డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలలాంటి వాళ్ళకి మనం నచ్చడమే అదృష్టం’’
తల్లి మాటలు వింటుంటే హరితకి భయం పట్టుకుంది.
‘‘అతను చాలా ఆదర్శ భావాలు కల అబ్బాయట.. ఆమె నాకు నచ్చగానే సరిపోదు.. ఆమెకి కూడా నేను నచ్చాలి కదా? ఇద్దరూ ఒకరికొకరు నచ్చి మనసులు కలిస్తే పెద్దవాళ్ళు మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టించవచ్చు అన్నాడుట’’-
ఈ మాటలకి హరిత కొంచెం రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకుంది.
అతనెవరో మంచివాడిలాగనే ఉన్నాడు... తన ఇష్టానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు.. తనకి ఇష్టం లేదని చెప్తేస్తే సరి..’ అనుకుంది. అలా అనుకున్నాక కొంచెం టెన్షన్ తగ్గింది.
‘‘వెళ్లి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకో’’ చెప్పింది సుమతి.
హరితకి ఎంతకాదనుకున్నా మనసులో బాధగానే వుంది.. వరుణ్ కోసం కాకుండా మరొక వ్యక్తికోసం అలా అలంకరించుకోవడం...
సరిగ్గా ఆరు గంటలకి వచ్చాడతను. సుదర్శనరావు వెళ్లి సాదరంగా ఆహ్వానించాడు. లోపలికి తీసుకువచ్చాక సుమతినీ, హరితనీ పరిచయం చేశాడు.
‘‘అయాం రవీ..’’’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.
జీన్స్‌పేంట్‌లోకి కాటన్ షర్ట్ టక్ చేసుకున్నాడు. చాలా మామూలుగా అలంకరించుకున్నా అతని ప్రవర్తనలోనూ, మాట తీరులోనూ అదో రకమైన రిచ్‌నెస్ కనబడుతోంది.
సుమతి అందరికీ టిఫిన్లూ, డ్రింక్స్ ఇచ్చింది. కబుర్లు చెబుతూ టిఫిన్ చేయడం పూర్తిచేసాడతను. అతనంత ఫ్రెండ్లీగా ఉన్నా హరితకెందుకో అతన్ని చూస్తుంటే శత్రువుని చూసినట్లనిపిస్తోంది.
‘‘హరితా.. అతనికి ఇల్లు చూపించు’’ చెప్పింది సుమతి.
హరిత అతనికి ఇల్లంతా చూపించింది. ఇద్దరూ డాబామీదికి వచ్చారు.
అతను పిట్టగోడనానుకుని నిలబడ్డాడు. అక్కడికెవరేనా వస్తారేమోనన్నట్లుగా అతను కాసేపు వౌనంగా వున్నాడు. ఎవరూ రారనీ, తామిద్దరికీ ఒంటరిగా మాట్లాడుకునే వీలు కల్పించడానికే తల్లి అలా పంపించిందని హరితకి తెలుసు. రెండు నిమిషాల తర్వాత అతనే అన్నాడు.
‘‘మీ నాన్నగారు చెప్పే వుంటారు.. నాకెందుకో మొదటిచూపులోనే మీరు బాగా నచ్చారు. పరిచయం లేకపోయినా తర్వాత చాలా సార్లు గుర్తుకువచ్చేవారు. ఆ తర్వాతే నాకీ ఆలోచన వచ్చింది.. మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలని’’ అంటూ ఆగి నవ్వాడతను. ‘‘క్షమించండి.. నాకింతకన్నా అందంగా ప్రపోజ్ చేయడం రావడంలేదు.. మీ అభిప్రాయం ఏమిటి?’’
‘‘మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోలేను’’ అంది హరిత.
ఆమె నుంచి ఆ సమాధానాన్ని ఊహించనట్లుగా అతనొక్క క్షణం వౌనంగా వుండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు- ‘‘కారణం తెలుసుకోవచ్చా?’’
‘‘నేను నన్ను ప్రేమించే మనిషిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను’’ అంది హరిత.
దానికతను నవ్వి, ‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తాను’’ అన్నాడు.
హరిత కోపంగా చూసిందతని వంక.
‘‘ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమించరూ? పెళ్లిలో నన్ను చూశారు. నా అందం మీకు నచ్చింది. ఆ తర్వాత మా వివరాలు కనుక్కున్నారు. మీదీ మాదీ ఒకే కులం అని తెలుసుకున్నాక మా నాన్నగారి ఉద్యోగ వివరాలు తెలుసుకున్నారు. మాకున్న ఆస్థిపాస్తులేమిటో కనుక్కున్నారు.. అంతా తెలుసుకున్నాక, మేము మీ హోదాకి సరితూగుతామని అంచనా వేసుకున్నాక ఇపుడు నన్ను ప్రేమిస్తానని అంటున్నారు. ఇదీ ఒక ప్రేమేనా?’’ ఆవేశంగా అంది.
