జనాంతికం - బుద్దా మురళి

బీఎస్‌ఎన్‌ఎల్ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు..!?’’
‘‘ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందోయ్.. సికిందరాబాద్ స్టేషన్‌లో 107 బస్సు ఎక్కామంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా దిల్‌సుఖ్‌నగర్ వెళతాం. ఇప్పుడు మధ్యలో ఉన్నాం, ఇంకా అరగంటలో గమ్యస్థానానికి చేరుతాం.’’
‘‘జోకులు చాలులే! నేను చెబుతున్నది మన ప్రయాణం గురించి కాదు. దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదు’’
‘‘నువ్వేం దిగులు పడకు. ఈ దేశానికి ఏం కాలేదు. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. తొందరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీ ఆర్థిక వ్యవహారాల గురించి దృష్టి సారించు ముందు. బాలాజీ ఫైనాన్స్ వారు జీరో ఇంట్రస్ట్‌తో వస్తువులు కొనడానికి రుణం ఇస్తారని, ఇష్టం వచ్చినట్టు, నచ్చినవీ, నచ్చనివీ అన్నీ కొంటున్నావ్. జీరో పర్సంటేజ్‌తో రుణాలు ఇస్తున్న ఆ కంపెనీనేమో బోలెడు ఆదాయం సంపాదిస్తుంటే ఈఎంఐలు కట్టలేక మన లాంటి వాళ్లం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం.’’
‘‘నిజమేనోయ్ కొన్ని లెక్కలు అస్సలు అర్థం కావు. జీరో పర్సంటేజ్‌తో వడ్డీకి ఇచ్చే కంపెనీ అంత లాభాల్లో ఉండడం ఏమిటో? స్టాక్ మార్కెట్‌లో దాని షేర్ విలువ నాలుగు వేలు దాటడం ఏమిటో? అస్సలు అర్థం కాదు. అన్ని కంపెనీలు కూడా లాభాలపై దృష్టి పెట్టడం కన్నా జీరో లాభంతో వ్యాపారం సాగిస్తేనే బోలెడు లాభాలు ఉంటాయోమో!’’
‘‘జీరో లాభంతో, జీరో వడ్డీతో రుణాలు ఇవ్వడానికి అవేమన్నా ధర్మసంస్థలా? వ్యాపారంలో అదో టెక్నిక్. అంటే నువ్వేం చేస్తావో అది చెప్పకు అనే మూల సూత్రంపై అలాంటి కంపెనీలు పనిచేస్తాయన్న మాట!’’
‘‘నిజమే అనిపిస్తోంది. నిజం చెబితే జనానికి అస్సలు నచ్చదు. మాయమాటలే కావాలి..’’
‘‘వాళ్ల వ్యాపారం వాళ్లిష్టం మనకెందుకు కానీ.. మనం ఎటు పోతున్నామో అనే సందేహం నీకెందుకొచ్చినట్టు?’’
‘‘మనం ఉద్యోగంలో చేరిన కొత్తలో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ ఉండడం అంటే ఎంత గర్వంగా ఉండేది. ఇప్పుడలాంటి బీఎస్‌ఎన్‌లో లక్ష మంది వరకు విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారట! అసలా కంపెనీ ఉంటుందా? ఉండదా? ఏమవుతుంది? ఎటు పోతున్నామనిపిస్తోంది’’
‘‘ఔను నాకూ గుర్తుంది. ఆ కాలంలో ల్యాండ్ లైన్ ఫోన్ కావాలంటే కనీసం పదేళ్లు నిరీక్షించాల్సిందే. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వెళితే అక్కడ పెద్ద బోర్డు ఒకటి కనిపించేది ఇంకెన్ని ఏళ్లు నిరీక్షిస్తే ఫోన్ కనెక్షన్ వస్తుందో రాసి పెట్టేవారు. ఏ సంవత్సరం వరకు కనెక్షన్ ఇచ్చారో రాసేవారు’’
‘‘అలాంటి సంస్థ ఇలాంటి స్థితికి ఎందుకు వచ్చిందంటావు?’’
‘‘మనకు అవసరం లేనిది ఏదైనా ఏదో ఒకనాటికి దానంతట అదే కనిపించకుండా పోవడం అనివార్యం’’
‘‘అంటే ఈ రోజుల్లో ఫోన్ అవసరం లేదంటావా? గతంలో కన్నా చాలా ఎక్కువగా ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు’’
‘‘నీతో విభేధించను కానీ... దాదాపు 95-96 ప్రాంతంలో అద్దె ఇంటిని మారినప్పుడు ఫోన్ కనెక్షన్ మార్పు కోసం బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వెళ్లాను. నిజం చెప్పొద్దు ఆ సమయంలో నాకు బదులు ఓ కథా రచయిత అక్కడ ఉండి ఉంటే ఓ కథా సంకలనం రాయడానికి అవసరం అయినన్ని కథలు దొరికేవి అక్కడ..’’
