డైలీ సీరియల్

యమహాపురి -70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమ వస్తే తాను ఎదురుపడక తప్పదు. అప్పుడు యమ తనని బ్రతకనివ్వడు.
కానీ ఇంతకాలం బానిసత్వానికి అలవాటుపడ్డ జనం- తన కారణంగా స్వేచ్ఛని రుచి చూశారు. తనకి వారందరి అండదండలూ లభించవా? రాజాలో ఏదో మూల కొద్దిగా ఆశ.
ఆశ పుట్టాక- రాజా ఆలోచన తన వాళ్లమీదకి మళ్లింది. అమ్మ ఎలా ఉందో అనుకుంటూ తల్లికి ఫోన్ చేస్తే ఫోన్ జయమ్మ తీసింది. ఫోన్ చేసింది రాజా అని తెలిసి, ‘‘వీడింకా బ్రతికే ఉన్నాడా- ఎలా?’’ అని తడబడింది.
‘‘ఇన్నాళ్ళూ ఏమైపోయావురా’’ అని ఆత్రం నటిస్తూ తడబాటుని కప్పిపుచ్చుకుంది.
రాజా తనెక్కడున్నదీ చెప్పలేదు. ఆ రోజు శివగిరిలో ఏం జరిగిందీ చెప్పలేదు.
తన గురించి పోలీసులు వెదుకుతున్నారనీ చెప్పలేదు.
‘‘అమ్మెలా వుంది?’’ అనడిగాడు.
‘‘వదినకేం- ఆపరేషన్ చేయించానుగా- నిక్షేపంలా ఉంది. కానీ నీ కోసం బెంగెట్టుకుంది. నిన్ను చూడాలని తపించిపోతోంది. ఒక్కసారి వచ్చి కనపడి వెళ్లు. లేకపోతే రోగం తిరగబెట్టే ప్రమాదముంది’’ అంది జయమ్మ.
‘‘ఒక్కసారి అమ్మకి ఫోనివ్వు. మాట్లాడతాను’’ అన్నాడు రాజా.
జయమ్మ మాలతికి ఫోనిచ్చి స్పీకర్ ఆన్ చేసింది. ‘‘ముందునుంచీ నేను చెబుతున్నాను. నువ్వే అనవసరంగా బెంగెట్టుకున్నావు. రాజా బాగానే ఉన్నాడు. నీతో మాట్లాడతాట్ట’’ అంది.
ఫోన్ ఇస్తుంటే జయమ్మ చేతులు వణికాయి.
రాజాకి ప్రసాదంలో విషం కలిపిచ్చింది తను. రాజా అది తినలేదా? ఎందుకు తినలేదు? అసలా రోజు ఏం జరిగింది? రాజాకి తనమీద అనుమానం వచ్చిందా? ఇప్పుడు తల్లికి ఏం చెబుతాడు?
ఇలా కలవరపడింది కాని జయమ్మ భయపడ్డట్లు ఏం జరగలేదు. రాజా తల్లికి జయమ్మకి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. తల్లికీ, తమ్ముడికీ జాగ్రత్తలు చెప్పాడు. తను బాగానే ఉన్నాననీ- త్వరలో ఇంటికి వస్తాననీ- అప్పుడు అన్నీ వివరంగా చెబుతాననీ చెప్పాడు. ఈలోగా తనకి ఫోన్ కూడా చెయ్యొద్దని చెప్పాడు.
మాలతి అయిష్టంగానే అన్నింటికీ ఒప్పుకుని, ‘‘నిన్ను చూడాలనుందిరా. ఏమాత్రం వీలున్నా ఒక్కసారి కనిపించు వెళ్లు’’ అంది.
ఆమె గొంతులో అయిష్టాన్ని రాజా గుర్తించాడు. అతడి మనసేదోలా ఐపోయింది. ‘‘ఒక్కసారి అమ్మని చూడాలనుంది’’ అన్నాడు రాణితో.
రాణి అతడి ముఖభావాల్ని అర్థం చేసుకుంది. ఐతే ఆమె ఆలోచనలు వేరే ఉన్నాయి.
‘‘యమ వచ్చే రోజు దగ్గిరపడింది. ననే్నం చేస్తాడో తెలియదు కానీ- యమ నిన్ను చంపెయ్యడం తథ్యం. నువ్వు పట్నం వెళ్లిపో. వెడుతూనే ఇన్‌స్పెక్టర్ శ్రీకర్‌ని కలుసుకుని ఆయనకి లొంగిపో. ఆయనకి శివగిరిలో ఏం జరిగిందో తెలుసు. నిన్ను అర్థం చేసుకుంటాడు. తర్వాత మీ అమ్మని కలుసుకోవచ్చు’’ అంది రాణి.