‘‘ఏమిటి మీరంటున్నది?’’ అన్నాడతను అయోమయంగా.
‘‘సారీ.. మా నాన్నగారి దగ్గిర మీరేదో ఆదర్శవాదుల్లా కబుర్లు చెప్పారట.. ఏమిటండీ మీ ఆదర్శం? అంతగా నన్ను ప్రేమించినవారే అయితే ఆ రోజే ముందుగా నాతోఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళూ ఆగి.. ఇన్ని లెక్కలు కట్టుకుని ఇపుడు పెళ్లిచూపుల పేరుతో నన్ను కార్నర్ చేసి ప్రేమిస్తున్నాని చెబితే మీది ఆదర్శమని నమ్మడానికి నేనేం అమాయకురాలిని కాదు’’.
ఆమె వాదనకి అతను ఆశ్చర్యపోయాడు. అతని ముఖం ఎర్రబడింది. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు.
‘‘మీరు చెప్పడం అయిపోయింది కదా? ఇపుడు నేను చెప్పేది కూడా కొంచెం వినండి.. మీరు ఊహించినట్టుగానే నేను మీ వివరాలన్నీ కనుక్కున్నాను. మీదీ మాదీ ఒకటే కులం కాకపోయినా.. మీ తల్లిదండ్రులకి మన పెళ్లి ఇష్టమవ్వాలనుకున్నాను, ఎందుకంటే నాకెలాగూ తల్లిదండ్రులు లేరు. కనీసం నా భార్యకైనా వాళ్ళుండాలనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడంవల్ల వాళ్ళామెకి దూరం కాకూడదని నా అభిప్రాయం.
ఇకపోతే నేను మీ ఆస్థినీ అంతస్థునీ చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కదూ అన్నారు? నా ఆదాయం గురించి తెలిస్తే మీరలా అనరు. ఎవర్నీ నొప్పించకుండా, పెద్దల సమ్మతితో మీ సమ్మతితో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అదే నేను చేసిన పని. లెక్కలు కట్టుకుని ప్రేమించానన్నా.. ఇంకేమన్నా నాకు తెలిసిన ప్రేమ మాత్రం ఇదే’’.
అతను చెప్పింది విన్నాక హరిత తాను తొందరపడి మాట్లాడానా అనుకుంది. వరుణ్‌మీద వున్న ప్రేమతో అతన్ని చులకన చేసి మాట్లాడింది.
‘‘సారీ’’ అంది మనస్ఫూర్తిగా.
‘‘ఇట్సాల్‌రైట్’’ అన్నాడతను.
కొద్దిసేపటికే అతడు మామూలుగా అయిపోయాడు. మళ్లీ ఎప్పటిలాగానే చిర్నవ్వు ప్రత్యక్షమయిందతని ముఖంలో.
‘‘ఏదేమైనా నాకొక విషయం అర్థమయింది. మీకీ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయం సూటిగా చెప్పచ్చు కదా? ఇలా డొంక తిరుగుడెందుకు?’’ అన్నాడు నవ్వుతూ.
హరిత అతని వంక భయంగా చూసింది.
‘‘్భయపడకండి.. నేనీ విషయం మీ నాన్నగారితో చెప్పను. ఎలాగోలా పెళ్లి జరగకుండా మానేజ్ చేస్తాను, ఓకేనా?’’
హరిత సంతోషంగా చూసిందతని వైపు.
కిందికి వచ్చేక అతను సుదర్శనరావు దగ్గిరా, సుమతి దగ్గిరా వీడ్కొలు తీసుకుని బయలుదేరాడు.
‘‘అపుడపుడు వస్తూండు బాబూ’’ చెప్పింది సుమతి అతనితో.
‘‘ఏం మాట్లాడాడు మేడ మీద?’’ అనడిగింది సుమతి హరితని అతను వెళ్లాక.
‘‘ఏముంటుంది మాట్లాడడానికి? ఇంటి గురించి అడిగాడు. ఎపుడు కట్టారు? ఎంతయిందని? వట్టి డబ్బు మనిషిలా వున్నాడు’’ చెప్పింది హరిత ఏదో ఒకటి చెప్పకపోతే ఆమెకి అనుమానం వస్తుందని. అంత మంచి మనిషి గురించి అలా చెప్పడం బాధగా అనిపించినా, వరుణ్‌మీదున్న ప్రేమ ఆమెని అంతకుమించి ఆలాచించనివ్వలేదు.
***
‘‘అతడేమైనా కబురు పెట్టాడా?’’ అని తర్వాత రెండు మూడు సార్లు అడిగింది సుమతి సుదర్శనరావుని.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