డైలీ సీరియల్

యమహాపురి 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక బిచ్చగాడు సంజాయిషీగా, ‘కుంటోణ్ణి బాబయ్యా! వాడితో సమంగా పరుగెత్తలేనని కదల్లేదు’’ అన్నాడు.
‘‘మరి నీకేమైందిరా?’’ అన్నాడు సుందరం మిగతా ముగ్గుర్నీ.
‘‘కూర్చుని అడుక్కునేవాళ్లం, పరుగులు మాకెక్కడ చేతనౌతాయి బాబూ! అందుకని మాకు చేతనైన పని రాళ్లు తీసుకుని విసిరాం’’ అన్నారు వాళ్లలో ఒకడు.
‘‘రోజంతా కూర్చునే ఉంటారుగా- ఇలాంటప్పుడు కూడా కాస్తయినా శ్రమపడకూడదని నియమం పెట్టుకున్నారన్నమాట!’’ అన్నాడు సుందరం నిరసనగా.
‘‘నియమాలేం లేవు బాబూ మాకు! శ్రమపడితే ఫలితముండాలనుకుంటామంతే! తమరే చెప్పండి. పోలీసోళ్లు- పరుగు అలవాటున్న మీరే వాణ్ణి అందుకోలేకపోయారు. అలవాటు లేని మావల్లనౌతుందంటారా! అది తెలిసే కదల్లేదు మేము’’ అన్నాడింకో బిచ్చగాడు.
‘‘సరేలెండి- మిమ్మల్ని నమ్ముకుంటే నా పరిశోధన అడుక్కుతిన్నట్లే ఉంటుంది కానీ- ఆ పారిపోయినవాణ్ణి మళ్లీ చూస్తే గుర్తుపట్టగలరా?’’ అన్నాడు సుందరం.
‘‘ఇక్కడికి తీసుకొచ్చి చూపించినా, మమ్మల్ని జీపులో వాడి దగ్గరకి తీసుకెళ్లినా సరేనండి- గుర్తుపడతాం’’ అన్నాడు ఓ బిచ్చగాడు.
‘‘అంటే మీరు మాత్రం మీకు మీరుగా కదలరన్నమాట! అడుక్కుతిన్నట్లే ఉంది నా పరిశోధన’’ అని, ‘‘ఐనా అడుక్కుతినేవాడి హత్య, దానికి అడుక్కుతినేవాళ్ల సాక్ష్యం. ఇక పరిశోధన అడుక్కుతినేలా కాక మరోలా ఎందుకుంటుంది?’’ అని మనసులో అనుకుని, ‘‘సరే, ఆ మనిషిని బాగా గుర్తుంచుకోండి. ఇది బిచ్చగాడి హత్యకేసే కావచ్చు. నేను మాత్రం యమా సీరియస్’’ అన్నాడు సుందరం.
సరేనని బిచ్చగాళ్లు నలుగురూ మెట్లమీద తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నారు.
సాటి బిచ్చగాడికోసం ఓ యువకుడితో గొడవ పెట్టుకున్న ఆ బిచ్చగాళ్లు- ఇప్పుడా బిచ్చగాడి శవాన్ని అక్కడే వదిలేసి యథాస్థానాలకి వెళ్లిపోడం చూసి- సుందరం భారంగా నిట్టూర్చాడు.
‘‘మనిషికి అనుబంధాలుండవు- స్వార్థం తప్ప!’’ అనుకున్నాడు సుందరం.
కాసేపట్లో అంబులెన్స్ వచ్చి అక్కడ ఆగింది.

