జనాంతికం - బుద్దా మురళి

సంపూర్ణ బ్రాండ్స్ ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది. ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అసలు మనం సభ్య సమాజంలోనే ఉన్నామా? మానవత్వం చచ్చిపోయిందా? ’’
‘‘ఏంటోయ్ అంత ఆవేశంగా ఉన్నావు. ఇంతకు ముందెన్నడూ నీలో ఇంతటి ఆవేశం చూడలేదు.’’
‘‘ఆవేశం కాదు. ఆవేదన.. ఆగ్రహం.. ప్రజాగ్రహం ముందు ఏదీ నిలువలేదు. రాజులు శాశ్వతం అనుకున్నారు. రాజ్యాలే కూలిపోయాయి. ఇక మనుషులెంత వీరి అధికారం ఎంత?’’
‘‘ఇంతకూ ఎవరి మీద కోపం? ఎవరి మీద జాలి అది చెప్పకుండా ఎన్ని హావభావాలు ప్రదర్శిస్తేనేం?’’
‘‘అది కాదండి మనం ఏం తినాలో? ఏం తాగాలో? ఎంత తాగాలో నిర్ణయించడానికి నిర్ణయించడానికి వాళ్లవరండి?’’
‘‘ఔనండి ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు? పక్కింట్లో చిన్న పిల్ల పిజ్జా తింటుంటే? చూడమ్మా అలా పిజ్జా తినడం వల్లనే ఇలా లావు అవుతున్నావు. నా మాట విని పిజ్జా తినకు. హాయిగా మీ అమ్మ చేసిన టిఫిన్ తిను అని సలహా ఇచ్చాను.. అంతే?’’
‘‘ఆ ఏమైంది?’’
‘‘వాళ్లమ్మ పరిగెత్తుకొచ్చి మా అమ్మాయి ఏం తినాలో నిర్ణయించడానికి మీరెవరు? తినొద్దని చెప్పడానికి మీకున్న అధికారం ఏమిటి? అమ్మాయి లావుగా ఉందనడం ద్వారా ఆ పిల్ల మనోభావాలను దెబ్బతీశారు. ఒక్క మా అమ్మాయి మనోభావాలనే కాదు సమస్త పిజ్జా ప్రియుల మనోభావాలు దెబ్బతీశారు. లావుండే సమస్త జీవుల మనోభావాలు దెబ్బతీశారు. ఏదో పక్కింట్లో ఉంటారనే అభిమానంతో మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. మరోసారి పిజ్జా తినోద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు అనే మనోభావాల వ్యతిరేక మాటలు మాట్లాడితే మీ మీద దేశ ద్రోహం కేసు పెడతాను అని బెదిరించింది’’
‘‘ఔను ఈ రోజుల్లో ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచినా ఏమీ కాదు, దేశాన్ని విచ్చిన్నం చేస్తాం అని మాట్లాడిన వారిపై కూడా దేశద్రోహం కేసు పెట్టరు. పైగా వారికి బోలెడు ప్రచారం, జనంలో క్రేజీ.. కానీ చిన్నపిల్లలతో లావుగా ఉన్నావు, జంక్ ఫుడ్ తినోద్దు అంటే చాలా సీరియస్ కేసు అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ తల్లి మానవతా హృదయంతో నిన్ను క్షమించింది కానీ లేకపోతే సీరియస్ కేసు అయ్యేది.’’
‘‘మనం నమస్కారం అని పలకరించుకున్నట్టుగా మార్వాడీలు జై శ్రీరాం అని పలకరించుకుంటారు. బెంగాల్‌లో ఆ మధ్య జై శ్రీరాం అంటే కేసులు పెట్టారు. ఇప్పటి నుంచి మనం కూడా బాగున్నావా? బాబాయ్ అని పలకరించామనుకో బాబాయ్ ఎవరురా! అని మనోభావాలు దెబ్బతిని కేసు పెట్టేయవచ్చు జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు!’’
‘‘నేను నీకు తమ్ముడినా?’’
‘‘సర్లే అన్నయ్య’’
‘‘నేను నీకు అన్నయ్యనా? అంటే వయసులో నీ కన్నా పెద్దవాడినా? నీ ఉద్దేశం ఏమిటి?’’
‘‘సర్లే’’
‘‘అలా రా! దారికి అన్నా... తమ్ముడు ఈ వరుసలు అవసరమా? మిస్టర్... బ్రో అని పిలకరిస్తే సరిపోతుంది కదా?’’
‘‘బ్రో అంటే అదేదో బ్రోకర్ అన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి సంబోధన లేకుండా పలకరించుకుందాం. ఇబ్బందేమీ లేదు..’’
‘‘ఎటు నుంచి ఎటో వెళుతున్నాం. ఇంతకు నీకు కడుపు తరుక్కు పోయింది ఎందుకో? ఎవరి కోసమో చెప్పనే లేదు..’’
‘‘ఆంధ్రలో తమ్ముళ్లకు అన్ని బ్రాండ్‌ల మందు దొరకడం లేదట!’’
