మెయిన్ ఫీచర్

అమ్మకు ప్రేమతో... నేడు మాతృదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మ’ అనే తియ్యనైన పదానికి అర్థాలు, నిర్వచనాలు చెప్పాలనుకోవటం అర్థరహితమే అవుతుంది. పిల్లలకు బుడిబుడి అడుగులు వేయించటంతోనే తన బాధ్యత తీరిపోతుందని అనుకోదు. మనకు పాఠాలు చెప్పకముందే మన భావి జీవితానికి బంగారుబాట వేస్తుంది. బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు తననుతాను పవిత్రంగా మలుచుకుంటుంది. అందుకే భారతీయ సంస్కృతి తల్లికి అగ్రస్థానాన్ని ఇచ్చింది. యుగాలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించటం ఆమెకు మాత్రమే సాధ్యం. తల్లి ఒడినే బడిగా, గుడిగా చేసుకుని తొలి పాఠాలు నేర్చుకుంటారు. అందుకేనేమో పదిమంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం. వెయ్యిమంది తండ్రులు ఓ తల్లితో సమానమని మన పెద్దలు అంటారు. ఈ విధంగా ఆమె తొలి గురువైంది. ఆమె అందించే నిస్వార్థ ప్రేమే ఓ వ్యక్తిని సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలబెడుతుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా పేరుతెచ్చుకున్నవారంతా తల్లి ఒడిలో తొలి పాఠాలు నేర్చుకున్నవారే.. ఆ భగవంతుడు అన్నిచోట్లా తాను ఉండలేక అమ్మను సృష్టించాడేమో..

