జాతీయ వార్తలు

భ్రమల మత్తులో భారత జాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిపించని కుట్రలు...అబద్ధాల దాసులు
పరోపకారిణి వార్షిక రుషి మేళా సభలో ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి
అజ్మీర్, నవంబర్ 21: రాజకీయ రాగద్వేషాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి విశాలదృష్టితో నేటి భారతదేశ స్థితిగతులను, సామాజిక పోకడలను, మనవారి ఆలోచనా ధోరణులను విశే్లషించుకుంటే పరిస్థితులు ప్రతి దేశభక్తుడికీ తీవ్ర వ్యాకులత కలిగిస్తాయని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి అన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శనివారం జరిగిన పరోపకారిణి వార్షిక రుషి మేళా బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘వాస్తవం చెప్పాలంటే ఈరోజు అంతా భ్రమల్లో బ్రతుకుతున్నాం. అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మన అధోగతికి కారణమైన అసలైన వికృతులవైపు తొంగి చూడటానికే భయపడుతున్నామ’ని అన్నారు. ఇంగ్లీషువాళ్లు ఏ దుర్ముహుర్తాన మన పుణ్యభూమిలో అడుగుపెట్టి, కుట్రలూ, కుహకాలతో మెల్లిమెల్లిగా దేశాన్ని ఆక్రమించారో అప్పటినుండే మన మీద అబద్ధాల దండయాత్ర మొదలైందన్నారు. ఆర్యులు బయటవారని, ఇంగ్లీషు వాళ్ల లాగే వేరేదేశం నుండి వచ్చి మన దేశం మీద దాడి చేసి, ఇక్కడి ఆదివాసి ద్రావిడ నాగరికతను నాశనం చేసి, దేశాన్ని ఆక్రమించారని ఆంగ్లేయులు తప్పుడు సిద్ధాంతం లేవదీశారని వివరించారు.
మాయదారి క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రయోజానాలకు తగ్గట్టు తిమ్మిని బమ్మిగా చూపెట్టి కల్లబొల్లి చరిత్రలు సృష్టించాయని, ఆ పచ్చి అబద్ధాలను పాఠ్యపుస్తకాలకెక్కించి మెకాలే విద్యావిధానంలో విద్యార్థుల బుర్రలు ఖరాబు చేసిన కారణంగా కొన్ని తరాలు గడిచేసరికి అవే అక్షరసత్యాలైనట్టు మన విద్యావంతుల మనస్సుల్లో ముద్రపడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల ఎంతో అనర్థం జరిగిందని, ప్రపంచానికి నాగరికత నేర్పిన, మొత్తం మానవాళికి విద్య-విజ్ఞానం ప్రసాదించిన వైదిక ఆర్య సంస్కృతికి వారసులమైనందుకు గర్వించవలసింది పోయి సిగ్గుపడే దౌర్భాగ్య పరిస్థితిని మెకాలే మార్కు ఇంగ్లీషు చదువులు తెచ్చిపెట్టాయని అన్నారు. వాస్తవానికి మనకు అసలైన స్వాతంత్య్రం ఇప్పటికీ రాలేదని ఎంవిఆర్ శాస్త్రి పేర్కొన్నారు. 1947లో జరిగింది అధికార మార్పిడి మాత్రమేనని, బ్రిటిష్ వారి నుండి వారి అభిమానుల చేతిలోకి రాజ్యాధికారం మారిందని, తమ సామాజ్య్ర అవసరాల కోసం తెల్లవారు తెచ్చి రుద్దిన వంకర విద్యావిధానమే అష్టవంకరలతో ఈనాటికీ కొనసాగుతోందని అన్నారు.
1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం దురదృష్టవశాత్తు విఫలమై తెల్లవారి ఆగడాలకు అడ్డులేకుండా పోయి, జాతీయ శక్తులు దిక్కుతోచక డీలాపడిన స్థితిలో పూజ్య దయానంద సరస్వతి మహాస్వామి గోరక్షణ ఉద్యమంతో యావద్భారతంలో అపూర్వ చైతన్యం తెచ్చారని ఎంవిఆర్ శాస్త్రి అన్నారు. దయానంద ప్రబోధానికి ప్రభావితులైన ఎంతోమంది మహమ్మదీయులు కూడా గోరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. హిందువులు, ముస్లింలు కలిసి గోవధను వ్యతిరేకించిన కాలం నుండి గోమాంసం తింటే తప్పేమిటని హిందువులుగా చెప్పుకునేవారే వాదులాడే స్థితికి దిగజారామని అన్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తిమీదా దుర్మార్గపు దాడుల నుండి ధర్మాన్ని రక్షించుకోవడానికి కార్యోన్ముఖలం కావలసిన బాధ్యత ఉందని, ఎవరికి వారు తమకేమీ పట్టనట్టుంటే భారతదేశంలో ధర్మానికి నిలువనీడ లేకుండా పోవచ్చని హెచ్చరించారు. హిందుస్థాన్‌లో హిందువులు మైనార్టీ అయిపోయారనే భయంకరమైన వార్త మన చెవిన వేయరనే గ్యారంటీ లేదని అటువంటి దుర్దినం రాకుండా ఇప్పుడే మేలుకోవాలని హితవుపలికారు.
సభకు ఆర్యసమాజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజేంద్ర జిజ్ఞాసు అధ్యక్షత వహించారు. ఎంవిఆర్ శాస్త్రి రాసిన ‘అసలు మహాత్ముడు’ గ్రంథాన్ని జిజ్ఞాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైదిక సంస్కృతిని పరిపుష్టం చేసేందుకు ఎంవిఆర్ శాస్త్రి చేస్తున్న కృషిని అభినందించారు. ‘అసలు మహాత్ముడు’ పేరిట ఆర్యసమాజ్ ప్రముఖుడు శ్రద్ధానందపై గ్రంథాన్ని రాసి వాస్తవ స్థితిని వివరించారని అన్నారు. అనంతరం యువ నాయకుడు మృత్యుంజయ ఆర్య మాట్లాడుతూ ప్రస్తుత విద్యా వ్యవస్థను పునరావలోకనం చేయాలని అన్నారు. మహిళా నాయకురాలు ఆయుషి ఆర్య మాట్లాడుతూ వైదికశాస్త్రం గొప్పతనాన్ని వివరించారు. ఓమ్ ముని, శృతిశీల్ ఆర్య, గౌరవ్ ఆర్య తదితరులు కూడా మాట్లాడారు. తొలుత ఎంవిఆర్ శాస్త్రికి పరోపకారిణి సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ రాజేంద్ర జిజ్ఞాసు, ఓమ్ ముని తదితరులు ఘన స్వాగతం పలికారు. తరవాత అజ్మీర్ యూనిట్ యువ బ్రిగేడ్ శాస్త్రికి గౌరవ వందనం సమర్పించింది. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఎంవిఆర్ శాస్త్రి మాట్లాడారు. అనంతరం వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన ఆర్యసమాజ్ ప్రతినిధులతో శాస్ర్తీ సమాలోచన నిర్వహించారు. (చిత్రం) అజ్మీర్‌లో శనివారం నాడు పరోపకారిణి సంస్థ రుషిమేళా బహిరంగసభలో ప్రసంగిస్తున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి(ఇన్‌సెట్‌లో) ఎంవిఆర్ శాస్త్రి రచించిన ‘అసలు మహాత్ముడు’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ రాజేంద్ర జిజ్ఞాసు