‘‘ఈ ఆలోచన నాకూ వచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఉంది. నిలువ నీడలేని పరిస్థితుల్లో అత్తయ్య మమ్మల్ని చేరదీసి తనింట్లో ఉంచుకుంది. తను మా ఆస్తి కాజేసుంటే ఆ పాపం ఆమెది. నేను మాత్రం ఆమె మాకు ఆశ్రయమిచ్చిందనే గుర్తుంచుకుంటాను. అదీగాక ఆమె నాన్నకి స్వయానా అక్క. మా అమ్మకి కూడా ఆమెని తప్పుపట్టినా, ఆమెకి హాని కలిగించాలన్నా నచ్చదు. అందువల్ల శివగిరిలో బిచ్చగాడు తిన్న విహాహారం అత్తయ్యే నాకిచ్చిందని పోలీసులకి చెప్పలేను. చెప్పకపోతే, ఆ కేసులో నేనే హంతకుడినౌతాను. హంతకుడిగా అక్కడ శిక్ష పొందడంకంటే- ఈ గ్రామోద్దరణలో ఇక్కడే నా ప్రాణం పోయినా ఫర్వాలేదనిపిస్తోంది’’ అన్నాడు రాజా.
రాణి ఆశ్చర్యపోయింది.
రాజా కుటుంబానికి ఎంత న్యాయం చెయ్యాలో అంతా చేసింది జయమ్మ. ఇంకా చెయ్యాలనుకుంటోంది. రాజానే చంపబోయింది. ఆమెని కాపాడ్డం కోసం - నరకపురి రోట్లో తలపెట్టి తియ్యనంటున్నాడు రాజా. అది సంస్కారమా, మంచితనమా, ఉదాత్తతా లేక నరకపురి చేసుకున్న పుణ్యమా?
‘‘రాజా! నీ ఆలోచన గొప్పది. కానీ అంతకంటే గొప్పవాడివి నువ్వు. అలాంటి నువీ ఊరికోసం బలి కావడమంటే- బూడిదలో పన్నీరు పొయ్యడమే. అది నాకిష్టం లేదు. ఆ ఊరికి చెయ్యగలిగింది చేశావు. ఇకమీదట తమకోసం తామే ఏదైనా చెయ్యాలి వాళ్లు. ఇంకా నువ్వే ఏదో చెయ్యాలనుకోవడం అర్థం లేని ఆలోచన’’ అంది రాణి.
రాజా నవ్వి, ‘‘సరిగ్గా నా మనసులో మాటే నువ్వూ చెప్పావు. ఈ ఊరికోసం చెయ్యగలిగింది చేశాను. ఇక గ్రామస్థులు చెయ్యగలిగింది చేస్తారన్న నమ్మకమే నన్నిక్కడుంచుతోంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు స్వేచ్ఛ మరిగారు. అందుకు నాపట్ల వారికి కృతజ్ఞత వుంటుంది. అదీకాక ఈ స్వేచ్ఛని వాళ్లొదులుకోలేరు. యమ ననే్నదైనా చెయ్యబోతే- వాళ్లే నన్ను రక్షిస్తారు. ఇది నా ఆశ కాదు. నమ్మకం’’ అన్నాడు.
‘‘నీ నమ్మకం నిజమవాలని నా ఆశ. నమ్మకానికైనా ఋజువుండాలని సైన్సు అంటుంది. ఒకసారి ఊరి వారందర్నీ సమావేశపరిచి యమ రాక గురించి చెప్పి వారి స్పందనలు తెలుసుకుందాం’’ అంది రాణి.
ఆ ప్రకారం ఒక రోజు యమ ప్రాంగణంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటైంది. రాజా గ్రామస్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘మన ఏలిక, మన దేవుడు- యమ. ఆయన ఆదేశంమీద ఆయన ప్రతినిధిగా నేనిక్కడి వ్యవస్థలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టాను.
ముచ్చటగా మూడు రోజుల్లో మన దేవుడు యమ తన విదేశయాత్రని దిగ్విజయంగా ముగించుకుని ఊరికి తిరిగొస్తున్నాడు. కొత్త ఆలోచనలతో వస్తున్న ఆయనకు మీరు మీ మీ కొత్త అనుభవాలు వినిపించాల్సుంది. కానీ ఆయనొచ్చేక ఎదుటబడి మీ మనసులో ఏమున్నదీ చెప్పడానికి మీరు భయపడొచ్చు. అందుకని ఆ మాటేదో ఇప్పుడు నాకు చెప్పండి. నేనాయన్ను తీసుకురావడానికి పట్నం వెళ్లాలి కదా! అప్పుడు మీ మాటలు ఆయనకి చేరవేస్తాను. ఆయన వచ్చి మీ అభీష్టం నెరవేరుస్తారు’’ అన్నాడు.
సభికుల్లో కాసేపు కలకలం. ఆ తర్వాత నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక వృద్ధుడు లేచి నిలబడి, ‘‘మేమెవరమో మాకు తెలియదు. మాకేం కావాలో మాకు తెలియదు. మా నాయకుడే మా దేవుడు. ఆయన మేము మనుషులంటే మనుషులం. బానిసలంటే బానిసలం.

ఇంకా ఉంది

వసుంధర