్రెస్‌ను అటుంచితే, నైతిక విలువల ఎర్రబట్టలు వేసుకునే సీపీఐ ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ ఆకర్షించారంటే, సీపీఐ బుడగ కూడా పేలిపోయేదేనని తేలిపోయింది. దీనిపై కేసీఆర్ సూత్రీకరణ వింతగానూ ఉంది.
అప్పుడే కళ్లు తెరిచిన తన పసిగుడ్డు ప్రభుత్వాన్ని కాటేయడానికి కాంగ్రెస్-టిడిపి కాచుకుందని ఒవైసీ సాబ్ ఆయన చెవిలో చెప్పారట. ఆ కుట్రను తిప్పికొట్టడానికే తానా పనిచేశానని, కేసీఆర్ తన మనసులోమాట బయటపెట్టారు. దీనిని నిర్థారించవలసింది ఒవైసీ సాబ్ ఒక్కరే. అయినా కేసీఆర్ కత్తికి రెండువైపులా పదునే కదా?! అందుకే ఫిరాయింపులపై మిగిలిన వారిలా నీతిసూత్రాలు వల్లించకుండా ఒక్కముక్కలో తేల్చేశారు.
అటు నవ్యాంధ్రలో కూడా పొద్దు తిరుగుడు పువ్వులే పరిమళిస్తున్నాయి. 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలను బాబు దగ్గరుండి మరీ సైకిలెక్కించారు. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాలతాయి. అధికారం కూడా బెల్లం వంటిదే. అది తెలిసి కూడా నాయకత్వం భక్తకన్నప్పలను కోరుకోవడం అవివేకం. రాజకీయాల్లో నైతిక విలువలు పోతున్నాయని, రాజకీయాలు దిగజారిపోతున్నాయని, ఎటుపోతున్నామో అర్ధం కావడం లేదని నవ్యాంద్ర చంద్రుడు కొన్ని లక్షలసార్లు వాపోయారు. కానీ, అదే నీతిచంద్రుడు 20 మంది పరాయి పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు చెప్పిన లాజిక్కు మరీ చిత్రం! రాష్ట్భ్రావృద్ధి కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నది ఆయన లాజిక్. కాసేపు అదే నిజమనుకుందాం. మరి అదే సూత్రం పాటిస్తున్న తెలంగాణ చంద్రుడిని విమర్శించడంలో అర్ధం ఉందా? తాను చేస్తే సంసారం, ఇంకొకడు చేస్తే వ్యభిచారమన్న కేసీఆర్ వ్యాఖ్యను ఖండించకపోవడానికి కారణం ఏమిటి? తన పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఇనే్నళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడా తప్పు చేయలేదని, ఒక్క మచ్చ కూడా లేకుండా నీతిగా బతుకుతున్నానని, రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా? అని బాబుగారు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించిన సందర్భంలో వాపోయారు. తలసాని శ్రీనివాసయాదవ్ తెరాసలోకి వెళ్లిన తర్వాత సనత్‌నగర్‌కు వెళ్లిన బాబు, ఏం తమ్ముళ్లూ మీరు చెప్పండి. మన దగ్గర మంత్రి చేసి, మన టికెట్‌తో ఎమ్మెల్యే అయిన వ్యక్తి సిగ్గులేకుండా ఆ పార్టీలోకి వెళ్లడం న్యాయమా? దీన్ని మీరు సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ ఫిరాయింపులపై రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సెలవిచ్చారు. విచిత్రంగా ఆ గంట తేడాలోనే బెజవాడలో వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాధ్‌రెడ్డి మెడలో బాబు పచ్చ కండువా వేశారు. అంటే తమ నాయకత్వం ఏపిలో చేసిందేమిటోమరి?! తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నదే ఏపిలో వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో బాబు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పవిత్రులు? ఎవరు అపవిత్రులు? అంతా ఒకే తాను ముక్కలయినప్పుడు ఇక నీతిముచ్చట్లు ఎందుకు?
ఎవరూ మెచ్చని ఇలాంటి మచ్చల ముచ్చట్లు ఎందుకు? పైగా వెనుకటికి ఓ వృద్ధ ఉత్తరకుమారుడు నేను లేస్తే మనిషిని కాదన్నట్లు.. మేము రాజీనామా చేసి గెలిస్తే, జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అన్న వెర్రి లాజిక్కు తెరపైకి తీసుకురావడం చూసేవారికి రోత.
