మెయన్ ఫీచర్

యమునా తీరంలో విశ్వవిపంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమునా తీరంలో వేణుగానం వీనులవిందు చేసింది. అందరికీ ఆనందాల బృందావని నిలిపిన ఆ జగన్నాటక సూత్రధారి మళ్లీ దిగివచ్చి జనాన్ని ఓలలాడించాడా అన్న చందంగా మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ సంస్కృతీ సమ్మేళనం జరిగింది. ప్రపంచంలో 155 దేశాల్లో 37 కోట్లమంది ప్రజలకు వత్తిడిలేని, హింసకు తావివ్వని సంతోషమయ జీవితాన్ని అందించేందుకు 35 ఏళ్ల క్రితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆవిర్భవించింది. అంతేకాక గ్రామీణ పునర్నిర్మాణం, పర్యావరణం, విద్య, నదుల పునరుద్ధరణ, నీటి పొదుపు, ప్రమాదాల్లో సేవలు, స్ర్తిసాధికారత, నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి వివిధ రకాల ఆశయాలతో గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ దీన్ని ప్రారంభించారు. కళలు, క్రీడలు, ఆధ్యాత్మిక సభలు, వ్యాపార ఆర్థిక సమ్మేళనాలు, మేధావుల చర్చలు ప్రజలను కలిపివుంచే పరమోత్తమ ప్రక్రియలుగా శ్రీ రవిశంకర్ భావిస్తారు. అన్ని భేదభావాల కతీతంగా యివి ప్రజలను ఏకోన్ముఖలను చేస్తాయి. అందుకే ఈసారి కళల పేర యమునాతీరంలో జనం కలిశారు. ‘వసుధైవకుటుంబకమ్’ అనే నాదంతో కళాసరస్వతికి నీరాజనం చేశారు. సహజంగానే మీడియా అతిగా స్పందించింది. ఇంకేముంది, యమునాతీరం కాలుష్య కాసారమవుతున్నదని ప్రచారం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.5కోట్ల పరిహారం చెల్లించమని ఆదేశాలు జారీ చేసింది. ‘పైసా కూడా కట్ట ను.అవసరమైతే జైలుకైనా వెళతాను’’ అన్నారు రవిశంకర్. ‘తాము పర్యావరణానికి ఎటువంటి హానీ చేయలేదని, ఒక్క చెట్టును కొట్టలేదని, మనుషులు, జంతువులు సంచరించేందుకు సైతం వీలులేని దుర్గంధం వెదజల్లుతున్న యమున కాలుష్యాన్ని లక్ష కుటుంబాలనుంచి సేకరించిన ఎంజైములతో పరిష్కరించామని, దేశ,విదేశ ప్రముఖుల దృష్టి సైతం యమున ప్రక్షాళన వైపు మరల్చేందుకే ఈ సమ్మేళనం అక్కడ తలపెట్టామని , యిందుకు తమను అభినందించాలని’ అన్నారు. నిజానికి కార్యక్రమానికి ముందు తాము కొందరు పర్యావరణ వేత్తలను కూడా సంప్రదించామన్నారు. దేశ ప్రతిష్ఠతో ముడివడిన అంశాన్ని రాజకీయం చేయవద్దని, ఆస్ట్రేలియా, మెక్సికో లాంటి దేశాలు ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో నిర్వహించాలని అడిగాయని, యమునానది పునరుజ్జీవానికి తము కట్టుబడి ఉన్నామని, అందుకు తగిన ప్రణాళికను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ‘మెర్రీ ఢిల్లీ, మెర్రీ యమున’ (సంతోషకరమైన ఢిల్లీ, యమున) పేరున 2010లోనే శ్రీ రవిశంకర్ తమ అనుచరులతో యమునను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. 