డైలీ సీరియల్

యమహాపురి-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈలోగా బిచ్చగాడి కేక విని- మెట్లమీద కూర్చున్న నలుగురు బిచ్చగాళ్లు పరుగున వచ్చారు. ఇద్దరు పడిపోయిన బిచ్చగాణ్ణి పరీక్షిస్తుంటే, ఇద్దరు యువకుడి దగ్గిరకొచ్చారు. ‘‘ఏమయింది?’’ అన్నాడు యువకుడు.
‘‘ఏమయిందో నువ్వు చెప్పాలి’’ అన్నాడు అతడికి దగ్గిరగా వచ్చిన వారిలో ఒకడు.
యువకుడేదో అనేలోగా, ‘‘వీడికి నాడి కొట్టుకోవడం లేదు’’ అంటూ అరిచాడో బిచ్చగాడు.
‘‘వీడు ఊపిరి పీల్చడంలేదు’’ అరిచాడింకో బిచ్చగాడు.
యువకుడు కంగారు పడలేదు. ‘‘పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. ఆకలేస్తోంది ప్రాణం పోతోందని బ్రతిమాలితే, నాకోసం తెచ్చుకున్న ప్రసాదం పెట్టాను. వాటం చూస్తే మీరంతా కలిసి ఏదో డ్రామా ఆడుతున్నట్లుంది’’ అన్నాడు.
అంతే, కూర్చున్నవాళ్లలో ఒకడు లేచి, ‘ప్రాణం పోతోందని ఏదైనా పెట్టమంటే, ప్రాణం తీసే తిండి పెడతావా? మావాణ్ణి చంపేసింది చాలక, మేము డ్రామా ఆడుతున్నామంటావా’’ అంటూ యువకుడి మీద కొచ్చాడు.
యువకుడు తడబడ్డాడు కానీ బింకంగా ‘‘ఏంటీ, మీదకొస్తున్నావ్?’’ అన్నాడు.
బిచ్చగాడు బదులివ్వలేదు. యువకుడి కాలరు పట్టుకుని, ‘‘మావాణ్ణేం చేశావో చెప్పు’’ అన్నాడు.
యువకుడికి మాట రాలేదు. విడిపించుకునే ప్రయత్నం చెయ్యబోయాడు. ఈలోగా మిగతా ఇద్దరు బిచ్చగాళ్లూ కూడా లేచి అతడి దగ్గిరకొచ్చారు.
యువకుడికేం చెయ్యాలో పాలుపోలేదు. ‘హెల్ప్’ అనరిచాడు గట్టిగా.
***
అక్కడేదో గొడవౌతోందని తెలిసినా- అది బిచ్చగాళ్ల మామూలు గొడవ కామోసనుకున్నాడు సుందరం. హెల్ప్ అన్న కేక వినగానే అక్కడేదో తేడా వచ్చిందని అర్థమై, చటుక్కున లేచి పరుగున గొడవ జరుగుతున్న చోటికి వెళ్లాడు. సుందరాన్ని చూస్తూనే బిచ్చగాళ్లు వెనక్కి తగ్గారు. యువకుడికి కాస్త ధైర్యం వచ్చింది.
సుందరం పోలీసు కళ్ళకి ముందు నేలమీద పడి వున్న చింపిరి జుట్టు బిచ్చగాడు కనిపించాడు.
‘‘జిడ్డు సుబ్బడు కాదు’’ అనుకున్నాడు సుందరం. ఓసారి చుట్టూ చూసి, ‘‘ఏం జరుగుతోందిక్కడ?’’ అన్నాడు.
‘‘ఒక్కణ్ణీ చేసి, వీళ్లు నన్ను ఎటాక్ చేస్తున్నారు’’ అన్నాడు యువకుడు.
‘‘ఏరా, అడుక్కుతినడంతోపాటు దౌర్జన్యలు కూడా మొదలెట్టారా?’’ గద్దించాడు సుందరం.
అప్పటికి ఓ బిచ్చగాడు కాస్త తమాయించుకుని, ‘‘దౌర్జన్యం కాదండి. హత్య. చేసింది మేం కాదండి. వీడేనండి. శవమిక్కడే ఉంది. హంతకుడూ ఇక్కడే ఉన్నాడు. తమరే విచారించండి’’ అంటూ యువకుణ్ణి వేలెత్తి చూపించాడు.
