ధనం మూలం

సంపన్నుల ఇనె్వస్ట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపన్నులు సామాన్యులు ఇనె్వస్ట్‌మెంట్ చేసే తీరులో చాలా తేడా ఉంటుంది. సంపన్నులు ఎలాంటి పెట్టుబడులకు దూరంగా ఉంటారనే అంశంపై ఇటీవల అమెరికలో ఒక సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించింది అమెరికాలోనైనా ఎక్కడైనా దాదాపు ఇనె్వస్ట్‌మెంట్ తీరు ఒకేలా ఉంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లు ఇనె్వస్ట్‌మెంట్‌కు ఎక్కడ ఆసక్తి చూపిస్తారో, సంపన్నులు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నట్టు తేలింది. సంపన్నులు ప్రధానంగా వేటిలో ఇనె్వస్ట్‌మెంట్ చేసేందుకు దూరంగా ఉంటారనే అంశంపై ఆసక్తికరమైన సర్వే నిర్వహించారు.
మన మధ్యతరగతి కుటుంబాల్లో కొంత సొమ్ము సమకూరితే ముందుగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాం. బ్యాంకులపై నమ్మకం, ఇతర పెట్టుబడుల గురించి అంతగా అవగాహన లేకపోవడమే దీనికి కారణం. భద్రత బాగానే ఉంటుంది కానీ రిటర్న్స్ కూడా అదే విధంగా తక్కువగానే ఉంటాయి. అందుకే డబ్బును మరింత డబ్బు చేసే మార్గాల గురించి ఆలోచించే మిలియనీర్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపరట! మన దేశంలోనైనా అమెరికాలోనైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ద్రవ్యోల్భణ శాతానికి మించి రిటర్న్స్ రావడం లేదు. అందుకే మనం వీటిలో ఇనె్వస్ట్‌మెంట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తే, సంపన్నులు వీటి వైపే చూడరు. పైగా సామాన్యులు డిపాజిట్ చేసిన డబ్బును సంపన్నులు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని మరింత సంపాదిస్తారు.
ఎగువ మధ్యతరగతి బాండ్స్‌ను కొనుగోలు చేస్తోంది కానీ సంపన్నులు మాత్రం బాండ్స్ పట్ల ఆసక్తి చూపరు. బాండ్స్ ఇనె్వస్ట్‌మెంట్‌కు సరైన మార్గం కాదని, సంపద సమకూర్చడంలో బాండ్స్ ఉపయోగపడవని భావిస్తారు.
ఎక్కువగా ఆదాయం రాదనే ఉద్దేశంతో సంపన్నులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లకు దూరంగా ఉంటే పిల్లల చదువు, పెళ్లి, రిటైర్‌మెంట్ జీవితం కోసం మధ్యతరగతి వీటిలోనే ఎక్కువగా ఇనె్వస్ట్ చేస్తోంది.
మధ్యతరగతి కూడా స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తోంది. స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వారికి పెన్నీ స్టాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సంపన్నులు పెన్నీ స్టాక్స్‌కు దూరంగా ఉంటారు. కానీ మధ్యతరగతి మాత్రం పెన్నీ స్టాక్స్‌పై ఆసక్తి చూపుతోంది. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో ఒక వెలుగు వెలుగుతున్న పలు స్టాక్స్ ఒకప్పుడు పెన్నీ స్టాక్స్. పది రూపాయల కన్నా తక్కువ ధరకు లభించే స్టాక్స్‌ను పెన్నీ స్టాక్స్‌గా భావిస్తారు. ఒకప్పుడు పది రూపాయల ధర పలికిన స్టాక్స్ వేయి రూపాయల ధర దాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య రంగురాళ్ల వెతకడం కోసం గుంపులు గుంపులుగా వెళ్లినట్టు పెన్నీ స్టాక్స్‌లో తమ భవిష్యత్తు వెతుకుతూ చాలా మంది ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. పెన్నీ స్టాక్స్‌లో కొన్నింటి దశ తిరిగి ఎదిగి ఉండవచ్చు. కానీ ఇదా లాటరీ లాంటిది. లక్షల మంది కొంటే ఎవరో ఒకరికి లాటరీ దక్కినట్టు వేలాది స్టాక్స్‌లో ఏదో ఒక పెన్నీ స్టాక్ దశ తిరుగుతుంది. ఇలాంటి వాటిపై మధ్యతరగతి దృష్టిసారిస్తే, సంపన్నులు మాత్రం పెన్నీ స్టాక్స్‌పై ఇనె్వస్ట్‌మెంట్‌కు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని సర్వేలో తేలింది. ఎక్కువ ధర ఉన్నప్పటికీ మంచి స్టాక్స్‌లోనే సంపన్నులు ఇనె్వస్ట్ చేస్తున్నారు.