4
అది ఆ నగరంలో వెయ్యిళ్లకుపైగా వున్న అందమైన ‘విశిష్ట’ కాలనీ.
కొత్తగా మెరిసిపోతున్న రోడ్లు. రోడ్లమధ్యలో డివైడర్లు. డివైడర్లలో రకరకాల పూల మొక్కలు.
రోడ్డుకి పక్కగా ఫుట్‌పాత్. ఫుట్‌పాత్ పక్కన పచ్చదనం నింపుకున్న చెట్లు.
అది సాయం సమయం. పెద్దగా జనసంచారం లేదు.
ఫుట్‌పాత్‌మీద నడుస్తున్నాడు ఆ కాలనీకే చెందిన ఓ పెద్దాయన.
వయసు అరవై దాటి ఉండొచ్చు. బట్టతల. వాకింగుకొచ్చాడో, గాలికోసం వచ్చాడో కానీ మల్లెపూవులాంటి తెల్ల లాల్చీ, తెల్ల లుంగీలో కాజువల్‌గా ఉన్నాడు. ఏమాలోచిస్తున్నాడో కానీ ఈ లోకంలో ఉన్నట్లు లేదు. తానున్న లోకంలో ఏం చూస్తున్నాడో కానీ మధ్యమధ్య చిరునవ్వులు చిందిస్తున్నాడు.
‘‘ఇన్స్‌పెక్టర్ భయంకర్‌గారి ఇల్లెక్కడండీ!’’
ప్రశ్న ఈ లోకంలో ఆయన వెనుకనుంచీ వచ్చింది. ఆ లోకంలో ఉన్న ఆయన్ను చేరలేదు.
‘‘ఇన్స్‌పెక్టర్ భయంకర్‌గారి ఇల్లెక్కడండీ!’’
ఈసారి ఆ ప్రశ్న కాస్త గట్టిగా వచ్చిందేమో- ఆయన ఆలోకం నుంచి ఈ లోకానికొచ్చి చటుక్కున వెనుదిరిగాడు.
పాతికేళ్లలోపు యువకుడు. ఆకర్షణీయమైన రూపం, చురుకైన కళ్లు. అతడాయన్ని చూస్తూనే పలకరింపుగా, స్నేహపూర్వకంగా నవ్వాడు.
పెద్దాయన ముఖంలో ఆ లోకపు చిరునవ్వు మాయమైంది. ఆ యువకుణ్ణి కళ్లు చిట్లించి చూశాడు. ‘‘ఆయనతో నీకేం పని?’’ అన్నాడు.
చెప్పాలని కాబోలు నోరు తెరిచాడా యువకుడు. అంతలోనే చెప్పొచ్చా అన్న సందేహంతో కాబోలు పెదవులు మూతపడ్డాయి. ఏదో ఒకటి చెప్పాలి కదా అన్న వివేకం స్ఫురించింది కాబోలు, పెదవులు మళ్లీ కదిలాయి.
‘‘నేనాయన అభిమానిని. ఒకసారి దర్శనం చేసుకుని వెడదామని..’’ నసిగాడు యువకుడు.
పెద్దాయన అతణ్ణదోలా చూసి ‘‘అన్నట్లు నువ్వడిగింది ఇన్స్‌పెక్టర్ భయంకర్ గురించి కదూ!’’ అన్నాడు
‘‘ఊ’’ అన్నాడు యువకుడు.
‘‘నువ్వాయన అభిమానివంటే నేను నమ్మను’’ అన్నాడు పెద్దాయన.
యువకుడి ముఖంలో కాస్త చిరాకు. ‘‘పోనీ, నమ్మకండి. నాకాయన ఇల్లు చూపించండి చాలు’’ అన్నాడు.
‘‘నువ్వాయన అభిమానివి కాకపోతే, ఇల్లు చూసినా ఆయన్ని కలుసుకోలేవు. కలుసుకున్నా ఆయనతో మాట్లాడలేవు’’ అన్నాడు పెద్దాయన.
‘‘నేనాయన అభిమానినే సార్! మీరు నమ్మకపోయినా ఆ విషయం ఆయన నమ్ముతారు’’ అన్నాడు యువకుడు.
‘‘నువ్వాయన అభిమానివి కాదు. ఆ విషయం నీ మాటల్లోనే నాకు తెలిసిపోయింది. ఆయన కూడా నువ్వు తన అభిమానివంటే నమ్మరు. ఆ విషయం రాసివ్వగలను’’ అన్నాడు పెద్దాయన.
భయంకర్ ఇల్లెక్కడా అనడిగాడు తను. ఆ మాటల్లో తను భయంకర్ అభిమాని కాదని తెలిసే విశేషం ఏముందా అని ఆశ్చర్యంలో పడ్డాడా యువకుడు. ఆ విషయం ఆయనే్న అడుగుదామనుకునేలోగా-

వసుంధర