జనాంతికం - బుద్దా మురళి

పచ్చిపులుసు మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంత సీరియస్‌గా ఉన్నావ్ ఏం వండుతున్నావ్ ? ఐనా జరిగింది రాయాలి కానీ ఇలా వండి రాయండం ఏంటోయ్?’’
‘‘ ఇది అల్లాటప్పా వంట కాదు బాబాయ్ చూస్తూ ఉండూ. ఈ వంటతో ప్రభుత్వానికి దిమ్మతిరిగి పోతుంది’’
‘‘ ఏం నీ వంటలో అంత మసాలా ఉందా? ’’
‘‘ వంట అంటే అల్లాటప్పా వంట కాదు బాబాయ్.. పచ్చిపులుసు, పులావ్ పుంటికూర మహాకూటమి.. ఈ దెబ్బతో ప్రభుత్వం పని ఐపోయినట్టే’’
‘‘అదేదో జంద్యాల సినిమాలో శ్రీలక్ష్మి చిత్రమైన వంటలు వండి నట్టు నువ్వేమైనా కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేస్తున్నావా ? చక్కగా వార్తలు రాసుకోవలసినోడివీ స్టోరీలంటూ వంటలు వండి చివరకు వంటల్లోనే స్థిరపడిపోదామనుకుంటున్నావా? భానుమతి వంటలు కృష్ణకుమారి వంటలు అంటూ ఆనాటి మేటి హీరోయిన్ల పేరు మీద చాలానే వంటల పుస్తకాలు షాపుల్లో దొరుకుతున్నాయి. ఆయనెవరో 24 గంటల వంటల చానల్ మొదలు పెడితేనే చూసేవాళ్లు దిక్కులేదు. నీకెందుకోయ్ ఆ వంటలు వదిలేయ్’’
‘‘ బాబాయ్ నేను వండుతున్నది నిజమే.. కానీ అది తినే వార్త కాదు. వంట నిజమే కానీ అది చదివే వార్త కూడా కాదు. ’’
‘‘ వంట మొదలు పెట్టక ముందే కవిత్వం మొదలు పెట్టావంటే ఆ వంట తిన్నాక ఏమవుతుందో? ఏమైతే నాకేం కానీ ఉదయమే పిన్ని పులిహోరా చేసింది కడుపు నిండా తిన్నాను. పక్కింటి రెడ్డి గారు ప్రేమతో సర్వపిండి పంపించారు. అద్భుతంగా ఉందనుకో. మధ్యాహ్నం అంతా హోటల్‌కె ళుతున్నాం. మందుల కంపెనీల వాళ్లు ప్రాణాలు హరించే మందులను ప్రయోగించాలంటేనే ఎంతో మంది ముందుకు వస్తున్నారు. నీ వంట రుచి చూసేందుకు ఆ మాత్రం సాహసం చేయరా? చాలా మంది వస్తారు. భయపడకు. పది మంది పేషంట్లు పోతే కానీ ఒక డాక్టర్ తయారు కాడు. అధైర్యం వద్దు నువ్వు ధైర్యంగా ఉండు.. నేను వెళ్లిపోతున్నాను’’
‘‘ అదేదో పార్టీ నాయకుడిలా అలా వన్‌సైడ్‌గా మాట్లాడడమేనా? ఎదుటి వాళ్లు చెప్పేది వినిపించుకోవా? బాబాయ్.. నేను వండేది వంట కాదని చెప్పాను, మరేంటి అని అడగవా? ’’
‘‘ వంట కాదా? నిజమా? అయితే ఏదైనా పరవాలేదు చెప్పు వింటాను. పెద్దగా పని కూడా ఏమీ లేదు. ’’
‘‘ బాబాయ్ రాష్ట్రంలో ఎంత మంది జనం ఉన్నారు. వీరిలో పచ్చిపులుసు అంటే ఇష్టపడే వాళ్లు ఎంత మంది. బిర్యానీ తినేవాళ్లు, పులావ్ తినే వాళ్లు, నాన్‌వెజ్‌లో పుంటికూర ఇష్టపడే వాళ్లు, వెజ్‌లో టమాట అంటే పడి చచ్చేవాళ్లు ఎంత మంది? చింతకాయ తొక్కును ఇష్టపడే వాళ్లు, అవకాయ లేనిదే ముద్ద దిగదనే వాళ్లెంత మంది వీళ్లెంత మంది అన్ని లెక్కలు నా దగ్గరున్నాయి’’
