డైలీ సీరియల్

యమహాపురి 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంతవరకూ నాకు పోలీసు రికార్డు లేదు సార్!’’ అన్నాడు అప్పూ చటుక్కున.
‘‘పోలీసు రికార్డులు లేని చాలామంది- దొంగనోట్లు అచ్చేస్తున్నారు. మర్డర్లు చేస్తున్నారు..’’
‘‘నన్ను నమ్మండి సార్! పోనీ మీరు నేనుండే గదికొచ్చి చుట్టుపక్కల వాకబు చెయ్యండి. నా కారెక్టర్ గురించి ఏ ఒక్కరు చెడుగా చెప్పినా- మీరే శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధం’’ అన్నాడు అప్పూ.
‘‘నువ్వు స్వతహాగా మంచివాడివే కావచ్చు. కానీ- నీకు తెలుసుగా- మంత్రి తప్పుడు దారిలో నడిస్తే మంత్రికింద పనిచేసే ఐఎఎస్‌లు కూడా తప్పుదారి పట్టడం చూస్తున్నాం. నువ్వు కూడా నీ యజమాని కోసం తప్పు చేసే అవకాశముంది. ఆ అమ్మాయిని నీ యజమాని కోసం తీసుకెడుతున్నావ్. ఔనా?’’ అన్నాడు శ్రీకర్.
అప్పూ తల అడ్డంగా ఊపి, ‘‘లేదు సార్! నా యజమాని డిఫరెంట్. ఆనెస్ట్. తను నేరం చెయ్యడు సరికదా- పోలీసు రికార్డులున్నవారిని పనిలో కూడా పెట్టుకోడు. ఇప్పుడు మీరు నామీద కేసు రిజిస్టర్ చేస్తే, నా ఉద్యగం పోతుంది’’ అన్నాడు.
‘‘ఇంతకీ నీ యజమాని ఎవరు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నేను జయదేవ్ టిఫిన్ సెంటర్లో సర్వర్ని సార్!’’ అన్నాడు అప్పూ.
శ్రీకర్ అతణ్ణి ఆ టిఫిన్ సెంటర్ చిరునామా, వివరాలు అడిగి తెలుసుకుని, ‘‘ఏమిస్తారు నీకు జీతం?’’ అన్నాడు సాలోచనగా.
‘‘నెలకి పదివేలు’’ అన్నాడు అప్పూ.
‘‘నెలకి పదివేల జీతంతో నలభై వేలు ఖరీదు చేసే మొబైల్ వాడుతున్నావు...’’ అన్నాడు శ్రీకర్.
‘‘నా తిండి ఖర్చంతా టిఫిన్ సెంటర్లోనే వెళ్లిపోతుంది సార్’’ అన్నాడు అప్పూ.
‘‘మరి నీ రూం రెంట్?’’’
‘‘నా యజమాని పే చేస్తాడు సార్!’’ అన్నాడు అప్పూ.
‘‘ఎంతేమిటి రూం రెంట్?’’
‘‘సెంటర్లో ఉంది కదా- కరెంటు. నీళ్లు కలుపుకుని నెలకి పదివేలు సార్!’’
‘‘అంటే పనికి పదివేలు. ఇంటద్దెకి పదివేలు- నీ జీతం ఇరవై వేలన్నమాట!’’ అన్నాడు శ్రీకర్.
అప్పూ తడబడి, ‘‘ఊ’’ అన్నాడు.
‘‘జీతం, ఇంటద్దె- ఇంకా ఏమేమిస్తారు నీకు?’’
‘‘ఇంకేం లేదండి’’’ నసిగాడు అప్పూ.
‘‘ఇంతకీ టిఫిన్ సెంటర్లో నీ పనేమిటి?’’
‘‘జస్ట్ సెర్వింగ్. అంతేనండి’’
‘‘అలాగా- ఐతే మీ సెంటర్లో పనిచేసిన మున్నా తెలుసా నీకు?’’
‘‘అప్పూ ఆశ్చర్యంగా, ‘‘మున్నా కొన్నాళ్లక్కడ పనిచేసి మానేశాడు. మీకెలా తెలుసు?’’ అన్నాడు.
‘‘ఇప్పుడు మా కాలనీలో సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడులే. జయదేవ్ టిఫిన్ సెంటర్లో ఇచ్చే జీతం చాలక- ఇక్కడ చేరానన్నాడు. మా వాళ్లు నెలకి నాలుగు వేలిస్తారు’’ అన్నాడు శ్రీకర్.
సంభాషణ దేనికి దారి తీస్తోందో గ్రహించాడు అప్పూ. ఒక్క నిమిషం ఆలోచించి, ‘‘మామూలుగా టిఫినూ, కాఫీ, టీ సర్వ్ చేసేవాళ్లకి- జీతం తక్కువ సార్!’’ అన్నాడు.
