క్రీడాభూమి

లాహోరైతే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడే హోం సిరీస్‌లు ఆడాలని పిసిబికి శుక్లా హితవు
కరాచీ, నవంబర్ 21: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో కాకుండా స్వదేశంలోనే సురక్షితమైన ఒక వేదికను తయారు చేసుకుంటే బాగుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సీనియర్ అధికారి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా హితవు పలికాడు. లాహోర్‌ను హోం సిరీస్‌లకు స్థిరమైన వేదికగా చేసుకుంటే బాగుంటుందని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా సూచించాడు. యుఎఇ వంటి తటస్థ వేదికలపై సిరీస్‌లు ఆడడం వల్ల పాకిస్తాన్‌లో క్రికెట్‌కు ఆదరణ క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరించాడు. లాహోర్‌లో స్టేడియానికి సమీపంలోనే క్రికెటర్ల కోసం హోటల్‌ను నిర్మిస్తే బాగుంటుందన్నాడు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని అన్నాడు. ఈ చర్యలు తీసుకుంటే, లాహోర్‌లో సిరీస్‌లు ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పాడు. అయితే, ఆటగాళ్ల భద్రతపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి స్పష్టమైన హామీ ఇవ్వాలని పిసిబి అధికారులకు స్పష్టం చేశాడు. ఈ దిశగా పిసిబి అన్ని చర్యలు తీసుకుంటే లాహోర్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు మిగతా దేశాల క్రికెట్ బోర్డులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని శుక్లా అన్నాడు. భద్రతగల కేంద్రంగా లాహోర్ అభివృద్ధి చెందితే, అక్కడ మ్యాచ్‌లు ఆడడం సులభమవుతుందని చెప్పాడు.
పరిస్థితులు మారాయి..
గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయని శుక్లా అన్నాడు. పిసిబితో గత ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించిన ఒప్పందాన్ని బిసిసిఐ కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించగా, అది నిజమేనని అన్నాడు. అయితే, ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఉన్న బిసిసిఐ అధ్యక్షుడుగానీ, ఐసిసి చైర్మన్‌గానీ ఇప్పుడు లేరని పేర్కొన్నాడు. ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పాక్‌తో క్రికెట్ సంబంధాలను కోరుకుంటున్నాడని చెప్పాడు. అయితే, సిరీస్‌లు భారత్ లేదా పాకిస్తాన్ దేశాల్లో జరగాలేగానీ తటస్థ వేదికలపై కాదని మనోహర్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడని అన్నాడు.
నష్టాన్ని భర్తీ చేస్తాం..
భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు లేని కారణంగా పిసిబి ఎదుర్కొంటున్న భారీ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని, అయితే, ప్రస్తుతానికి భారత్‌కు వచ్చిన సిరీస్ ఆడాలని పిసిబికి శుక్లా ప్రతిపాదించాడు. భారత్‌లో సిరీస్ ఆడితే భారీ మొత్తంలో పారితోషికాన్ని బిసిసిఐ చెల్లిస్తుందన్నాడు. అంతేగాక, భావిష్యత్తులో పాకిస్తాన్ టూర్‌కు టీమిండియా వెళుతుందని హామీ ఇచ్చాడు. పాకిస్తాన్‌లో పరిస్థితులు మెరుగుపడిన వెంటనే అక్కడ సిరీస్‌లు ఆడడానికి భారత్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నాడు. భారత్ పర్యటనకు పాక్ క్రికెటర్లు రావడం వల్ల లాభమేతప్ప నష్టం లేదన్నాడు. ఇందులో పరువుప్రతిష్టలన్న ప్రసక్తే లేదని చెప్పాడు.
యుఎఇపై నో కామెంట్
ఈ ఏడాది ఐపిఎల్‌లో కొన్ని మ్యాచ్‌లను యుఎఇలో ఆడినప్పుడులేని అభ్యంతరం పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు మాత్రమే ఎందుకు తలెత్తుతుందన్న ప్రశ్నకు శుక్లా సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. ఇతర జట్లు యుఎఇలో పాక్‌తో సిరీస్ సిరీస్‌లు ఆడుతున్నాయి కదా అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత్‌కు సొంత విధానం ఒకటి ఉందని శుక్లా చెప్పాడు. పాక్‌తో క్రికెట్ సంబంధాలను భారత్ కోరుకుంటున్నదని స్పష్టం చేశాడు. ముంబయిలో శివసేన కార్యకర్తల ఆందోళన గురించి ప్రశ్నించగా ‘వారు ఎవరికి ఇబ్బంది కలిగించారు?’ అని శుక్లా ఎదురుప్రశ్న వేశాడు. కార్యకర్తలంతా బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ క్యాబిన్‌లోకి వెళ్లి నినాదాలు చేశారని అన్నాడు. పిసిబి అధికారులెవరిపైనా వారు దాడికి దిగడంగానీ, ఇబ్బంది సృష్టించడంగానీ చేయలేదని అన్నాడు. లాహోర్‌ను భద్రతగల వేదికగా సిద్ధం తయారుచేసే అంశాన్ని పాక్ సర్కారు, పిసిబి చర్చించాలని సూచించాడు. 2009 మార్చి మాసంలో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ, ఒకసారి అవాంఛనీయ సంఘటన జరిగినంత మాత్రాన పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగకూడదన్న నిబంధన ఏదీ లేదని అన్నాడు. ఇటీవల జింబాబ్వే జట్టు పాక్ పర్యటన జరిపి, లాహోర్లో మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. లాహోర్‌లో మ్యాచ్‌ల వల్ల ఆటగాళ్లకు ప్రమాదం లేదన్న విషయం జింబాబ్వే టూర్ స్పష్టం చేసిందన్నాడు. ఆ అవకాశాన్ని పిసిబి సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికాడు. పాక్‌లో క్రికెట్‌కు తమ మద్దతు ఉంటుందన్నాడు.