బిట్ కాయిన్ గురించి కొంత కాలం క్రితం తెగ వినబడేది. 2017లో ఒక బిట్ కాయిన్‌ధర 17వేల అమెరికా డాలర్లు కాగా, ఏడాది గడిచిన తరువాత 2018లో మూడువేల డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్స్ ధర పెరగడం ఏమిటో అర్థం కాని మాయ. అమెరికాలో సైతం మన భారతీయ మధ్యతరగతి వీటిలో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయింది. సంపన్నులు మాత్రం వీటికి దూరంగానే ఉన్నారట!
ప్రధానంగా మన తెలుగు నాట పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు ఎంతో కొంత బంగారం ఉండాలని భావిస్తారు. మధ్యతరగతి బంగారాన్ని ఇనె్వస్ట్‌మెంట్‌కు సరైనదిగా భావిస్తుంది. లిక్విడిటీ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ధర పెరుగుతుంది. అందుకే చాలా మంది బంగారాన్ని మంచి ఇనె్వస్ట్‌మెంట్‌గా భావిస్తారు. ఆర్థికాభివృద్ధి వేగం తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అదే విధంగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పైకి దూసుకెళుతున్నప్పుడు బంగారం ధర తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ నేల చూపులు చూసినప్పుడు బంగారం ధర పెరుగుంది. యుద్ధ భయం, అనిశ్చితి పరిస్థితుల్లో సైతం బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే కరెన్సీ బంగారం. ఐతే సంపన్నులు తమ సంపద విలువ పెంచుకోవడంలో బంగారంలో ఇనె్వస్ట్‌మెంట్‌పై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదట! భద్రత, లిక్విడిటీ ఉన్నా, బంగారంలో ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదనే ఉద్దేశంతో సంపన్నులు బంగారాన్ని సరైన ఇనె్వస్ట్‌మెంట్‌గా చూడడం లేదు.
బిట్ కాయిన్, స్టాక్స్, ఏదైనా కావచ్చు మనకు తెలియని రంగంలో పెట్టుబడులు పెట్టవద్దని వారెన్ బఫెట్ అంటారు. 11ఏళ్ల వయసు నుంచే స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్‌మెంట్ చేసిన ఇప్పటికీ తనకు తెలియని రంగానికి చెందిన పరిశ్రమల స్టాక్స్‌లో ఇనె్వస్ట్ చేయను అని చెబుతారు. చాలా కాలం పాటు ఐటి రంగంలో సైతం ఆయన ఇనె్వస్ట్ చేయలేదు. తనకు ఆ రంగం గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఇనె్వస్ట్ చేయలేదు అంటారు. మధ్యతరగతి, సామాన్యులు బ్యాంకులో డిపాజిట్లు, బంగారం వంటివాటిని లాభసాటి ఇనె్వస్ట్‌మెంట్‌గా భావిస్తుంటే సంపన్నులు మాత్రం సరిగ్గా వీటికి భిన్నంగా ఆలోచించడం విశేషం.
ఎవరైనా తమకు అవగాహన ఉన్న వాటిలోనే తమ డబ్బు ఇనె్వస్ట్ చేయడానికి అసక్తి చూపుతారు. స్టాక్ మార్కెట్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఇనె్వస్ట్ చేస్తే ఉన్నది ఊడ్చుకు పోతుంది. సంపన్నులు ఏం చేస్తున్నారో మనం అదే చెద్దాం అనుకోవద్దు. మన పరిస్థితులు, మనకున్న అవకాశాలు, అవగాహన బట్టి మన నిర్ణయం ఉండాలి. ఎవరినో అనుసరించాల్సిన అవసరం లేదు.

- బి. మురళి