20,000 మంది పనిచేసి 512 టన్నుల పాత బట్టలను, ప్లాస్టిక్ చెత్తను తొలగించారు. వెయ్యిమంది ఆరోగ్య నడకలో పాల్గొన్నారు. ఆరు లక్షల మంది విద్యార్థులు, ‘నాకలల్లో సుందర ఢిల్లీ’ పేరున జరిగిన చిత్ర కళల పోటీల్లో పాల్గొన్నారు. ఇదే తీరులో 2014లో పంపానదిని శుభ్రం చేశారు. 30 లక్షల మందిని పంపానది శుభ్రత విషయమై చైతన్యవంతుల్ని చేశారు. అయ్యప్పను యాత్రికులు సందర్శించే 3,4 నెలల కాలంలోఐదు భాషల్లో ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. నిఘా ఉంచారు. అదేవిధంగా గంగ, కర్ణాటకలో వేదవతి, మహారాష్టల్రో బావర్జా, ఘర్ని, రీనా వంటి నదుల పక్షాళన, పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా అనేకానేక పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముందుంది. కేవలం నల్ల జెండాలో, ఎర్రజెండాలో పట్టుకొని ధర్నా చేయడం కాకుండా ఒక భిన్నమైన ఆచరణాత్మకమైన పద్ధతిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంచుకుంది. ఇంతటి నేపథ్యం, నైతిక బాధ్యత నెత్తికెత్తుకున్నారు కనుకనే శ్రీ రవిశంకర్ యమునా తీరంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాని మన మీడియాకు మంచి పనులు అర్థం కావు. వాళ్ల దృష్టిలో పర్యావరణ రక్షకులంటే, గ్రీన్‌పీస్, మేధాపాట్కర్‌లే. వందలకోట్ల విదేశీ నిధులతో, జిందాబాద్, ముర్దాబాద్ నినాదాలతో అభివృద్ధి పనులను అడ్డుకోవడమే.
ఆరు లక్షలమంది ప్రజల సమక్షంలో ఢిల్లీలో మార్చి 11న ప్రపంచ సంస్కృతీ సమ్మేళనం ప్రారంభమైంది. 8500 మంది వాద్యకళాకారులు, వెయ్యిమంది కథక్ నృత్యకళాకారులు కలిసి చేసిన వాదన, అభినయం అందర్నీ అబ్బుర పరచింది. స్వరంలో స్వరం కలపడం, అడుగులో అడుగు కలపడమే ఏకత్వానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ సమ్మేళనాన్ని ‘కళల కుంభమేళా’ అన్నారు మోదీ. తన మంగోలియా పర్యటనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబం తరపున విదేశీయులు తనకు స్వాగతం పలికారన్నారు. భిన్నభిన్నమైన కళారీతులు కలిగిన అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాల ప్రజలు యిందులో పాల్కొన్నారు. వేదిక మీదకు వివిధ దేశాధిపతులను ఆహ్వానం పలుకుతున్నప్పుడు ‘నాదస్వరం’ ఆలపించారు. ‘వెయ్యిమంది వేద పండితుల మంత్రఘోష అక్కడి వాతావరణాన్ని పునీతం చేసింది. కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు, మతపెద్దలు,రాజకీయ నాయకులు, శాంతి దూతలు, అంతా ఒక్కచోట చేరి మంచితనం, ఆనందం యొక్క శక్తిని ప్రదర్శించినట్లయింది’ అన్నారు ప్రపంచ సంస్కృతీ సమ్మేళనం అధ్యక్షులు శ్రీ సర్వోత్తమరావు. మొదటి రోజు వేదికపై జపాన్ ప్రధాని, భారత ప్రధాని, నేపాల్ ప్రధాని, శ్రీలంక స్పీకర్, రష్యా ఇతర దేశాలనుంచి వచ్చిన ప్రతినిధులు అసీనులయ్యారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఒక