జనాంతికం - బుద్దా మురళి

కరోనా... బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సాలా ఏక్ మచ్చడ్‌నే ఆద్మీకో హిజ్‌డా బనాతా డైలాగ్ గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తు లేదు! భాష అంత బాగా అర్థం కాకపోయినా నానాపాటేకర్ నటన, డైలాగు చెప్పే తీరు ఎలా మరిచిపోతాం. నిజమే కదా? ఒక చిన్న దోమ మనిషిని హిజ్డాను చేస్తుంది కదా? హిజ్డాగా మారి చప్పట్లు కొట్టినా ఎక్కడి నుంచో తప్పించుకుంటుంది కానీ చేతికి చిక్కదు. ఈ మధ్య ఎలాంటి మందుకూ దోమలు లొంగడం లేదు’’
‘‘ఔను రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధి గీతాన్ని ఈ మధ్య ఓ కవి పేరడీ చేస్తూ దోమలు లేని లోకానికి పంపించు భగవాన్ అని ఓ పేరడీ కవిత రాశాడు’’
‘‘ఈ రోజు మరికొన్ని గంటల్లో నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇంత కీలక సమయంలో ఆదాయం పన్ను రాయితీల గురించి, మనం కొన్న షేర్లు స్టాక్ మార్కెట్‌లో ఎలా పెరగబోతున్నాయో చర్చించకుండా బోడి దోమ గురించి ఆలోచిస్తున్నామేంటి?’’
‘‘ఆదాయం పన్ను మినహాయింపును రెండున్నర లక్షల నుంచి మరో లక్షకు పెంచుతారని, 80 సిసి కింద ఇప్పుడున్న లక్షన్నర మినహాయింపును మూడు లక్షలు చేస్తారని, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడికి ఇప్పుడు 50 వేల వరకు పెట్టుబడికి పన్ను మినహాయిస్తున్నారు కదా? దీన్ని లక్ష చేస్తారట! ఏం జరుగుతుందో తెలియదు కానీ వార్తలు మాత్రం బోలెడు వస్తున్నాయి. ఐనా ఒకవైపు పరిశ్రమలకు పన్నులు తగ్గించడం వల్ల దేశంలో రెండు దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేనంతగా పన్నుల ఆదాయం పడిపోయిందనే వార్తలు ఒకవైపు వస్తుంటే మరోవైపు పన్నుల్లో కోత విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆదాయం తగ్గిపోతుంటే ప్రభుత్వాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి కానీ ఎందుకు తగ్గిస్తాయి.’’
‘‘పరిశ్రమలకు 30 శాతం నుంచి పన్నును సగం చేసినప్పుడు మనం ఆ మాత్రం ఆశించడం అత్యాశ అవుతుందా?’’
‘‘ఎవరికి పన్నులు తగ్గించినా, ఎవరికి పెంచినా అంతిమంగా ప్రభుత్వాలు నడిచేది పన్నులతోనే కదా? పన్నులు లేంది పాలన ఎక్కడుంటుంది. ఐనా మనకెందుకులే మన పన్ను రాయితీలు, ఆదాయం మినహాయింపుల స్లాబులేంటో అవి మనకు ముఖ్యం.’’
‘‘అడగడం మరిచాను. స్టాక్ మార్కెట్‌లో బాగానే ఇనె్వస్ట్ చేసినట్టుగా ఉన్నావ్? బడ్జెట్ అంటే ఇనె్వస్టర్లకు పండగ లాంటిది కదా? మరి ఇలా ఢీలా పడినట్టున్నావేంటి?’’
‘‘ఏం పండుగ పో.. నానా పాటేకర్ పాపులర్ డైలాగ్ ఏక్ మచ్చర్‌నే ఆద్మీకో హిజ్డా బనాయా అన్నట్టు ఒక్క దోమ మగాడ్ని అలా చేస్తేనే ఇక ఇదేదో కరోనా వైరస్ అట! మొత్తం ప్రపంచానే్న గడగడలాడిస్తోంది. ఆర్థిక రంగంలో అమెరికానే భయపెడుతున్న చైనా కూడా కరోనా బారిన పడి విలవిలలాడిపోతోంది. ’’
‘‘్భయపెట్టడమే తెలిసిన చైనా కూడా భయపడుతుందా?’’
‘‘కాలం కలిసి రాకపోతే అంతే మరి. హాంకాంగ్‌తో పాటు చైనా స్టాక్ మార్కెట్లు అన్నీ రెండు వారాలు మూసేశారు. ఆ దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. తెరిచాక ఎంతో ఘోరంగా పడిపోతాయో అని భయపడుతున్నారు. కరోనా దెబ్బకు అమెరికా మార్కెట్లు సైతం నేల చూపులు చూస్తున్నాయి. ’’
‘‘ఆ దేశాల్లో మార్కెట్ పడిపోతే మనకేం?’’