‘‘నీకెవరు చెప్పారు? తమ్ముళ్లు చెప్పారా?’’
‘‘కాదు అల్లుడుగారు చెప్పారు!’’
‘‘నీకు చెప్పాడా?’’
‘‘కాదు మీడియాకు చెప్పాడు’’
‘‘అర్థమయ్యేట్టు చెప్పు? అల్లుడెవరు? తమ్ముళ్ళెవరు?’’
‘‘నేను చెప్పడం కాదు. ఇదిగో చూడు పత్రికల్లో క్లియర్‌గా వచ్చింది.. ‘ఏం తమ్ముళ్లూ బ్రాండ్లన్నీ దొరుకుతుతున్నాయా? తాగుబోతుల పొట్టకొడుతోందీ ప్రభుత్వం. రోజంతా పని చేసిన బాధ మర్చిపోవడానికి మీరు ఓ పెగ్గేసుకుంటే రేట్లు పెంచి మీ పొట్టకొడుతున్నారు. ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా?’’ అని మాజీ సిఎం ఆవేదన వ్యక్తం చేశారట!’’
‘‘నేను నమ్మనే నమ్మను?’’
‘‘బ్రాండ్లు దొరకడం లేదనేది నమ్మడం లేదా? ’’
‘‘కాదు మాజీ సీఎం అలా అన్నడంటే ఎవరైనా నమ్మవచ్చు కానీ నేను నమ్మనే నమ్మను’’
‘‘ఎందుకు?’’
‘‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మద్యనిషేధ ఉద్యమం జరిగింది తెలుసా?’’
‘‘ఉద్యమ చరిత్ర మొత్తం తెలుసు చెప్పమంటావా? టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు నేతృత్వంలో ఎన్టీఆర్ నాయకత్వంలో మద్యనిషేధ ఉద్యమం ఉధృతంగా సాగింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి. దూబగుంట రోశమ్మ ప్రారంభించిన ఉద్యమానికి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తల వంచక తప్పలేదు. అప్పుడాయన సారాయిపై నిషేధం విధించారు. ఉద్యమ ఫలాలు ఫలించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యనిషేధం విధించారు. నిజానికి ఎన్టీఆర్ హయాంలో సంపూర్ణ మద్యనిషేధం అంటారు కానీ కాదు కానే కాదు అల్లుడు గారి హయాంలోనే సంపూర్ణ నిషేధం అమలైంది.’’
‘‘ఎలా? ఎలా అల్లుడు గారు నిషేధాన్ని ఎత్తివేశారు కానీ సంపూర్ణ నిషేధం అమలు చేశారా?’’
‘‘అక్కడే ఉంది ట్విస్ట్ ఎన్టీఆర్ పేరుకు సంపూర్ణ మద్యనిషేధం అన్నారు కానీ పర్మిట్లు ఇచ్చే వారు. అంటే కొందరికి మద్యం తాగేందుకు పర్మిట్లు ఇచ్చేవారు. మామను దించి అల్లుడు అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు పర్మిట్లతో తాగడానికి అనుమతి ఉన్నప్పుడు అది సంపూర్ణ నిషేధం ఎలా అవుతుంది అని బాగా ఆలోచించిన అల్లుడు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పర్మిట్లను కూడా రద్దు చేసి సంపూర్ణ నిషేధం అనే మాటకు సార్థకత చేకూర్చారు’’
‘‘అలానే అంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న వారిని నిషేధం ఎత్తివేశారని అంటారేమిటి?’’
‘‘అదీ నిజమే కదా?’’
‘‘అర్థం కాలేదు.. సంపూర్ణ నిషేధం అమలు చేసింది అల్లుడుగారే అని మీరే అంటారు. నిషేధం విధించింది ఆయనే అంటారు ఇదేంటి?’’
‘‘రెండూ ఆయనే చేశారు. అధికారంలోకి రాగానే పర్మిట్లను రద్దు చేసి సంపూర్ణ నిషేధం అనే మాటను నిజం చేశారు. అధికారంలో స్థిరపడగానే నిషేధం ఎత్తివేసి మందు బాబులకు పండుగ రోజులు తెచ్చారు’’
‘‘అన్నీ ఆయనే అన్నమాట’’
‘‘అలాంటి అల్లుడు గారు కొన్ని బ్రాండ్లు దొరకడం లేదని ఆవేదన చెందడాన్ని అస్సలు జీర్ణం చేసుకోలేకపోతున్నాను.’’
‘‘ఇప్పుడేమంటావు?’’
‘‘అన్ని బ్రాండ్లు మందు బాబులకు అందుబాటులో ఉంచాలని అల్లుడు గారు మహోద్యమం చేస్తారంటాను’’
‘‘సాధ్యమా?’’
‘‘చోడోయ్ భారీ బాంబులు కనిపెట్టినాయనే నోబెల్ శాంతి బహుమతి ప్రవేశపెట్టారు. సంపూర్ణ మద్యనిషేధం ఉద్యమం సాగించిన వారే సంపూర్ణ బ్రాండ్ల కోసం ఉద్యమిస్తారు.’’

buddhamurali2464@gmail.com