సంస్థ కంటె ఒక ఉద్యమం అనడం బాగుంటుందని, మానవ జీవితాన్ని అభివృద్ధి చేయగలగడమే మనందరి లక్ష్యమని, భక్తి, శక్తి, యుక్తి, ముక్తి వంటి వ్యక్తుల అంతర్నిహిత లక్షణాలను ఏకీకృతం చేసేందుకే ఈ సమ్మేళనమని’ అన్నారు శ్రీ రవిశంకర్. మనం సమాజానికి ఎంత ప్రేమనిస్తే, అందుకు వంద రెట్ల ప్రేమ మనకు తిరిగి లభిస్తుందని, ఇదే నిజమైన ఆధ్యాత్మికత అనీ, ప్రపంచంలో ఈ కెరటం పరివ్యాప్తం చెందాలని ఆయన ఆకాంక్షించారు. సమ్మేళనంలో అనేక మంది యువతీ యువకులు పాల్గొన్నారు. అంథ బాలలు కొందరు బీజాపూర్ నుంచి వచ్చారు. ప్రపంచంలో దేశాలమధ్య, సమాజాల మధ్య, సమూహాల మధ్య, సైద్ధాంతిక విభేదాలు, సంఘర్షణతో నిండిన నేటి వాతావరణంలో ఇలా అందర్నీ కలవడం, మూడు రోజులపాటు కలిపి ఉంచడం సామాన్యమైన విషయం కాదు. ప్రకృతిని, ప్రవృత్తిని, ప్రేమించి అందరిలో అదే జన్యులక్షణం ఉన్నదని భావించిన బృహత్తర ప్రజాసమూహమే ఈ సత్యాన్ని సాక్షాత్కరించగలుగుతుంది. 35 ఏళ్ల తమ సహజసిద్ధమైన సంస్థాగత పద్ధతి ద్వారా రవిశంకర్ దీన్ని సాకారం చేశారు. ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనానికి సిద్ధం చేసిన వేదికను 1200 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. నీటిపై తేలే 3 వంతెనలను భారత సైన్యం సిద్ధం చేసింది. విలయ సమయంలోనే కాదు ప్రజల సంబరాలు చేసుకునేందుకు కూడా సైన్యం సహకరిస్తుందన్న సంకేతం దీని ద్వారా అందింది. 161 దేశాల్లో 10 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చూశారని, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లమంది ఈ కార్యక్రమం చూశారని శ్రీ రవిశంకర్ అన్నారు. భూటాన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలనుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. సూఫీసంత్‌లు, పాకిస్తాన్ ఇమామ్‌లు, జైన గురువులు, అమెరికా నుంచి చర్చి ఫాదర్‌లు,కార్యక్రమానికి వచ్చారు. వందేళ్ల పైబడిన క్రైస్తవ మతగురువు ఈ కార్యక్రమానికి వచ్చారు. ‘కాళింది కాలుష్యాన్ని నివారించి యమునను శ్రీకృష్ణుడు పవిత్రం చేసినట్లు మనమంతా కలిసి యమునను ప్రక్షాళనం చేద్దాం’ అన్నారు గురుదేవులు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్, ఢిల్లీని మూడు రోజులపాటు విశ్వనగరంగా మార్చిన రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘హిందువు మంచి హిందువుగా, ముస్లిం మంచి ముస్లింగా, క్రైస్తవులు మంచి క్రైస్తవులుగా మెలిగి పరస్పరం గౌరవించుకోవాలన్న లౌకిక సిద్ధాంతాన్ని ఈ సభ చాటింది,’ అన్నారు. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా, వాటికన్‌కు చెందిన పోప్‌లు శాంతి సందేశం పంపారు. సిక్కు మతానికి చెందిన అకల్‌తక్త్ జతేదార్ గరుబచన్ సింగ్ ‘మన మనసులను జోడిస్తే పరమేశ్వరుడు మిగతావాటిని జోడిస్తాడు’ అన్నారు. ఆది చుంచనగరి పీఠాధిపతి, చిత్రకూట్ తులసీ పీఠాధిపతులు,జ్యోతిర్మయి పీఠాధిపతి, కర్ణాటకలోని వీరసింహాసన మఠం అధిపతి జగద్గురు దేశికేంద్ర మహాస్వామి, రిషికేష్‌కు చెందిన స్వతంత్రానంద మహరాజ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్మీర్ దర్గా ప్రతినిధులు కూడా వచ్చారు. సాంగ్ యూనిటీ పేరున మధ్యప్రాచ్యం నుండి వచ్చిన వేయిమంది సంగీతకారులు శ్రావ్యమైన సంగీతం ఆలపించారు. థాయిలాండ్, రష్యాలనుంచి వచ్చిన కళాకారులు వివిధ కళాప్రదర్శనలిచ్చారు. వివిధ భారతీయ జానపత నృత్య రీతుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాం, నాగాలాండ్ గవర్నర్లు హాజరయ్యారు. ఈ సమ్మేళనం సందర్భంగా సౌరవిద్యుత్‌కు మద్దతు లభించింది. ‘ప్రపంచంలో ఇంత పెద్ద సాంస్కృతికోత్సవం చూడలేదని’ ఐరోపా పార్లమెంట్ సభ్యులు జోరినెన్ అన్నారు. సరీనాం ప్రతినిధి అశ్విని భారత్‌ను పుణ్యభూమిగా వర్ణించారు. పోలెండ్, ఫ్రాన్స్ దేశాల నుంచి రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. యుఎఇ సాస్కృతిక శాఖ మంత్రి భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతమన్నారు. అర్జెంటీనా వారి సంగీత విభావరి చివరిలో సీతారాం శ్రీరాం జైరాం జైజై రాం అని ఆలపించారు. ‘‘ఈశావాస్య మిదం సర్వం’’ అన్న వేదోక్తి కనుగుణంగా ‘ఈశ్వర్ బసా సారా సంసార్’ అన్న పేరున శ్రీ రవిశంకర్ వ్రాసిన గీతాన్ని భారతీయ గాయకులు శ్రావ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ప్రకృతిని పరిరక్షిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సోదరులకు సన్మానం జరిగింది. గత జూన్‌లో క్యూబాలో శాంతికోసం కొలంబియా ప్రత్యర్థి వర్గంతో శ్రీశ్రీ రవిశంకర్ హవానాలో చర్చలు జరిపారు. తమ సాయుధ పోరాటానికి స్వస్తి పలికి శాంతి ప్రక్రియలో పాల్గొంటామని ప్రత్యర్థి నాయకత్వం తెలిపింది. భారతీయుల అహింసా పద్ధతిని, ప్రేమమయ స్ఫూర్తిని ప్రపంచం ఓ సందేశంగా స్వీకరిస్తుందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. విశ్వభారతి ఆవిష్కరణకు యిది శుభ సూచికం. కాలపరీక్షలకు, అనేక ఆటుపోట్లకు, ప్రళయ భయంకర దాడులకు, యుద్ధాలకు ఎదురొడ్డి నిలబడి వేల సంవత్సరాల జాతీయ జీవన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న భారత్ తప్పక ప్రపంచానికి సందేశం ఇవ్వగల స్థాయిలో ఉంది. ప్రపంచం కూడా నేడు భారత్ వైపు ఆశగా చూస్తోంది. అందుకు ప్రపంచ సంస్కృతీ సమ్మేళనం ఒక గొప్ప సందర్భమైంది. రాజకీయాలకతీతంగా, భాషాభేదాలకు, ప్రాంతీయ, దేశీయ అసమానతలకు అతీతంగా అందరూ కలిసి వచ్చారు. కాని ఒక్క కాంగ్రెస్ నాయకుడూ, మూడు రోజుల్లో ఎక్కడా కనిపించకపోవడమే కొసమెరుపు.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888