నేలమీద పడున్న బిచ్చగాణ్ణీ, అక్కడే నిలబడ్డ యువకుణ్ణీ మార్చి మార్చి చూశాడు సుందరం. ‘‘వీళ్ళు చెబుతున్నది నిజమా?’’ అన్నాడు యువకుణ్ణి చురుగ్గా చూస్తూ.
యువకుడు తల అడ్డంగా ఊపాడు. ‘‘నేను మీకు హత్యలు చేసేవాడిలా కనిపిస్తున్నానా? ఐనా ఓ బిచ్చగాణ్ణి చంపాల్సిన అవసరం నాకేమిటి?’’ అన్నాడు.
దీనికి ఓ బిచ్చగాడు అఫెండయ్యాడు. ‘‘్భమీద తప్పులు చేసేవాళ్లు అదేపనిగా పెరిగిపోతున్నారు. పాపాలు పోగొట్టుకుందుకు వాళ్ళు ముష్టోళ్ళ దగ్గిరకొచ్చి తెగ దానాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో చదువుకున్న బాబులకంటే ఎక్కువ సంపాదిస్తున్నాం మేం! బిచ్చగాళ్లని మమ్మల్ని అంతలా తీసిపారేయొద్దు!’’ అన్నాడు.
‘‘ఎంత సంపాదించినా బిచ్చగాడు బిచ్చగాడే కదా!’’ అన్నాడు సుందరం నిరసనగా.
‘‘అదే చెబుతున్నా బాబూ! ఉద్యోగమున్న బాబులకే, వచ్చే జీతాలు తక్కువ. ఇక ఉద్యోగాల్లేని బాబుల సంగతి చెప్పాలా? కూలి పని చెయ్యడానికి నామోషీ. దొంగతనం చెయ్యాలంటే భయం. అందుకని వాళ్లు మా మీద పడ్డారు. మా దగ్గిర దొంగతనం చేసినా, ఆఖరికి మమ్మల్ని చంపి పారేసినా అడిగేవాళ్లుండరని- అందరికీ మేమంటే లోకువ. డబ్బు కోసమే వీడు మావాణ్ణి చంపేశాడు’’ అన్నాడు బిచ్చగాడు.
‘‘డబ్బు కోసం బిచ్చగాణ్ణి చంపానా? నన్ను సోదా చేసి చూడండి. ఎంత దోచుకున్నానో తెలుస్తుంది’’ అన్నాడు యువకుడు సుందరంతో.
సుందరానికి ఆ యువకుడిమీద సానుభూతి కలిగింది. ‘‘అసలేం జరిగిందిక్కడ?’’ అన్నాడు.
యువకుడు సుందరానికి జరిగింది చెప్పాడు.
అప్పుడు సుందరం నేలమీద పడున్న బిచ్చగాణ్ణి సమీపించాడు. వంగుని వాడి చెయ్యి పట్టుకుని నాడి చూశాడు. అతడి ముఖం గంభీరంగా ఐపోయింది. సాలోచనగా చెయ్యి వదలగానే- అది జీవం లేని పదార్థంలా కింద పడిపోవడంతో బిచ్చగాడు చనిపోయాడని రూఢి అయింది. ఐనా అనుమానం తీరక నేలమీద పడున్న ఆ బిచ్చగాడి ముక్కు దగ్గిర వేలు పెట్టి, ‘మై గాడ్, వీడు నిజంగానే చచ్చిపోయాడు’’ అన్నాడు సుందరం.
ఆ విషయం ముందే తెలిసినట్లు, ‘‘ ఆ మాట ఇందాకే చెప్పాను. కానీ మావాడు చావలేదు బాబూ! వీడు చంపేశాడు’’ అన్నాడు నిలబడున్న ఓ బిచ్చగాడు.
సుందరం యువకుడివైపు తిరిగి, ‘‘మిస్టర్! వీడు చచ్చిపోయాడు. అది కూడా నువ్వు పెట్టిన ప్రసాదం తిన్నాక!
ఇంకా ఉంది

వసుంధర