‘‘మనకేం అనకు మన దేశంలో సైతం మూడు రోజుల పాటు మార్కెట్లు నేల చూపులు చూశాయి. వీటి వార్తలన్నీ బిజినెస్ చానల్స్‌లో చూస్తే వణుకు పుట్టింది. మన మార్కెట్ పాతాళంలోకి పడిపోవడం ఖాయం అని ఇండెక్స్ చూస్తే పైకి దూసుకెళ్లింది’’
‘‘ప్రపంచంలో ఎంత మేధావి అయినా ఇండెక్స్ పైకి దూసుకు వెళ్లేదాన్ని, కిందకు పడిపోయే దాన్ని ముందుగా ఆస్సలు ఊహించరు.’’
‘‘మరీ కరోనా బారిన పడి మనుషులు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారనే వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది కదా?’’
‘‘బ్రహ్మంగారు ఏం చెప్పారో కానీ... వచ్చే నాలుగున్నర ఏళ్ల తరువాత దేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పమంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పగలను.’’
‘‘నువ్వేంటి ఎవరైనా చెప్పగలరు!’’
‘‘నిజమే కానీ స్టాక్ మార్కెట్ రేపు ఎలా స్పందించనుందో ఎంత పెద్ద మేధావి కూడా చెప్పలేడు. మేం మార్కెట్‌లో కొమ్ములు తిరిగిన మేధావులం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డైలాగులు చెప్పే ఎక్స్‌ఫర్ట్‌లు సైతం మార్కెట్ తమ అంచనాలకు అందడం లేదని తెల్ల ముఖం వేస్తున్నారు. బడ్జెట్ ర్యాలీ ముందుంది అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చిన వారు. కరోనా వైరస్ బడ్జెట్ ర్యాలీని మింగేసిందంటున్నారు. అంతకు ముందు కూడా అంతే అమెరికా- ఇరాన్ యుద్ధం తప్పదు. మార్కెట్‌కు దూరంగా ఉండండి అంటూ యుద్ధం వల్ల ఏయే కంపెనీలు ఎలా నష్టపోతాయి అని లెక్కలు చెప్పారు. తీరా యుద్ధం లేదు. మరోవైపు మార్కెట్ దూసుకెళ్లింది. ’’
‘‘ఆడవారి మనసు, సముద్రపు లోతు తెలుసుకోలేం అంటారు. అలానే ఇప్పుడు మార్కెట్ కదలికలు కూడా’’
‘‘మొదటి రెండింటిని అంచనా వేయడం కష్టమేమీ కాదు. కానీ మూడోదే అస్సలు అంతు చిక్కడం లేదు’’
‘‘నిజమే కదా? ఐనా వందల ఏళ్ల ముందే బ్రహ్మంగారు చెప్పేశారు. అంటున్నారు కదా? మరి మార్కెట్ కదలికలను కనీసం ఒక రోజు ముందు చెప్పవచ్చు కదా? ’’
‘‘ఆయనే ఉంటే బార్బర్‌తో పనేంటి అన్నట్టు. మార్కెట్ కదలికలను ముందే గ్రహించగలిగితే అంబానీల తలదనే్నట్టుగా సంపాదించేస్తాం కదా? ’’
‘‘బ్రహ్మంగారి కాలజ్ఞానం, చిలక జోస్యం, బడ్జెట్ అంకెలు, అమెరికా- ఇరాన్ యుద్ధం, అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలు వీటిలోనే ఉంది మార్కెట్ భవిష్యత్తు అని ఇంత కాలం అనుకున్నాం కాదన్నమాట!’’
‘‘కాదు కానే కాదు. అమెరికా కన్నా, చైనా కన్నా యుద్ధాల కన్నా కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైనది.’’
‘‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికాను, అమెరికాను దాటి ముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న చైనాను. విర్రవీగుతున్న ప్రపంచానికి ఓ చిన్న వైరస్ చుక్కలు చూపిస్తోంది.’’
‘‘నానాపాటేకర్ భాషలో చెప్పాలంటే ఏక్ మచ్చర్‌నే సారే దునియోకో హిజ్డా బనాదియా’’
‘‘హచ్... హచ్...’’
‘‘ఏంటీ తుమ్మావా? బాబోయ్ కరోనా వైరస్ కావచ్చు.. పారిపోదాం పదండి’’

buddhamurali2464@gmail.com