డైలీ సీరియల్

యమహాపురి -74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడి మనసుని వేధించే ఎన్నో ప్రశ్నలకు ఒక్కసారిగా సమాధానం లభించినట్లయింది.
ప్రజలు దొంగలకు పట్టం కడుతున్నారు. వాళ్లు దోచిన సొమ్ముని ‘దాచుకో సిసేం’ అంటూ నరకపురివంటి ఊళ్లలో ఉంచుతున్నారు. వాడుకోవాల్సి వచ్చినపుడు ‘తెరచుకో సిసేం’ అంటూ వెళ్లి తెచ్చుకుంటున్నారు.
యమ ఆ సిసేం నడిపే ఓ ప్రతిభావంతుడు. అతడివంటివారికి కొమ్ముకాసేవారిని- ప్రజలే ఎన్నుకుంటున్నారు. ఆ విషవలయంలో నరకపురి మనుగడకి ఢోకా వుండదు కాక వుండదు.
‘‘ఇన్ని విషయాలు మీకెలా తెలుసమ్మా!’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘మావారికి నా దగ్గిర దాపరికం లేదు. అలాగని అదో గొప్ప లక్షణమనుకునేరు. తన గురించిన ప్రతి రహస్యమూ నాకు మాత్రమే చెప్పడం విశేషమే కానీ- తనకిష్టమైన ఆడపిల్లను తెచ్చుకుని నా ముందే అనుభవించి దాపరికం లేకపోవడమంటే అదే అనుకునే మనిషి ఆయన’’ మాత గొంతు రుద్ధమయింది.
‘‘మరి మీ వైపునుంచి మీరు ఆయన్ని మార్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యలేదా?’’ అన్నాడు రాజా.
‘‘నాకు సలహాలు వినడం నచ్చదు- అని దాపరికం లేకుండా చెప్పిన మనిషిని మార్చడం నాకెలా సాధ్యం? అయినా పరోక్షంగా నా ప్రయత్నం నేను చెయ్యకపోలేదు’’ అంది మాత.
‘‘పరోక్షంగా అంటే?’’
మాత అదోలా నవ్వి, ‘‘పరమ దుర్మార్గులకి మనసులో ఏమూలో అపరాధభావం వేధిస్తూ వుంటుంది. సమయం చూసి చెబితే వాళ్లు మూఢాచారాలను పరమ నిష్ఠగా పాటిస్తారు. మన పురాణాల్లో కూడా మహర్షులకంటే రాక్షసులే ఎక్కువ నిష్ఠగా తపస్సు చేసినట్లు చెబుతారు కదా!
ఆరేడేళ్ల క్రితం నేను మావారికి చెప్పాను- పరమ పాపులు ఎన్ని వైభవాలనుభవించినా- ఏడాదికి రెండు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లి బిచ్చమెత్తుకుని ఆ వచ్చిందాంతోనే జీవించాలని. అదాయనకి బాగా పట్టినట్లుంది.
అప్పట్నించీ ఆయన విదేశయాత్ర పేరిట- నరకపురి వదిలి దేశంలోనే ఎక్కడో ఒకచోట ఓ రెండు నెలలు బిచ్చగాడి జీవితం గడిపి వస్తూంటారు. ఆ నికృష్ట జీవితం అనుభవిస్తే సాటి మనుషులపై ఆయనకి జాలి కలుగుతుందని ఆశించాను. కానీ అలా వెళ్ళొచ్చేక- తన పాపాలు పోయాయనుకుని రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ పాపాలు చేసేవారాయన. పాపాలు పోతాయన్న నమ్మకంతో పాపభీతి పోయిందే తప్ప ఆయనలో ఇంకే మార్పు లేదు’’ అంది.
శ్రీకర్, రాజా ఉలిక్కిపడి ముఖాముఖాలు చూసుకున్నారు.
‘‘ఆయన ఎక్కడ అడుక్కుంటాడో చెప్పగలరా?’’ అన్నాడు శ్రీకర్ కుతూహలంగా.
‘‘అజ్ఞాతమని చెప్పానుగా! అది నాకు కూడా తెలియని రహస్యం’’ అంది మాత.
శ్రీకర్ నవ్వి, ‘‘ఐతే ఆయన బిచ్చగాడిగా ఉండడం లేదని నా నమ్మకం. మీకిలా చెప్పి తానెక్కడికో వెళ్లి విలాస జీవితం అనుభవిస్తున్నాడనుకుంటున్నాను’’ అన్నాడు.
‘‘ఆయనకు నా దగ్గిర దాపరికం లేదు. ఎందుకంటే ఆయనకి నేనంటే భయం లేదు’’ అంది మాత.
‘‘ఏమో, ఈసారికి మీకాయన అబద్ధం చెప్పారేమో!’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఏమో, మీరన్నట్లు గతంలో నాకాయన అబద్ధం చెప్పారనుకోవచ్చు. కానీ ఈసారి ఆయన నాకబద్ధం చెప్పలేదు. ఆ నమ్మకం కుదిరింది కాబట్టే- ఇప్పుడీ కథంతా చెప్పాను..’’ అంది మాత.
‘‘అంటే?’’ అన్నాడు రాజా.
‘‘అంటే ఇప్పుడు నేను చెబుతున్నది తిరుగులేని మాట. నమ్మకంగా చెబుతున్నాను- విను. ఈ ఊళ్ళో ఇంత చేశావు కదా- ఐనా నీకాయన ప్రమాదం తలపెట్టరు. కాబట్టి నువ్వు మరి కాస్త ధైర్యం చేసి నీ కొత్త వ్యవస్థ మరికొన్నాళ్లు కొనసాగేలా ఆయన చేత ఒప్పించాలని నా మనవి’’ అంది మాత.
‘‘ముందిది చెప్పండి. ఆయన నాకు ప్రమాదం తలపెట్టరని అంత నమ్మకంగా ఎలా చెప్పలరు మీరు’ అన్నాడు రాజా.
‘‘ఎలాగంటే?’’ అని ఓ క్షణమాగి, ‘‘బిచ్చగాడిగా ఉండగా- బిచ్చంమీదనే బ్రతకాలని నియమం కదా. అలాంటప్పుడు ఒకోసారి బిచ్చం దొరక్క- ఆకలితో నకనకలాడే పరిస్థితి ఏర్పడొచ్చు. అప్పుడెవరైనా కనుక అన్నం పెట్టి ప్రాణం నిలిపితే- బంగారు కంకణంతో సత్కరించాలని మరో నియమం పెట్టుకున్నాం. అందుకని ఆయన ఓ బంగారు కంకణం తన వద్ద ఉంచుకునేవారు.

ఇంకా ఉంది

వసుంధర