‘‘ఏరా కర్రీ పాయింట్ ఏమైనా మొదలెట్టదలిచావా? ఏంటోరా బాబూ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ వ్యాపారంలో ఎవరు వందల కోట్లు సంపాదిస్తారో అర్థం కావడం లేదు. మనం ఎర్రబస్సు అని తేలిగ్గా అనేస్తాం కదా? అదే పేరుతో నిజామాబాద్ కుర్రాళ్లు రెడ్ బస్ అంటూ ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు బుక్ చేసుకునే వ్యాపారం మొదలు పెట్టి వందల కోట్లకు అమ్ముకున్నారట! నీ ఐడియా బాగుందిరా! ఏమో దశ తిరిగి నీ కర్రీ పాయింట్ వ్యాపారం వందల కోట్లకు అమ్ముడు పోవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కెసిఆర్ కర్రిపాయింట్ పెట్టుకో ఎవరొద్దన్నారు అంటే చాలా మంది ముఖ్యమంత్రిని అంతేసి మాటలు అంటారా? అని విరుచుకుపడ్డారు గుర్తుందా? ఆ మరుసటి రోజు కెసిఆర్ అసలు విషయం చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పటికే బెంగళూరులో క్రరీ పాయింట్ వ్యాపారం ఉందట! సిఎంగా ఉంటూ కర్రీ వ్యాపారం కొనసాగించారంటే ఏరా నిజంగా ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటుందా? ’’
‘‘ నేనేదో చెప్పాలనుకుంటాను. నువ్వు కనీసం వినకుండా ఉపన్యాసం ఇచ్చేస్తుంటావు. నేను చెప్పేది విను బాబాయ్... నేను చెబుతున్న వంటకాల్లో బ్రహ్మాండమైన రాజకీయం ఉంది? ’’
‘‘ సరే చెప్పు ’’
‘‘ రాష్ట్రంలోని ప్రజలందరి తిండిపై నా దగ్గర సమగ్ర సర్వే ఉంది. పచ్చిపులుసు, అవకాయ, బిర్యానీ, పుంటికూర, పెద్ద కూర మహాకూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని దించేస్తా’’
‘‘ 2009లో వైఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా ఇలాంటిదే ఏదో మహాకూటమి ఏర్పాటు చేశారు కదా? ’’
‘‘ అది రాజకీయ పార్టీల మహాకూటమి బాబాయ్ ఇది అలాంటిది కాదు. ఇది పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ఆహార అలవాట్ల ఆధారంగా ఏర్పడే మహాకూటమి’’
‘‘ అంటే ఏం చేస్తావురా?’’
‘‘ రాష్ట్రంలో భారీగా పెద్ద కూర ఉత్సవాలు నిర్వహిస్తామని ఒక గ్రూపువస్తుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇది పెద్ద కూర ప్రభుత్వం అని పప్పు కూర గ్రూపుతో ఆందోళన చేయిస్తాం. ప్రభుత్వం పచ్చిపులుసు గ్రూపుపై ప్రేమతో పెద్దకూర, పప్పు కూర వర్గాలను వేధిస్తోందని తటస్థంగా ఉండే బిర్యానీ వర్గం ర్యాలీలు తీస్తుంది. ప్రజలకు తమకిష్టమైన వంటకం వండుకునే హక్కు లేదా? అని మనిషి మెదడును ఇష్టంగా తినే గ్రూపుతో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక, ఎవరిని వ్యతిరేకించాలో తెలియక అధికార పక్షం జుట్టు పీక్కుంటుంది. తలనొప్పితో అధికార పక్షం కాఫీ తాగితే టీ వర్గంతో ఆందోళన చేయిస్తాం, టీ తాగితే కాఫీపై చిన్నచూపు అంటూ రోడ్లపై బైటాయిస్తాం. పాలు తాగితే, పిల్లలకు పాలు కూడా దక్కకుండా చేస్తున్నారని పిల్లలతో ధర్నాలు చేస్తాం. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. ఎన్నికల నాటికి పచ్చిపులుసు పులావ్ పుంటికూర మహాకూటమి ఏర్పడి అధికారంలోకి వస్తుంది. ’’
‘‘ ఎలా ఉంది బాబాయ్ మన రాజకీయ వంటకం’’
‘‘ఏరా పోలీసులు బాగా కొట్టారా? ఏదో వండారని లోపలేశారు. ఇంతకూ మీకు లోపల ఏ కూర వడ్డించారు? ’’
‘‘చదువుకోరా అంటే ఈ వంటకాలేంటిరా అని కుళ్ల బొడిచారు. పచ్చిపులుసు కోసం చింతపండును పిండినట్టు పిండేశారు బాబాయ్ ’’
ములాఖత్ టైం అయిపోయింది ఇక లోపలికి వెళ్లండి.