ఫిరాయింపులపై జగన్ వేదన కొత్తకోయిల పల్లవిలా ఉంది. బోయవాడి వేటుకు గాయపడిన కోయిల మాదిరి మాట్లాడుతున్న జగన్‌సారు, తన తండ్రి జమానాలో జరిగిన ఫిరాయింపు కిరాకతాలను గుర్తుంచుకోకపోవడం విచిత్రం. సిగ్గులేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్న బాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆయనను చెప్పులు, చీపుర్లతో కొట్టాలని యువనేత పిలుపునిచ్చారు. మరి అదే పనిచేసిన దివంగత మహానేతకూ అప్పట్లో అదే పనిచేయాల్సిందని యువనేత అంగీకరిస్తారా? తెలంగాణలో తెరాస, ఏపిలో తెదేపా ఎమ్మెల్యేలను కొనేసిన దివంగత మహానేతను అప్పుడే నిలదీసి ఉంటే, జగన్‌కు ఇప్పుడు బాబును ప్రశ్నించే నైతిక అర్హత ఉండేది! జగన్ వరకూ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అది మెచ్చదగ్గదే. బాబు కూడా తనంత సాహసికుడు కావాలన్న జగన్ కోరికలో నిజం ఉండవచ్చు. కానీ జగన్ మాదిరిగా తాను కూడా సాహసికుడినన్న విషయం బాబుకు కదా స్ఫురించాల్సింది?! చివర్లో చిన్నమాట. బాబుకు అపూర్వ మిత్రుడయిన వెంకయ్య లేటుగా అయినా ఘాటుగా మాట్లాడారు. పార్టీ మారితే రాజీనామా చేయాలన్నారు. తొలి మహానాడులో అన్నగారు ఫిరాయింపులపై ఏకంగా ఇలాగే తీర్మానం చేశారు.
ఈ దేశంలో 67 కేసులున్న ఒక నిందితుడు ప్రభుత్వం కంటే ఎక్కువ. బెయిల్ రాక జైళ్లలో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిందితులు కూడా ఈ విషయంలో ఈర్ష్యపడాలి మరి! కేవలం వారం రోజుల్లో రైలు బోగీలు తగులబెట్టిన పది మంది ముద్దాయిలకు ఎంచక్కా సర్కారు వారి సౌజన్యంతో బెయిల్ వచ్చేసింది. మరో ముగ్గురికి రేపో, మాపో బెయిల్ వచ్చేస్తుంది. ఈ సూత్రం అందరికీ వస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. వాళ్లు ఫలానా కిర్లంపూడి కాపు సామ్రాజ్యాధినేత ముద్రగడ వెలిగించిన కులదీపాలయి ఉండాలి. ఈ లెక్కన ముద్రగడ ముందు ప్రభుత్వం మరగుజ్జు కిందే లెక్క. బెయిల్ ఇచ్చింది మాననీయ న్యాయస్థానమే అయినప్పటికీ, అది ఎలా వచ్చిందనేది మీరు అడక్కూడదు. వాళ్లు చెప్పకూడదు. అంతే!
సరే.. రేపు ఇంకో బీసీ నేతనో, ఎస్సీ నేతనో బస్సు తగులబెట్టిన తమ కులపోళ్లను జైలు నుంచి విడుదల చేయాలని ఇలాగే ఆమరణదీక్ష చేస్తే.. ఏలిన వారు, ఆ కులదీపాలనూ రాచమర్యాదలతో విడుదల చేస్తారా? అన్నదే ప్రశ్న. ఈ విధంగా కులానికొకరు దీక్షలు చేసుకుంటూ పోయి, దీక్షలు చేసిన వారిదే రాజ్యమయితే, ఇక నోరూ వారుూ లేని అమాయకుల సంగతేమిటి? ఇదేనా పాలకుల సమధర్మం? నిందితుల కులదైవాలు దీక్షలు చేస్తే ఎలాగూ బెయిల్ వస్తుంది కాబట్టి, రేపు ఏ బస్సో, రైలో తగులబెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు తరచూ ఒకమాట అంటుంటారు. మనం ఎక్కడికి పోతున్నామని! నిజమే. ఇప్పుడు నవ్యాంధ్ర కూడా అదే ప్రశ్న అడుగుతోంది. జవాబు చెప్పేదెవరు?

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144