‘‘మరి నువ్వేం సెర్వ్ చేస్తావ్?’’ అన్నాడు శ్రీకర్.
అప్పూ కాస్త తడబడి, ‘డబుల్ స్పెషల్ చాయ్’’ అన్నాడు.
‘‘చాయ్ నువ్వు కలుపుతావా?’’’
‘‘ఉహూ’’ తల అడ్డంగా ఊపాడు అప్పూ.
‘‘కలిపేది నువ్వు కానప్పుడు- మామూలు టీ ఇస్తేనేం, డబుల్ స్పెషల్ ఛాయ్ ఇస్తేనేం? జీతం తేడాగా ఎందుకుండాలి?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నాకేం తెలుస్తుంది సార్?’’ అన్నాడు అప్పూ దీనంగా.
‘‘నాకు తెలుసు’’ అన్నాడు శ్రీకర్. ‘‘నువ్వా సెంటర్లో సర్వర్‌వే కానీ- సర్వ్ చేసేది చాయ్ కాదు- అమ్మాయిల్ని. ఊళ్లో అమాయకులైన ఆడపిల్లల్ని వలేసి పట్టుకుని మీ వాళ్లకి అప్పగిస్తావ్. అందుకే నీ చేతిలో ఈ మొబైల్. ఊళ్లో నీకు గది. ఈవేళ అలాంటి ప్రయత్నంలోనే దొరికిపోయావ్. ఔనా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఎక్కణ్ణించి ఎక్కడికొచ్చారు సార్! ఇంటరాగేషన్లో మీకు మీరే సాటి..’’ అన్నాడు సుందరం చటుక్కున.
సుందరం అలా ఎందుకన్నాడో శ్రీకర్‌కి తెలుసు. నిందితుణ్ణి తాను అడగదల్చుకున్నదేమిటో తెలియకుండా గజిబిజి చేస్తుందా మాట!
‘‘లేదు సార్! మీరు పొరబడ్డారు. మా సెంటర్‌కి అలాంటి పనులతో సంబంధం లేదు’’ అన్నాడు అప్పూ.
‘‘పోనీ, ఎలాంటి పనులతో సంబంధముందో చెప్పు’’
‘‘అది టిఫిన్ సెంటర్ సార్! టిఫినుకి సంబంధించిన పనులతోనే సంబంధముంటుంది’’.
శ్రీకర్ నవ్వి, ‘‘మా ఊళ్ళో ఒకాయనుండేవాడు. ఆయనకి బయట ఆడవాళ్ళతో సంబంధాలుండేవి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు- ఎక్కడికని పెళ్లాం అడిగితే- టిఫిన్ సెంటర్‌కి అనేవాడు. అర్థమైందా’’ అన్నాడు.
‘‘కాలేదండి’’ అన్నాడు అప్పూ.
‘‘అనుకున్నాను. అర్థం కాదని. నీకు నిర్భయ చట్టం గురించి తెలిసుంటే- డబల్ స్పెషల్ చాయ్ సర్వింగుకి ఒప్పుకునేవాడివి కాదు. సరేలే నీకిక్కడే ఉండిపోవాలని రాసిపెట్టుంటే నేనేం చెయ్యలను?’’ అంటూ లేచాడు శ్రీకర్.
ఏమనాలో తెలియక అసహాయంగా, భయంగా అలాగే కూర్చుని చూస్తున్నాడు అప్పూ.
సుందరం అప్పూతో, ‘‘సార్ మాటలు నీకు నిజంగానే అర్థం కావాలి. నువ్వు సార్ చేతుల్లో వున్నంతకాలం ఇంటరాగేషన్ ఇలా మెత్తగా గమ్మత్తుగా ఉంటుంది. నిర్భయ చట్టం కింద నీమీద కేసు బుక్కయితే నువ్వు చేతులు మారతావు. అప్పుడు ఇంటరాగేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో నీకు ఊహకందదు’’ అన్నాడు.
అప్పూ చటుక్కున లేచి నిలబడి, ‘‘వెళ్లిపోకండి సార్! నాది మట్టిబుర్ర. డొంక తిరుగుడుగా అడిగితే అర్థం కాదు. మీకేం కావాలో సూటిగా అడగండి. నాకు తెలిసింది చెబుతాను’’ అన్నాడు.
‘‘జయదేవ్ టిఫిన్ సెంటర్లో- మిగతా వాళ్లకంటే ఎక్కువ జీతం నీకు. అందుకు నువ్వు చేసే పనేమిటి?’’ సూటిగా, కటువుగా అడిగాడు శ్రీకర్.
‘‘ఇక లాభం లేదు. నిజం చెప్పేస్తాను సార్’’ అన్నాడు అప్పూ.

ఇంకా ఉంది

వసుంధర