‘‘పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె ఒడిలోనే మొదలవుతుందని మన జన్మ’’.
భూప్రదక్షిణ షత్కేన కాశీయాత్ర యు తేనచ
స్నేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే
ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ వెళితే ఎంత ఫలమో, వందసార్లు సామేశ్వరంలో సేతు దర్శనం చేసి స్నానిస్తే ఎంత ధన్యత కల్గుతుందో- ఆ ఫలమంతా కలిసి ఒక్కసారి తల్లికి నమస్కరిస్తే కల్గుతుందట. అమ్మ అంటే నడుస్తున్న దైవం.. భూలోకంలో దేవుని ప్రతిరూపం అమ్మ. నిత్య స్మరణీయురాలు అమ్మ. ఆమె బాధ్యతల చిరునామా.
ఆధునిక వర్తమాన సామాజిక వ్యవస్థలో తల్లిపాత్ర చాలా ప్రధానమైనది. బిడ్డల పెంపకంలోను, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలోనూ ఆమె చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
అయితే నేటి సమాజంలో మహిళ ఇల్లాలుగానే కాక ఉద్యోగినిగా కూడా ద్విపాత్రాభినయం చేస్తుండడం గమనార్హం. కుటుంబానికి ఆమె సంపాదన చేదోడువాదోడుగా ఉంటున్నమాట నిజమే. కానీ ఆమెకు మాత్రం బాధ్యతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తల్లిగా బిడ్డని చంకనెత్తుకోవాల్సిన సమయంలోనే వారిని క్రష్‌లకప్పగించడం జరుగుతోంది. ఉద్యోగానంతరం ఇంటి బాధ్యతలూ ఆమెను సతమతమయ్యేలా చేస్తున్నాయి. అయితే ఆమె బాధ్యతలను భారమని తలవక యిష్టంగా భావించడంతో, ఒత్తిడిని అధిగమించి యింటినీ పిల్లలనూ చూసుకోగల్గుతోంది. సరియైన ప్రణాళిక ఆమె విజయానికి దోహదపడుతుంది.
సహజంగా పిల్లలు తండ్రివద్ద కన్నా తల్లివద్ద చనువుగా ప్రవర్తిస్తారు. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని తల్లితో షేర్ చేసుకుందుకు ఇష్టపడతారు. ఇక్కడే తల్లి పిల్లలతో స్నేహితుడుగా, మార్గదర్శిగా మెలగాలి. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా విని, వారు చేసే మంచి పనులకు వారిని ప్రశంసిస్తూ ప్రోత్సహించాలి. వారిలో ప్రవర్తనా లోపాలను గమనించి, సలహాలు, సూచనలు యిచ్చి వారిని సక్రమ మార్గంలో నడిపించడం ఆమెకు కత్తిమీద సామువంటిది. చిన్ననాటి ప్రవర్తనాలవాట్లు వారి భావి జీవన సౌధానికి మెట్లు అని గ్రహించి, తల్లి ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనను గమనించి వారిని సరియైన దిశలో నడిపించాలి. బిడ్డల కెదురయ్యే సమస్యల సాధనలో తల్లి, వారికి నావను ఒడ్డుకు చేర్చే తెడ్డులా ఉపయోగపడుతుంది. చెయ్యకూడని పనులు చేసిన దుర్యోధనుడు చివరికెలా పతనమయ్యాడో, సత్సాంగత్యం చేసిన అర్జునుడెలా విజయుడయ్యాడో సందర్భానుసారంగా ఇతిహాస గాథలు తెలియచెప్పాల్సిన అవసరం తల్లికి ఉంది. అసత్యమాడని హరిశ్చంద్రుడు, తల్లిదండ్రులపట్ల శ్రవణకుమారుని బాధ్యత, అహింసను బోధించిన గాంధీమార్గం, గౌతమబుద్ధుని బోధనల సారం, వివేకానంద, రామకృష్ణుల స్ఫూర్తిదాయక సందేశాలు వారికి చిన్ననాడే తెలియచెప్పాలి. పలు మత గ్రంథాల సారం తెలియజేస్తూ దేశ గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం రాని విధంగా పిల్లలను తర్చిదిద్దిగలిగేది తల్లి.
తన కొడుకును దొంగగానో, రేపిస్టుగానో ఏ తల్లీ చూడాలనుకోదు. మొక్క ఎదిగేందుకు అనుకూల పరిస్థితులు ఎంత అవసరమో, బిడ్డ ఎదిగేందుకు కూడా అనుకూల వాతావరణం కల్పించాలి.
చిన్నపాటి అసౌకర్యాలకే విసుగు, కోపం ప్రదర్శించడం, అనుకున్నది కాలేదనో, కోరిన ఉద్యోగం రాలేదనో ఆత్మహత్యలకు పాల్పడడం ఆధునిక జీవితంలో సహజ లక్షణంగా మారుతున్న క్రమంలో తల్లి మాత్రమే వారిని ఆ నైరాశ్యం నుంచి చైతన్యం వైపు కదల్చగలదు. బియ్యంలో రాళ్ళేరినట్టు వారిలోని చెడ్డ గుణాలు ఏరిపారవేయగలదు.
చిన్ననాటినుండే బిడ్డలకు మంచి ఆహారం అందించడం ఎంత అవసరమో మంచి విలువలు నేర్పడం కూడా ఆమె గురుతర బాధ్యత. తల్లినుంచే పిల్లలు ఓర్పు, నేర్పు నేర్చుకుంటారు. ఆమె నడవడిక, సమయపాలన వారికి క్రమశిక్షణ నేర్పుతుంది. నేటి వివాహ వ్యవస్థపై కూడా యువతకు సరియైన అవగాహన లేకపోవడంవల్ల నాడు విభేదాలు, విడాకులు ఎక్కువైపోయాయి. ఇక్కడ తల్లి వివాహ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాలి. వివాహానికి ముందుగానే జీవిత భాగస్వామితో ఏ విధంగా మసలుకోవాలో తెలియజేయాలి. సర్దుబాటు ధోరణితో సంస్కారాన్ని చక్కదిద్దుకొనే విధంగా వారిని తయారుచెయ్యాలి.
ఆధునిక సమాజంలో వస్తద్రారణ, అంతర్జాలం, మీడియా ప్రభావం యువతపై అధికంగా ఉంటుంది. బాల్యదశ దాటి కౌమారంలోకి అడుగిడుతున్నవారు ఈ ప్రభావాలకు లోనై చెడు మార్గాలననుసరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో వారితో స్నేహ పూర్వకంగా మెలగుతూనే వారికి సలహా రూపంలో వారు చేస్తున్న పనివల్ల ఎదుర్కోబోయే కష్టనష్టాలను తల్లి స్థానం మాత్రమే భర్తీ చేయగలదు.
పురుషుడు ఒక సమయంలో ఒక విషయంమీద మాత్రమే దృష్టి పెట్టగలడు. కానీ మహిళ మాత్రం ఒకేసారి గంపెడు బాధ్యతలు నెత్తిమీద పడినా బెదిరిపోదు. లక్ష్యాలు ఒకేసారి (రెండుకన్నా ఎక్కువున్నా) ఎన్నున్నా అంతిమంగా విజయం సాధించగలదు. ఎందుకంటే ఆమె ప్రతీ లక్ష్యంలోనూ మాతృత్వ అనుబంధం కల్గి వుంటుంది. కాబట్టే బహుళ బాధ్యతలున్నా ఆమెను బాధపెట్టలేవు. మరిన్ని బాధ్యతలకు కూడా ఆమె సిద్ధంగా ఉండి, మరింత శక్తిమంతురాలు కాగలదు.
వివాహంతోపాటే ఆమె బాధ్యతల చక్రభ్రమణంలో తిరుగాడుతూ వుంటుంది. నీటిలో కదిలే చేపలా బాధ్యతల సాగరాన్ని ఈదుతూనే వుంటుంది. ఆమె తాను బ్రతుకుతూ తన పిల్లల్ని బ్రతికించాలి. ఆమె పిల్లలతోడి తింటూ తినిపించాలి. వేటాడుతూ వేటాడ్డం నేర్పించాలి. పోరాడుతూ పోరాటం నేర్పించాలి. బ్రతకడం సులభమే.. బ్రతికించడం కష్టం.. బ్రతకడమెలాగో నేర్పించడం కష్టం. ఏ ప్రాణిలోనైనా ఈ బాధ్యత నిర్వర్తించేది తల్లి స్థానమే. ఏ పనైనా తల్లి వంద శాతం మనసు పెట్టి చేస్తుంది. ఇరవై నాల్గుగంటల్లో 48 గంటల పని చేయాలన్న తపన తల్లిది. ఆమె అలుపెరుగని శ్రమజీవి. నిరంతరం బిడ్డల క్షేమం కోరే ధన్యజీవి. బిడ్డల సంతోషమే తన సంతోషంగా భావించే ఆదర్శమూర్తి. ఆమె వందనీయురాలు. నిత్యస్మరణీయురాలు.

రెండేళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాలా 70 లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షలన్నమాట. కాని బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెలకట్టడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు.

ప్రేమమూర్తి సేవలకు వెలకట్టగలమా?

ఉద్యోగం చేసే అమ్మ విలువ, గృహిణిగా ఉండిపోవాలనుకునే అమ్మ విలువలో సగమే ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో లెక్క తేలింది. మరి పూట గడవటం కోసం కాకుండా కాలక్షేపం కోసం ఉద్యోగాలు చేస్తే ఆమె విలువ తరిగిపోతుందని అనడంలో ఆశ్చర్యమేముంది?

అమ్మే బిడ్డకు తొలి వైద్యురాలు సుమా! ఆమె స్పర్శే అన్ని మనోవ్యాధులకు మందులాంటిది. అంతేకాదు ఆమె బిడ్డను ముద్దాడినపుడు ఆ బిడ్డ శరీరంపై ఉండే సూక్ష్మక్రిములు అమ్మ శరీరంలోకి వెళతాయి. అపుడు ఆ శరీరం వాటికి వ్యతిరేకంగా పనిచేసే రోగ నిరోధక కణాల్ని తయారుచేస్తోంది. అవే అమ్మ పాల ద్వారా బిడ్డకు చేరి రక్షణ కవచంగా కాపాడతాయి.

అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో వుండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకూ, ఒత్తిడిని తట్టుకునే శక్తికీ ఆధారభూతమైంది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పదిశాతం పెద్దదిగా ఉన్నట్లు తేలింది.

అమ్మను ప్రేమించే వ్యక్తి స్ర్తిలందరినీ గౌరవిస్తాడు. ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవాభిమానాలు నానాటికీ తగ్గటానికీ అమ్మ ప్రేమకూ ఏదో సంబంధం ఉందనే అనిపిస్తోంది.

- చెళ్ళపిళ్ళ (కూరెళ్ళ) శ్యామల