‘‘అక్కడ ఫోన్ కనెక్షన్లు దొరుకుతాయి కానీ కథలకు ప్లాట్లు దొరకడం ఏమిటి?’’
‘‘ఒక్కటి చెబుతాను దాన్ని బట్టి అక్కడ ఎన్ని కథలు దొరికేవో నువ్వే ఊహించుకో.. ఫోన్ మార్పు కోసం కార్యాలయం చుట్టూ రోజూ తిరగడం అలవాటైంది. రకరకాల ఫోన్ బాధల గురించి అక్కడి సిబ్బంది నవ్వుతూ కథలు చెప్పుకునే వారు. ఒకతను ఫోన్ వాడిన దాని కన్నా ఎక్కువగా బిల్లు వచ్చిందని ఫిర్యాదు చేశాడట! మరీ అమాయకుడిలా ఉన్నాడు. ఒక వ్యక్తి ఫోన్ కోసం పదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఫోన్ కనెక్షన్ ఇవ్వలేదు కానీ బిల్లు వచ్చిందట! అంటే ఫోన్ కనెక్షన్ ఒక అడ్రస్‌కు ఇచ్చి బిల్లు మాత్రం అతని అడ్రెస్‌కు ఇచ్చారు. మా వద్ద ఇలాంటి వింతలెన్నో జరుగుతుంటాయి. అలాంటిది మీరొచ్చి బిల్లు ఎక్కువగా వచ్చింది.. ఫోన్ కనెక్షన్ షిఫ్టింగ్ జరపడం లేదు అని సిల్లీ సమస్యలు చెబుతారేంటి అని చిన్న చూపు చూసేవారు! నేను కూడా నా సమస్యను పక్కన పెట్టి ఇలాంటి వింత వింత సమస్యలను వినడానికి ఆ కార్యాలయానికి రోజూ వెళ్లే వాడిని..’’
‘‘అంటే అప్పుడెప్పుడూ రెండున్నర దశాబ్దాల క్రితం నీ పని చేయలేదని, నిన్ను ఇబ్బంది పెట్టారని ప్రతీకారం తీర్చుకోవడానికి అంత పెద్ద సంస్థ మూత పడాలని కోరుకుంటావా? దుర్మార్గుడా? నీలో ఇంతా శాడిస్ట్ ఉంటాడని అస్సలు అనుకోలేదు’’
‘‘ఆగాగు.. ఆ సంస్థ మూత పడాలని నేను కోరుకున్నానా? నీకెవరు చెప్పారు? ఆ సంస్థనే కాదు ఏ సంస్థ కూడా మూత పడాలని నేను కోరుకోను. లక్ష మంది వీఆర్‌ఎస్ కాదు ఒక్కరి ఉద్యోగం పోయినా నాకు నచ్చదు. ఉద్యోగం అంటే అది ఒక వ్యక్తి జీవితం కాదు. అతనిపై ఆధారపడి ఉండే మొత్తం కుటుంబం జీవితం... మొత్తం కుటుంబంపై ప్రభావం పడుతుంది. నిరుద్యోగిగా ఉండడం కన్నా ఉద్యోగం పోవడం మరింత బాధాకరం.. నేనెప్పుడూ అలాంటివి కోరుకోను’’
‘‘మరి నువ్వే కదా బీఎస్‌ఎన్‌ఎల్ కథలని చెప్పావు’’
‘‘పోటీ లేనప్పుడు ఫోన్లు బీఎస్‌ఎన్‌ఎల్ చేతిలోనే ఉన్నప్పుడు వారు ఆడింది ఆట, పాడింది పాట! ప్రైవేటు రంగ ప్రవేశం చేసిన తరువాత ఏదో ఒక రోజు ఇలాంటిది అనివార్యం.’’
‘‘అంటే ఎల్‌ఐసీని అమ్మడాన్ని కూడా సమర్ధిస్తావా?’’
‘‘నువ్వు నేనే కాదు మనలాంటి వాళ్లందరం చాలా చిత్రమైన వాళ్లం.’’
‘‘ఎలా?’’
‘‘మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్‌లో చేర్పించం. బిఎస్‌ఎన్‌ఎల్ వాడం, తెలుగు మీడియంలో చదివించం కానీ.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తాం. ఏయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ ఉపయోగిస్తూ బిఎస్‌ఎన్‌ఎల్ విఆర్‌ఎస్‌పై కవిత్వం రాస్తూ మిత్రులకు పంపిస్తుంటాం.’’
‘‘అంటే తప్పు మనదే అంటావా?’’
‘‘తప్పెలా అవుతుంది? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇంగ్లీష్ మీడియం చదివిస్తాం. మంచి సర్వీసు ఉంటుందని ప్రైవేటు ఆపరేటర్లను ఎంపిక చేసుకుంటాం’’
‘‘మరి తప్పేవరిది?’’
‘‘కాలం.. కాలానికి తగ్గట్టు మారకపోతే వ్యక్తి అయినా సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోతాయి.’’