అమృత వర్షిణి

జీవనశైలిని మెరుగుపరచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ఆలోచించడానికి ప్రయత్నించరు. వారి పక్షపాత వైఖరిని తిరిగి ఒక పద్ధతిలో పెట్టుకుంటారు. నిజానికి మనిషి స్పష్టంగా ఆలోచించగల శక్తి ప్రకృతి ప్రసాదించింది. మరి ఎందుకనో కొంతమంది తమ తెలివిని వినియోగించుకోవడంలో విఫలమవుతూ ఉంటారు.
తరచు మన ఆవేశాలు మన న్యాయ నిర్ణయ శక్తిని కూల్చేస్తూ ఉంటాయి. తమాషా ఏమిటంటే మనలోని పక్షపాత వైఖరులను ఇతరులు మనలో ప్రతిష్ఠిస్తారు. మనకు కొన్ని పక్షపాత ధోరణులు సహజంగా ఉండవచ్చు. మనం అనుకుంటున్న భావనలు హేతుబద్ధంగా, యధార్థానికి దగ్గరగా ఉన్నాయా? అనే విషయం తెలుసుకుంటే మన పక్షపాత దృష్టిని బాగా తగ్గించుకో గల్గుతాం.
చిన్న ఉదాహరణ
రామస్వామి తన కంపెనీలో 35 సంవత్సరాలు దాటిన మహిళలను, 45 సంవత్సరాలు దాటిన పురుషులను తీసుకోడు. అతని ఉద్దేశంలో వారు అనిశ్చలంగా ఉండి మాటిమాటికి ఉద్యోగాలు మారుతూ ఉంటారని, యువత వలె వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేయరని, తరచూ సెలవులు పెడుతూ ఉంటారని అతని నమ్మిక.
రామస్వామి లేబర్ డిపార్ట్‌మెంట్‌తో తన అభిప్రాయాన్ని విశే్లషణ చేసుకుంటే అతడు ఎంతటి తప్పు అభిప్రాయంతో వున్నది తెలుసుకుంటాడు. లేదా అటువంటి వారి పని తీరుపై దృష్టి సారిస్తే అతడు తన తప్పుడు ఆలోచనలను తెలుసుకోగల్గుతాడు. తగిన సమాచారం ఆధారం చేసుకుని, యధార్థాలు తెలుసుకుంటే ఇటువంటి నైజం నుండి బయటపడవచ్చు.
నిత్యం చేసుకునే పనులు
మనకు మేలైన, హేతుబద్ధంగా ఉండే ఆరోగ్యకరమైన మనసు ఉంది. ఎంత దురదృష్టం అంటే ప్రతి అల్ప విషయానికి దానిని నానా రకాలుగా అవస్థ పెడుతూ ఉంటాం.
ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకుంటారు. అలారం కొట్టగానే నిద్ర నుండి లేవడమే మరొక పది నిమిషాలు పక్క మీద దొర్లడమా నిర్ణయించుకోలేరు. మదనపడిపోతూ ఉంటారు. అనుదినపు పనులు ఒక క్రమపద్ధతిలో చేయడం అలవరచుకుంటే మనసుకు నలుగుడు లేకుండా చేసుకోవచ్చు.
మరుసటి రోజున ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కావలసి వచ్చినపుడు ఆ రాత్రే మర్నాడు ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకోవాలి. అవి మీకు అందుబాటులో ధరించేందుకు వీలుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చిన్నచిన్న పనులు మీ చేతులు ఆటోమేటిక్‌గా చేసుకుపోతూ ఉంటే, మీ మనసును సృజనాత్మకమైన ఆలోచనలు చేసేందుకు వినియోగించుకోవాలి.
తెలివిని తక్కువగా అంచనా వేసుకోకండి!
నేర్చుకోవడం, ఆలోచించి కొత్త సమస్యలను పరిష్కరించగల సమర్థతే తెలివి. ఇది విద్యార్థులకు మాత్రమే సొంత ఆస్తి కాదు. ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే కళాశాల చదువు చదివే అవకాశాలు ఉండవచ్చు. ఈ ఒక్కరితో మిగిలిన ముగ్గురూ తెలివి విషయంలో ఏ మాత్రం తీసిపోరు.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. నిర్ణయాలు తీసుకునేందుకు కావలసిన విషయాలు తెలుసుకునేందుకు ఎచటికి వెళ్లాలో తెలుసుకోవాలి. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివి అందులోని సారాన్ని గ్రహిస్తూ ఉండాలి.
సైద్ధాంతిక ప్రాతిపదికలు ఎన్ని వున్నా అవి తగిన ఆధారాలతో నిరూపితం అయినపుడే దానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఏ విషయాన్ని ఊహించుకుని నిర్ణయాలు తీసుకోకూడదు. మనకు అపరిమితమైన జ్ఞానం ఉందని అంచనా వేసుకోకూడదు.
జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరచుకోవాలి
జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనుషుల పేర్లు గుర్తుపెట్టుకోవడం వారు కన్పించినపుడు వారిని గుర్తించి పలకరించడం అవసరం. మనుషుల్ని గుర్తు పట్టలేక పోతే అదొక సమస్య. అవతలి వారు మీకు దూరమై పోతారు.
కొత్తవారు ఎదురయినపుడు వారి పేరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా వారు ఎదురయితే పేరు పెట్టి పిలిచి పలకరించాలి. అదే విధంగా వారి ముఖ ఆకృతిని పదేపదే గుర్తుకు తెచ్చుకుంటూ మరచిపోకుండా మనసులో ఆ ముఖాన్ని ముద్ర వేసుకోవాలి. ఇలా చేయడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టాలి
ఉదాహరణకు ఒక ఇల్లాలు ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా ఒకరోజు ఆకుకూరలు వండుకోవాలని నేర్చకుందనుకుందాము. ఇది తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. దానిని ఆచరణలో పెట్టాలి. ఒక వ్యక్తికి ఇంట్లో టీవీ ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో పుస్తకాలలో చదివితే అది నేర్చుకోవడం అవుతుంది. ఆ పనిని రెండు మూడుసార్లు చేస్తే నేర్చుకున్న విషయం బోధపడుతుంది.
ఫ్రెంచి భాషలో వ్యాకరణం బాగా నేర్చుకుంటే సరిపోదు. ఫ్రెంచి భాషలోని పుస్తకాలు చదవడం, రాయడం వంటివి చేసినపుడే ఆ నేర్చుకున్నది గుర్తుండి వినియోగపడుతుంది. లేకపోతే కొన్ని రోజుల్లో నేర్చుకున్న వ్యాకరణం మరచిపోతారు.
సైద్ధాంతికంగా నేర్చుకున్నది త్వరగా మరచిపోతారు. దానిని ఆచరణలో పెట్టినపుడు బాగా గుర్తుండి పోతుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